గోకర్ణపల్లి.. ఖాళీ!
పొందూరు, న్యూస్‌లైన్: ఒకవైపు నారాయణపురం కుడికాలువ.. మరోవైపు మడ్డువలస కాలువ ఉన్నా పొందూరు మం డలం గోకర్ణపల్లి పంచాయతీకి నిత్యక్షామమే. ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ తప్పిదాల కారణంగా పంటలు చేతి కందడం లేదు. పోనీ ఉపాధి హామీ పనులైన చేసుకొని ఉన్న ఊరిలో కలో గంజో తాగి బతుకుదామంటే మూడేళ్లుగా ఆ పనులు జరగడం లేదు. ఫలితంగా కుటుంబ పోషణకు ఊరు విడిచి దూరం వెళ్లక తప్పడం లేదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముంచేస్తున్న రెల్లుగెడ్డ
గ్రామానికి ముందు నారాయణపురం కుడి కాలువ.. వెనుకవైపు మడ్డువలస కాలువ ఉన్నాయి. అందువల్ల గ్రామ పంటపొలాలకు నీటి సమస్య లేదు. కానీ సమస్య ఏమిటంటే.. వర్షాకాలంలో మడ్డువలస నీరు వచ్చి నారాయణపురం కుడికాలువలో కలుస్తుంది. ఆ నీరంతా పక్కనే ఉన్న రెల్లుగెడ్డలో కలుస్తుంది. దీంతో ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగి పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. వేసిన పంటలు నాశనమవుతున్నాయి. నారాయణపురం కాలువ, రెల్లుగెడ్డ కలిసే చోట నిర్మించిన ఉపరితల చప్టా సామర్థ్యం తక్కువగా ఉండటంతో నీటి ఉద్ధృతిని అడ్డుకోలేకపోతోంది. ఫలితంగా నీరంతా పంట పొలాల్లోకి చొచ్చుకు వస్తోంది. మరోవైపు నానాపాట్లు పడి సాగు చేసే పంట చేతికొచ్చే సమయంలో ప్రతి ఏటా తుపానులు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఇలా పంట నష్టపోతున్న చిన్న రైతులు ఉపాధి హామీ పనులపై ఆశలు పెట్టుకున్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ లేరని..!
అయితే మూడేళ్లుగా గ్రామంలో ఉపాధి పనులే జరగడం లేదు. దీనికి కారణమేమిటని ఆరా తీస్తే ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడమే కారణమని తెలిసింది. గతంలో ఇక్కడ పని చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ వేతనదారుల హాజరు ఎక్కువగా చూపడం, ప్రభుత్వం సరఫరా చేసిన గునపాలను వేతనదారులకు అందజేయకపోవడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతన్ని మూడేళ్ల క్రితం సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఏవో కారణాలతో వేరే ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించలేదు. పర్యవేక్షించేవారు లేకపోవడంతో గ్రామానికి ఉపాధి పనులు కూడా మంజూరు చేయడం నిలిపివేశారు. ఫలితంగా పంట నష్టపోయిన చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు వేసవిలో ఉపాధి పనులకు దూరమయ్యారు.
పంటలు లేక.. ఉపాధి పనులకు నోచుకోక కుటుంబ పోషణ భారంగా పరిణమించడంతో వలసబాట పట్టారు. ఈ విధంగా ఇప్పటికే సుమారు 300 మంది విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో కూలి పనులకు వెళ్లిపోయారు. ప్రస్తుతం గ్రామంలో చాలా ఇళ్లు తాళాలతో వెక్కిరిస్తున్నాయి. పంటలు లేక గురుగుబెల్లి లక్షునాయుడు, రాజులు, రాము, లక్ష్మీనారాయణ, సన్యాసి, కంచరాన ధర్మేంద్ర, అర్జునరావు తదితరుల పొలాలు బీడువారాయి. గ్రామానికి ఈ దుస్థితి తప్పించాలంటే మడ్డువలస కాలువ, నారాయణ కుడి కాలువల గట్లు పటిష్టం చేయడంతో పాటు చప్టాల సామర్థ్యం పెంచాలని.. తక్షణమే ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించి ఉపాధి హామీ పనులు చేపట్టాలని గ్రామ సర్పంచ్ సీపాన శ్రీరంగ నాయకులు, ఎంపీటీసీ సభ్యుడు సీపాన చక్రధరనాయుడు, పలువురు రైతులు కోరుతున్నారు. అప్పుడే గ్రామం మళ్లీ కళకళలాడుతుందంటున్నారు. లేని పక్షంలో ముందు ముందు గ్రామం మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.