కళ్యాణదుర్గం టౌన్, న్యూస్‌లైన్: ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని, శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్యామ్‌సుందర్ హెచ్చరించారు. బుధవారం కళ్యాణదుర్గం డీఎస్పీ కార్యాలయం, టౌన్ పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ మోహన్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
కళ్యాణదుర్గం ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమ పరిస్థితులపై ఆరా తీశారు. ఉద్యమమంటే అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా! ఉద్యమకారులు ఇతరుల ఆస్తులను ధ్వంసం చేయడం నేరం కాదా..? ఉద్యమ స్ఫూర్తి ఉంటే వారు తమ సొంత ఆస్తులను ధ్వంసం చేసుకోవాలి కదా! ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా ప్రతినిధుల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో చదువులు కొనసాగిస్తున్నారు? ఇదెక్కడి న్యాయం’ అన్నారు. పేద పిల్లలను చదువులకు దూరం చేసి, వారితో వీధుల్లో ర్యాలీలు చేయిస్తూ ఉద్యమం చేయడం సబబా? అంటూ ప్రశ్నించారు. ప్రతి పౌరుడు వీధుల్లోకి వచ్చి శాంతియుతంగా ఉద్యమం చేస్తే సార్థకత ఉంటుందని సూచించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యంపై బైండోవర్ కేసులు ఎందుకు బనాయిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా, తల్లిదండ్రులు పాఠశాలలకు పిల్లలను పంపితే, వారి అనుమతి లేకుండా పిల్లలను వీధుల్లో ర్యాలీలు చేయించడం నేరమని ఎస్పీ వివరణ ఇచ్చారు. ఉద్యమ ర్యాలీల్లో అనూహ్య సంఘటనలు చోటుచేసుకుని విద్యార్థులు బలైతే, అందుకు బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. బైండోవర్ అంటే కేసు నమోదు చేయడం కాదు... పిల్లల భవిష్యత్తుకు బాధ్యతగా ఉండేందుకే బాండ్ తీసుకోవడం జరుగుతుందన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 30 ఉద్యమ కేసులు బనాయించామని చెప్పారు. వీటిలో 95 శాతం మంది విద్యార్థులే ఉన్నారన్నారు. వారి భవిష్యత్తును ఆలోచించి ఎవరిని అరెస్టు చేయలేదన్నారు. ఉద్యమ కారులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి ఉద్యమానికి రూపకల్పన చేసుకుంటే మంచిదని సూచించారు. అనంతరం జిల్లాలో సాగు, తాగు నీరు ఎలా ఉందని విలేకరులను ఆరా తీశారు. ఈ ప్రాంతంలో ప్రధాన ఆధార పంట ఏదని అడిగి తెలుసుకున్నారు. తాగు, సాగునీరు సాధించుకోవడానికి ఉద్యమాలు చేయాలి తప్ప, హైదరాబాద్ కావాలని ఉద్యమం చేస్తే ఏమొస్తుందంటూ నవ్వారు.
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
Published Thu, Sep 5 2013 2:59 AM | Last Updated on Fri, May 25 2018 5:49 PM
Advertisement
Advertisement