{పచారం కొండంత... చేసింది గోరంత
లక్ష ఇంకుడు గుంతల లక్ష్యం
తవ్వింది 17,820 గుంతలే
వాననీటిని ఒడిసిపట్టే ఉద్దేశంతో ప్రారంభించిన ఇంకుడుగుంతల తవ్వకం జిల్లాలో లక్ష్యాన్ని చేరుకోలేదు. కేవలం ప్రచారార్భాటానికే పరిమితమైన ఈ పథకం కేంద్రం సొమ్ముతో రాష్ట్రం పబ్లిసిటీ సోకుకు ఉపకరించింది. జిల్లాలో లక్ష గుంతలు తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం రూ. 124.76 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక్క పైసా కూడా విదల్చకుండా అన్నింటికి ఒకటేమందు అన్నట్లుగా కల్పతరువులా మారిన ఉపాధి హామీ సొమ్మును ఇందుకు వినియోగించారు.
సాక్షి, విశాఖపట్నం: ‘ఇంకుడు గుంతలు తవ్వండి..వర్షపు నీటిని ఒడిసిపట్టండి.. భూగర్భ జలాలను పరిరక్షించండి..’ ఇది రాష్ర్ట ప్రభుత్వం పిలుపు. ఈ కార్యక్రమం కోసం చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. ఊరూ..వాడా ఊదరగొట్టేలా ప్రచారం చేశారు. గునపం పట్టుకుని, నెత్తినతట్ట పెట్టుకుని ఫొటో దిగడం..పత్రికల్లో గొప్పగా ఏదో సాధించామంటూ ప్రచారం చేసుకోవడం వేసవిలో ఎక్కడ చూసినా ఇదే దృశ్యాలు. ఏ పేపర్ తిరగేసినా ఇవే ‘సిత్రాలు’. సొమ్మొకడిది..సోకు మరొకరిది అన్నట్టుగా సొమ్ము కేంద్రానిది సోకు రాష్ర్ట ప్రభుత్వానిది అన్నట్లుగా సాగింది. ఆచరణలోకి వచ్చి చూస్తే మాత్రం ప్రచారం కొండంత..సాధించింది గోరంత అన్నట్టుగా ఉంది ఇంకుడుగుంతల పథకం.
గడిచిన వేసవి సీజన్‌లో జిల్లాలో ఈ గుంతల ఉద్యమం జోరుగా సాగింది. ఒక్క మన జిల్లాలోనే లక్ష గుంతలు తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం రూ. 124.76 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక్క పైసా కూడా విదల్చకుండా అన్నింటికి ఒకటేమందు అన్నట్లుగా కల్పతరువులా మారిన ఉపాధి హామీ సొమ్మును ఇందుకు వినియోగించాలని నిర్ణయించారు. ఏప్రిల్‌లో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మే నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. జూన్‌లో పడే తొలకరి వర్షాలను వడిసిపట్టాలని..తద్వారా భూగర్భ జలాలను పెంపొందించాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. కానీ సాధించింది మాత్రం అంతంతమాత్రమే.