
అనంత తేజోమయుడు
సూర్య,చంద్రప్రభలపై మెరిసిన దేవదేవుడు
ఊంజల్‌సేవలో సేదతీరిన శ్రీవేంకటేశుడు
నేడు తేరోత్సవం (రథోత్సవం)
సాక్షి, తిరుమల : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన కాంతుల్లో దేవదేవుడు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యకాంతుల మధ్య భాస్కరునిపై తిరునామాల నల్లనయ్య స్వర్ణకాంతులీనుతూ భక్తులను కటాక్షించారు. సాయంత్ర వేళలో ఆలయంలో వెలుపల సహస్రదీపాలంకరణ సేవలో స్వామి ఊయలలూగుతూ దర్శనమిచ్చారు. రాత్రి చంద్రప్రభ వాహనసేవలో మంగళధ్వనులు, పండితుల వేద ఘోష నడుమ చల్లనయ్య శ్వేతవర్ణ కలువపూల అలంకరణలో భక్తలోకానికి దివ్యమంగళ రూపంలో దర్శన భాగ్యం కల్పించారు.
ఉదయం వాహన సేవలో రద్దీ కనిపించినా, రాత్రి వాహన సేవలో తక్కువగా కనిపించింది. బుధవారం తేరు సందర్భంగా ఆలయంలో నిర్వహించే కైంకర్య వేళల్లో మార్పులు చేశారు. వాహన సేవల్లో కళాకారులు, దాస సాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారుల అభినయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ వాహన సేవల్లో భద్రతా సిబ్బంది హడావిడి ఏమాత్రమూ తగ్గలేదు.
శ్రీవారి రథోత్సవానికి సర్వం సిద్ధం
బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు బుధవారం శ్రీవారి తేరు ఊరేగింపు (రథోత్సవం) నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తేరును సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో తొలుత భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఉన్నతాధికారులతో తేరుచక్రాలను పరీక్షించి మరమ్మతులు పూర్తి చేశారు. తేరుకు నూతనంగా రంగులు అద్దారు. ద్వార పాలకులు, రాక్షసులు, గంధర్వులు, దేవతామూర్తుల ప్రతిమలు ఏర్పాటు చేశారు. వివిధ పుష్పాలతో విశేషాలంకరణ చేశారు. సుమారు 80 టన్నుల బరువు కలిగిన ఈ తేరు నాలుగు మాడ వీధుల్లో తిరిగేందుకు సౌకర్యంగా ఏర్పాట్లు చేశారు.
శ్రీవారి తేరుపై స్వర్ణ ఛత్రస్థాపన
బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం బంగారు గొడుగు ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. తేరోత్సవానికి నాయీ బ్రాహ్మణులు బంగారు గొడుగు సమర్పించడం ఆనవాయితీ. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో చంద్రగిరిరాజు శ్రీనివాసమహదేవరాయలు చేసిన ధర్మశాసనం ప్రకారం పంతులుగారి వంశస్తులు ఈ హక్కును అనుసరిస్తున్నారు. 1952 కాలం వరకు రథంపై కొయ్య గొడుగు అమర్చేవారు. తర్వాత బంగారు గొడుగును అలంకరిస్తున్నారు. మంగళవారం స్థానిక కల్యాణకట్టలో నాయీ బ్రాహ్మణుడు పంతులుగారి రామనాథం ఆధ్వర్యంలో బంగారు గొడుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.