TADEPALLIG
-
గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ 3.66 కోట్లు
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్ :గ్రామీణ రోడ్లు అభివృద్ధికి నియోజకవర్గానికి రూ 3.66 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే ఈలి నాని తెలిపారు. బుధవారం ఆయన గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను పంచాయతీరాజ్ గ్రాంటుగా ఈ నిధులు విడుదలయ్యాయని చెప్పారు. వీటిలో బీటీ రోడ్ల కోసం తాడేపల్లిగూడెం మండలానికి రూ 1.78 కోట్లు, పెంటపాడు మండలానికి రూ 1.42 కోట్లు మొత్తం రూ.3.20 కోట్లు విడుదయ్యాని తెలిపారు. ఎల్ అగ్రహారం నుంచి కుంచనపల్లికి, ఆరుగొలను నుంచి ఆరుగొలను శివారుకు, ఎల్.అగ్రహారం నుంచి అదే పంచాయతీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీ వరకు, కుంచనపల్లి నుంచి తాడేపల్లిగూడెంలో జువ్వలపాలెం వరకు, జాతీయ రహదారి నుంచి పెదతాడేపల్లి వరకు బీటీ రోడ్లను ఈ నిధులతో వేస్తామన్నారు. పెంటపాడు మండలంలోని ఎన్ఏ రోడ్డు నుంచి కె.పెంటపాడు అరుంధతిపేట వరకు, ఉప్పరగూడెం నుంచి వెస్టు విప్పర్రులోని సుఖాల దిబ్బవరకు, జట్లపాలెం-మౌంజీపాడు రోడ్డు నుంచి ఉమామహేశ్వరం వరకు, దర్శిపర్రు నుంచి తాడేపల్లిగూడెం మునిసిపల్ ఏరియా వరకు రోడ్లు నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామన్నారు. సీడీపీ మినిస్టర్ గ్రాంటు నుంచి తాడేపల్లిగూడెం మండలానికి రూ 23.25 లక్షలు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. బంగారుగూడెం, నీలాద్రిపురం, మారంపల్లి, దండగర్ర ఇందిరమ్మ కాలనీ, కుంచనపల్లిలో సీసీ రోడ్లు, నీలాద్రిపురంలో కమ్యూనిటీ హాలు, నందమూరు అంబేద్కర్ విగ్రహం వీధిలో సీసీ డ్రెయిన్ నిర్మాణం కోసం ఈ నిధులు వినియోగించనున్నట్లు చెప్పారు. ఇదే గ్రాంటు నుంచి పెంటపాడు మండలానికి రూ.23 లక్షలు మంజూరయ్యాయన్నారు. పెంటపాడులో సీసీ రోడ్లు, డ్రెయిన్లు , బి.కొందేపాడులో మెటల్ రోడ్డు, పెంటపాడు జూనియర్ కళాశాలకు బీటీ రోడ్డు, రావిపాడులో గ్రావెల్ రోడ్లు, ప్రత్తిపాడు రామాల యం వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి ఈ నిధులు వినియోగిస్తామన్నారు. పం చాయతీరాజ్ డీఈ ఎంవీ రమణమూర్తి, ఏఈలు శ్రీనివాసు, అప్పారావు పాల్గొన్నారు. -
ఉపాధి కోసం వెళ్లి జైలుపాలు
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్ : విజిటింగ్ వీసాపై ఉపాధి కోసం మలేషియా వెళ్లిన ఓ యువకుడు గడువు ముగియడంతో అక్కడ అధికారులకు చిక్కి జైలు పాలయ్యూడు. స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎట్టకేలకు సొంతూరికి చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే... తాడేపల్లిగూడెం 31వ వార్డు కడకట్లకు చెందిన యర్రంశెట్టి వెంకటేశ్వరరావు ఈ ఏడాది జూన్ 8న ఉపాధి కోసం మలేషియా వెళ్లాడు. వేలాది రూపాయలు వసూలు చేసిన ఏజెంట్లు అతని చేతిలో విజిటింగ్ వీసా పెట్టి పంపారు. వీసా గడువు ముగిసినా అక్కడే ఉన్న వెంకటేశ్వరరావును మలేషియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షెహరంబో జైలులో ఉంచారు. అతని వెంట ఉన్న మరో వ్యక్తి వెంకటేశ్వరరావు భార్య చైతన్యకు సమాచారం అందించాడు. ఆమె తన భర్తను ఇండియాకు రప్పించాలని కోరుతూ కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావుకు సెప్టెంబర్ 17న విన్నవిం చుకుంది. స్పందించిన ఆయన సమస్యను మలేషియా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అక్కడ అధికారులు వెంకటేశ్వరరావును విడుదల చేయించి భారత దేశానికి పంపారు. -
4 నెలల తర్వాత స్వగ్రామానికి మృతదేహం
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్ : సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లి అక్కడ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన సత్తి శంకర్ రెడ్డి భౌతికకాయం గురువారం ఉదయం గ్రామం చేరుకుంది. ఈ ఏడాది జూన్ 18న సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (కారు ఎక్సిడెంట్) శంకర్ రెడ్డి మృతి చెందాడు. మృతదేహాన్ని పంపాలంటే రూ.2 లక్షలు చెల్లించాలని అక్కడి అధికారులు కుటుంబ సభ్యులకు సూచించడంతో ఆర్థికస్తోమత లేక ఎదురుచూశారు. ఇదిలావుండగా ఆగస్టు 1న మృతుడు శంకర్‌రెడ్డి కుమారుడు రామకృష్ణారెడ్డి తాడేపల్లిగూడెంకు చెందిన సంఘ సేవకులు, కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావును సంప్రదించి తన తండ్రి భౌతికకాయాన్ని రప్పించి కడసారి చూపును ప్రసాదించాలని వేడుకున్నారు. దీంతో స్పందించిన ఆయన ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు సహకారంతో ఇండియా, సౌదీ రాయబారి కార్యాలయాలను సంప్రదించారు. ఎటువంటి సొమ్ములు చెల్లించకుండా ఎట్టకేలకు మృతదేహాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించేందుకు సౌదీ అధికారులు అంగీకరించారు. నాలుగు నెలల అనంతరం మృతదేహం మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. మాణిక్యాలరావు విజ్ఞప్తి మేరకు వాయిస్ ఆఫ్ ఇండియా ఎమిగ్రెన్సీ ద్వారా ఉచిత అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మృతదేహాన్ని తాడేపల్లిగూడెం మీదుగా మంచిలి చేర్చారు. గురువారం ఉదయం తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్‌కు అంబులెన్స్ చేరుకోగా గట్టిం మాణిక్యాలరావు శవపేటికను పరిశీలించి మృతుని కుమారుడు రామకృష్ణారెడ్డికి సంతాపం తెలిపారు. సౌదీ నుంచి రావాల్సిన బీమా సొమ్ము ను కూడా రప్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఇతర దేశాల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే కుటుంబ సభ్యులు తమను సంప్రదించాలని సూచించారు. సెల్ నెంబర్ : 94906 76699లో విజ్ఞప్తి చేయూలని కోరారు. తన తండ్రి మృతదేహాన్ని ఇండియూకు రప్పించేందుకు కృషి చేసిన వారికి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.