తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్ : విజిటింగ్ వీసాపై ఉపాధి కోసం మలేషియా వెళ్లిన ఓ యువకుడు గడువు ముగియడంతో అక్కడ అధికారులకు చిక్కి జైలు పాలయ్యూడు. స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎట్టకేలకు సొంతూరికి చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే... తాడేపల్లిగూడెం 31వ వార్డు కడకట్లకు చెందిన యర్రంశెట్టి వెంకటేశ్వరరావు ఈ ఏడాది జూన్ 8న ఉపాధి కోసం మలేషియా వెళ్లాడు. వేలాది రూపాయలు వసూలు చేసిన ఏజెంట్లు అతని చేతిలో విజిటింగ్ వీసా పెట్టి పంపారు. వీసా గడువు ముగిసినా అక్కడే ఉన్న వెంకటేశ్వరరావును మలేషియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షెహరంబో జైలులో ఉంచారు. అతని వెంట ఉన్న మరో వ్యక్తి వెంకటేశ్వరరావు భార్య చైతన్యకు సమాచారం అందించాడు. ఆమె తన భర్తను ఇండియాకు రప్పించాలని కోరుతూ కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావుకు సెప్టెంబర్ 17న విన్నవిం చుకుంది. స్పందించిన ఆయన సమస్యను మలేషియా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అక్కడ అధికారులు వెంకటేశ్వరరావును విడుదల చేయించి భారత దేశానికి పంపారు.