
బంగారం దుకాణాల బంద్
కేంద్రప్రభుత్వ విధానాలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన క్రయ,విక్రయాలు
రాజ్ విహార్ సెంటరులో వ్యాపారుల ధర్నా
కర్నూలు(అగ్రికల్చర్): కేంద్ర ప్రభుత్వం బంగారంపై ఎక్సైజ్ సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తూ జ్యువెలరీ వ్యాపారులు నిరవధిక సమ్మె చేపట్టారు. జాతీయ జ్యువెలరీ మర్చంట్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా బంగారం దుకాణాలు మూత పడ్డాయి. కర్నూలు నగరంలో బుధవారం స్థానిక షరాఫ్ బజారును మూసివేసి కేంద్రప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కొండారెడ్డిబురుజు దగ్గరి నుంచి రాజ్‌విహార్ సెంటరు వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షుడు పుణ్యమూర్తి రామయ్య మాట్లాడుతూ...ఇంతవరకు బంగారంపై ఎలాంటి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లేదని అయితే తాజాగా బడ్జెట్‌లో ఒక్క శాతం ప్రకటించడం తగదని తెలిపారు. ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపైనే పడుతుందని తెలిపారు. ఇప్పటికే ధరలు పెరగడంతో బంగారం కొనలేని స్థితిలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. రూ 2 లక్షల బంగారం కొనుగోలుపై వినియోగదారులు పాన్ కార్డు చూపాలనే నిబందన పెట్టడం సరికాదన్నారు. ధర్నాలో అసోసియేషన్ ప్రతి నిధులు ఎస్.కృష్ణ, రమణకుమార్, శ్రీనివాస్‌ప్రసాద్, నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు.