జియో ట్యాగింగ్‌తో పర్యవేక్షణ
పుష్కర పనులపై సీఎం సమీక్ష
* శాఖల అనుసంధానానికి మొబైల్ యాప్
* 30లోగా పనులన్నీ పూర్తికావాలి
సాక్షి, హైదరాబాద్: పుష్కరాల సందర్భంగా జరుగుతున్న పనుల్ని ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే విధంగా జియో ట్యాగింగ్ టెక్నాలజీ వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారుల్ని ఆదేశించారు. తగినంత సమయం లేకపోవడంతో పనులు వేగం పుంజుకునేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సూచించారు.
గురువారం సచివాలయంలో గోదావరి పుష్కరాల పనులపై సీఎం అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పుష్కరాలకు మంజూరైన మొత్తం రూ.1,295 కోట్ల విలువైన పనుల్లో రూ.244.15 కోట్ల పనులు పూర్తయ్యాయని, రూ.701.52 కోట్ల పనులు పురోగతిలో ఉన్నట్లు పుష్కర పనుల ప్రత్యేకాధికారి ధనుంజయరెడ్డి శాఖల వారీ ప్రజంటేషన్‌లో తెలిపారు. ప్రతి శాఖలో ఉత్తమ నమూనాలను, అత్యున్నత పద్ధతుల్ని ప్రవేశ పెట్టాలని ఇందుకోసం మేలైన సర్వీస్ ప్రొవైడర్లు ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకువచ్చి వారి సేవల్ని ఉపయోగించుకుందామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.
ప్రభుత్వ శాఖలన్నిటినీ అనుసంధానమై ఉండేలా ఒక మొబైల్ యాప్‌ను రూపొందించాలని సూచించారు. పుష్కరాలకు ఎంతమంది భక్తులు వస్తారో.. గత పుష్కరాల గణాంకాల ఆధారంగా శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేయాలన్నారు. వివిధ రకాల పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థులను భాగస్వాములను చేయాలని చెప్పారు. పుష్కరాలు జరిగే 12 రోజుల్లో ఒక రోజు సినీ పరిశ్రమకు చెందిన కళాకారులతో భారీ కార్యక్రమాలు నిర్వహించాలని, జానపద.. సంప్రదాయ కళారూపాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, శివమణి, హరిప్రసాద్ చౌరాసియా వంటి ప్రసిద్ధ కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటుచేయాలని సూచించారు.
ఫుడ్, ఫ్లవర్ ఫెస్టివల్స్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులకు తిరుమల లడ్డూ ప్రసాదంతో పుష్కరాలకు ప్రత్యేక ఆహ్వానాలు అందజేయాలని సూచించారు. ఈ నెల 30లోగా పనులన్నీ పూర్తవ్వాలన్నారు. క్లోక్ రూంల ఏర్పాటుతో యాత్రికులకు సౌకర్యం కల్పించాలని సీఎస్ కృష్ణారావు చెప్పారు. పుష్కరాలకు ముందుగా తలపెట్టిన శోభాయాత్రపై చర్చించారు.
ఆకాశ దీపాలతో ప్రత్యేక ప్రదర్శన
పుష్కరాల తొలిరోజు 50 వేల ఆకాశ దీపాలతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టూరిజం శాఖ కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ వివరించారు. గోదావరిపై లేజర్ షో కూడా నిర్వహిస్తామన్నారు. కూచిపూడి నాట్య కళాకారుల ప్రదర్శనలతో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో పురాణ ప్రవచనాలు నిర్వహించనున్నారు.