
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నీలాతి సత్యంను పరామర్శిస్తున్న ఎమ్మేల్యే కేఏ నాయుడు, తదితరులు
బొండపల్లి: మండల కేంద్రమైన బొండపల్లి మధుర గ్రామం గొల్లలపేటలో శనివారం రాత్రి జరిగిన సంఘటన చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన యువకుడిపై ఎస్సై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ గ్రామపెద్ద పీతల రాము ఆధ్వర్యంలో అనుచరులు ఆదివారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నీలాతి సత్యం శనివారం రాత్రి మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై వస్తుండగా వాహన తనిఖీల్లో భాగంగా బొండపల్లి పోలీసులు ఆపారు. అయితే సత్యం వాహనం ఆపకుండా స్వగ్రామమైన గొల్లలపేట వెళ్లిపోయాడు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లు అతడ్ని అనుసరిస్తూ గ్రామానికి చేరుకోగా అక్కడ గ్రామపెద్ద పీతల రాము, అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సత్యంను పంపించేది లేదంటూ స్పష్టం చేయడంతో పాటు కానిస్టేబుళ్లను నిర్బంధించడంతో వారు ఎస్సై సుదర్శన్‌కు విషయం తెలియజేశారు. దీంతో ఎస్సై గ్రామానికి చేరుకోగా అతడ్ని కూడా నిర్బంధించారు. అనంతరం వదిలేయడంతో పోలీసులు వెళ్లిపోయి నిందితుడితో పాటు మరికొందరిపై విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు.
తెల్లారేసరికి మారిన సీన్
ఇదిలాఉంటే ఆదివారం ఉదయం గ్రామస్తులు స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఎస్సై చేయిచేసుకోవడం వల్ల సత్యం గాయపడ్డాడని ఆరోపించారు. అంతకుముందు బాధితుడ్ని గజపతినగరం సీహెచ్‌సీలో జాయిన్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేఏ నాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు బాలాజీ, తదితరులు ఆస్పత్రికి వెళ్లి బాధితుడ్ని పరామర్శించారు. ఈ విషయమై ఎస్సై మాట్లాడుతూ, వాహన తనిఖీల్లో భాగంగా సత్యం వాహనాన్ని సిబ్బంది ఆపారని, అయితే అతను ఆపకుండా గ్రామానికి వెళ్లిపోయాడని విలేకరులకు తెలిపారు. గ్రామానికి వెళ్లిన తమను అడ్డగించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment