కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుపర్చడానికి అధికారులు పాటుపడాలని కలెక్టర్ అహ్మద్‌బాబు అన్నారు. మండల, డివిజన్ స్థాయి అధికారులతో పలు పథకాల అమలులో సాధించిన ప్రగతిపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ భూములు మధ్య దళారుల ద్వారా అన్యాక్రాంతమై పోతున్నాయని పేర్కొన్నారు. నిరుపేదలకు చెందాల్సిన భూములు పరులకు చెందుతున్నాయని, ఇటీవల అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం అభినందనీయమని అన్నారు. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారంపై సమీక్షించారు. అదేవిధంగా భోజనానికి సంబంధించి బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదని, నాలుగైదు నెలల నుంచి బిల్లులు కూడా సమర్పించనట్లు తన దృష్టికి వచ్చిందని, ఇకనైనా సక్రమంగా బిల్లులు సంబంధిత అధికారులు సమర్పించి నిర్ణీత గడువులోగా చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించాలన్నారు.
ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తయిన వారికి చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అంటువ్యాధులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఆరోగ్యం, పారిశుధ్యం తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జేసీ సుజాత శర్మ, ఏజేసీ వెంకటయ్య, డీఆర్వో ఎస్‌ఎస్ రాజు, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీపీవో షేక్‌మీరా, ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలి..
Published Tue, Sep 24 2013 3:04 AM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM
Advertisement