4 నెలల తర్వాత స్వగ్రామానికి మృతదేహం
Published Fri, Nov 1 2013 3:46 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్ : సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లి అక్కడ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన సత్తి శంకర్ రెడ్డి భౌతికకాయం గురువారం ఉదయం గ్రామం చేరుకుంది. ఈ ఏడాది జూన్ 18న సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (కారు ఎక్సిడెంట్) శంకర్ రెడ్డి మృతి చెందాడు. మృతదేహాన్ని పంపాలంటే రూ.2 లక్షలు చెల్లించాలని అక్కడి అధికారులు కుటుంబ సభ్యులకు సూచించడంతో ఆర్థికస్తోమత లేక ఎదురుచూశారు. ఇదిలావుండగా ఆగస్టు 1న మృతుడు శంకర్‌రెడ్డి కుమారుడు రామకృష్ణారెడ్డి తాడేపల్లిగూడెంకు చెందిన సంఘ సేవకులు, కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావును సంప్రదించి తన తండ్రి భౌతికకాయాన్ని రప్పించి కడసారి చూపును ప్రసాదించాలని వేడుకున్నారు.
దీంతో స్పందించిన ఆయన ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు సహకారంతో ఇండియా, సౌదీ రాయబారి కార్యాలయాలను సంప్రదించారు. ఎటువంటి సొమ్ములు చెల్లించకుండా ఎట్టకేలకు మృతదేహాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించేందుకు సౌదీ అధికారులు అంగీకరించారు. నాలుగు నెలల అనంతరం మృతదేహం మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. మాణిక్యాలరావు విజ్ఞప్తి మేరకు వాయిస్ ఆఫ్ ఇండియా ఎమిగ్రెన్సీ ద్వారా ఉచిత అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మృతదేహాన్ని తాడేపల్లిగూడెం మీదుగా మంచిలి చేర్చారు.
గురువారం ఉదయం తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్‌కు అంబులెన్స్ చేరుకోగా గట్టిం మాణిక్యాలరావు శవపేటికను పరిశీలించి మృతుని కుమారుడు రామకృష్ణారెడ్డికి సంతాపం తెలిపారు. సౌదీ నుంచి రావాల్సిన బీమా సొమ్ము ను కూడా రప్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఇతర దేశాల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే కుటుంబ సభ్యులు తమను సంప్రదించాలని సూచించారు. సెల్ నెంబర్ : 94906 76699లో విజ్ఞప్తి చేయూలని కోరారు. తన తండ్రి మృతదేహాన్ని ఇండియూకు రప్పించేందుకు కృషి చేసిన వారికి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement