సుపరిపాలన, అభివృద్ధి మా ఎజెండా: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: సుపరిపాలన, సుస్థిరత, అభివృద్ధి తమ ఎన్నికల ఎజెండా అని బీజేపీ సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయు డు తెలిపారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే వారి ఎజెండా ఏమిటో చెప్పాలని సవాల్ చేశారు. అభివృద్ధికి చిరునామా వాజ్‌పేయి అని.. అవినీతి, అసమర్థత, అధిక ధరలు, వారసత్వం, కాంగ్రెస్ విధానమని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు దత్తాత్రేయ, ఎన్.ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, ఎన్.రామచంద్రరావు, అశోక్‌కుమార్ యాదవ్‌తో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, కమ్యూనిస్టులు, కుహనా లౌకికవాదులు గంగవైలెత్తుతున్నారని మండిపడ్డారు.
మోడీ గెలుపు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమంటున్న వాళ్లకు అసలీ దేశ ఎన్నికల వ్యవస్థపై నమ్మకం ఉన్నట్టా లేనట్టా? అని ప్రశ్నించారు. మోడీ వ్యాపారవేత్తలు, కార్పొరేట్ల ఏజెంటని సీపీఎం నేత కారత్ చేసిన వ్యాఖ్యను ఖండిస్తూ వాళ్లేమైనా దేశద్రోహులా? ఉత్పత్తి పెంచడం నేరమా? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో తమకు 300కు పైగా సీట్లు వస్తాయని వెంకయ్యనాయుడు ధీమా వ్యక్తంచేశారు. గుజరాత్‌లో 30 శాతం మంది ముస్లిం మైనారిటీలు మోడీకి అండగా నిలిచినట్టు తెలిపారు. హైదరాబాద్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా భారీ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. 26న తిరుచిరాపల్లిలో జరిగే సభకు రూ.10 రుసుం వసూలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
అనంతమూర్తి నిరభ్యంతరంగా వెళ్లొచ్చు!
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయితే భారత్‌లో ఉండనని ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ యూఆర్ అనంతమూర్తి చేసిన వ్యాఖ్యలపై వెంకయ్యనాయుడు ఘాటుగా స్పందించారు. అనంతమూర్తికి శుభాకాంక్షలంటూ ఎద్దేవా చేశారు. రష్యా, చైనా ప్రభావిత వామపక్షవాదంతో బాధ పడుతున్న వారికి మోడీ మింగుడు పడడు గనుక ఆయన వెళ్లిపోవడమే మంచిది అని వెంకయ్య అన్నారు.