
పేదరిక నిర్మూలనే ధ్యేయం
కాళ్ల : రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర స్త్రీ శిశుసంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. కాళ్ల మండలంలోని జక్కరం, కోపల్లె గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు గ్రామససభలలో ఆమె ముఖ్య అతిథి పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబట్టలతో పంపినట్లుగా రాష్ట్రాన్ని విడగొట్టిందన్నారు. దీంతో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి సాధించాల్సి ఉందని, ఇందుకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతున్నారన్నారు. ఎంత కష్టమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామన్నారు.
డ్వాక్రా, రైతు రుణాలను మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ కోసం రైతు సాధికారిత కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఎన్టీఆర్ సేవా పథకం ద్వారా ప్రతి వ్యక్తికీ రూ.2 లక్షల 50 వేల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో దాతల సహకారంతో సుజలా వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేసి 20 లీటర్ల నీరు రూ. 2లకే అందిస్తామన్నారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సభలకు సర్పంచ్‌లు పాము రూతమ్మ, నాజిన ధనాజీరావు అధ్యక్షత వహించారు. జన్మభూమి జిల్లా ప్రత్యేకాధికారి పి.లక్ష్మీనర్సింహా, నియోజకవర్గ ప్రత్యేకాధికారి డి.విజయకుమారి, ఆర్డీవో పుష్పమణి, ఆర్‌డ బ్ల్యూఎస్ ఎస్‌ఈ రమణ, ఎంపీపీ ఆరేటి వెంకటరత్నప్రసాద్, జెడ్పీటీసీ బర్రె శ్రీవెంకటరమణ, తహసిల్దార్ వి.జితేంద్ర, ఎంపీడీవో జి.పద్మ పాల్గొన్నారు.
సమర్థవంతమైన పాలన అందిస్తాం
పాలకోడేరు/పాలకోడేరు రూరల్ : ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ,గనుల శాఖల మంత్రి పీతాల సుజాత అన్నారు. మండలంలోని శృంగవృక్షం, పెన్నాడ గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు గ్రామసభల్లో మంత్రి మాట్లాడారు. జన్మభూమి-మాఊరు కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. ఈకార్యక్రమం ద్వారా అందే సమస్యలను ప్రభుత్వానికి విన్నవించి పరిష్కారానికి కృషి చేస్తాన్నారు. ఎమ్మెల్యే శివరామరాజు మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. శృంగవృక్షం, పెన్నాడలో మొత్తం 290 మందికి పెన్షన్లు అందజేశారు. పెన్నాడలో వాటర్ ప్లాంట్‌ను మంత్రి, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎంపీపీ చలపతి, జెడ్పీటీసీ నేతల బేబి, తహ సిల్దార్ రత్నమణి, ఎంపీడీవో వెంకటరత్నం, సర్పంచ్‌లు కలిందిండి దుర్గదీప్తీ కృష్ణంరాజు, ఇట్టా సురేష్‌బాబు పాల్గొన్నారు.