- సౌదీలో మృత్యువాత..
ఖానాపూర్: ఉపాధి కోసం దేశం కానీ దేశం వెళ్లి.. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి మృతదేహం 15 నెలలకు స్వగ్రామానికి చేరింది. ఎదురుచూసి ఆశలు వదులకొని.. కడచూపు కూడా నోచుకోలేమన్న బాధతో పెద్ద కర్మ, ప్రథమ వర్ధంతి కూడా చేశారు. వివరాలు... ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బీర్నందికి చెందిన జూపెల్లి కృష్ణయ్య (35) 2011లో సౌదీకి వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పనిచేశాడు. సెప్టెంబర్ 11, 2013లో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని చనిపోయాడు. క కృష్ణయ్యకు భార్య విజయతోపాటు కూతురు నాగలక్ష్మి (17), కొడుకు చందు (13) ఉన్నారు.
కడచూపు నోచుకోలేమనుకున్నారు..
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కృష్ణయ్య మృతదేహాన్ని కుటుంబీకులు కడసారి చూపునకు నోచుకోలేమనుకున్నారు. ఇండియన్ ఎంబసీలో దీనికి సంబంధించి వివరాలేవీ లేకుండా పోయా యి. ముంబైలోని ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్లడంతో దానికి సంబంధించి ఆచూకీ తెలుసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓవర్సిస్ మినిస్ట్రీకి ఫిర్యాదు చేశారు. వారు సౌదీలోని ఇండియన్ ఎంబసీ దృష్టికి తీసుకెళ్లగా రోడ్డు ప్రమాదంలో మరణించాడని సమాధానమిచ్చారు. చివరికి ఎన్‌ఆర్‌ఐ సెల్ వద్ద మొరపెట్టుకోగా, ఏడాదిన్నర తర్వాత ప్రత్యేక చొరవతో మృతదేహాన్ని ఇంటికి చేర్చారు.