సాక్షి, అమరావతి: ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్ల వ్యవహారం ఒకడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. అయినవారికి కట్టబెట్టేందుకే యాజమాన్యం టెండర్ల నిబంధనల్లో మార్పులు చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ల గడువు పొడిగించేందుకు.. పాత బస్సులను తిప్పుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం అనుమతించడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న అద్దె బస్సుల్లో సింహభాగం ప్రభుత్వంలో కీలక మంత్రి బినామీవేననే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా అద్దె బస్సులకు టెండర్లు పిలిచినప్పుడు కొత్త బస్సులను తీసుకునేందుకు మాత్రమే యాజమాన్యం అనుమతివ్వాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా 2014 నుంచి కొనుగోలు చేసిన బస్సులనూ అనుమతించేలా టెండర్ల నిబంధనల్లో మార్పులు చేశారు. గతంలో బస్సులు కొనుగోలు చేసి కిస్తీలు కట్టని వాటిని ఫైనాన్స్ కంపెనీలు సీజ్ చేశాయి. 2014 నుంచి ఇప్పటివరకూ ఇలాంటి బస్సులు 400 వరకు ఉన్నాయి. వీటిని ఆర్టీసీకి అద్దెకిచ్చి తిప్పుకునేలా ఓ ఫైనాన్స్ సంస్థ ఆర్టీసీ అధికారులతో లోపాయికారీ ఒప్పందం చేసుకుందని, అందువల్లే పాత బస్సులను టెండర్లలో అనుమతిస్తూ నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత బస్సుల్ని అనుమతించడం ద్వారా బస్సుల ఫిట్‌నెస్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి.
అద్దె ప్రాతిపదికన 250 బస్సులకు టెండర్లు
ఆర్టీసీలో రెండు విడతలుగా అద్దె ప్రాతిపదికన 250 బస్సుల్ని సమకూర్చుకునేందుకు యాజమాన్యం నిర్ణయించింది. మొదటి దఫా 150 బస్సులకు, రెండో దఫా మరో వంద బస్సులకు టెండర్లు పిలిచింది. మొదటి విడతలో 50 బస్సులకు మాత్రమే టెండర్లు ఖరారు చేశారు. ఈ 50 బస్సుల్లోనూ 20 బస్సులకు మాత్రమే అద్దె బస్సుల నిర్వాహకులు కొత్త ఛాసిస్ నెంబర్లు ఆర్టీసీకిచ్చారు. మిగిలిన 30 బస్సులను ఆర్టీసీలో తిప్పుతారా లేదా? అన్నది ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. రెండో దఫా పిలిచిన వంద బస్సుల టెండర్లలోనూ యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తోంది. మరోవైపు.. సొంతంగా బస్సుల్ని సమకూర్చుకోకుండా అద్దె బస్సుల సంఖ్య పెంచుకునేందుకు ఆర్టీసీ తాపత్రయపడడంపైనా విమర్శలు వస్తున్నాయి.
టెండర్ల ఖరారుకు వాయిదాల పర్వం
అద్దె బస్సుల టెండర్ల ఖరారుకు ఆర్టీసీ వాయిదాల పర్వం కొనసాగిస్తోంది. టెండర్ల దాఖలుకు గడువు ముగిసినా మంగళవారం వరకు గడువిచ్చింది. పాత బస్సులను తిప్పేందుకు అనుమతివ్వడం.. అదీ ఏళ్ల కిందట సీజ్ చేసిన బస్సుల్ని టెండర్ల ద్వారా తీసుకునేందుకు యాజమాన్యం కొన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. దీనిద్వారా ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణీకుల భద్రతను ప్రశ్నార్ధకంగా మార్చేసిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment