తొర్రూరు, న్యూస్‌లైన్ : అథ్లెటిక్స్‌లో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తూ క్రీడా ఆణిముత్యంగా పలువురి అభినందనలు అందుకుంటున్నాడు ధరావత్ జగదీష్. తొర్రూరు శివారు దుబ్బతండాకు చెందిన ధరావత్ భీమ, సామ్కి దంపతుల కుమారుడైన జగదీష్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే జగదీష్ క్రీడలపై ఎంతో ఆసక్తి చూపేవాడు. స్కూల్ దశలోనే పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడు. ఇంటర్, డిగ్రీకి చేరుకునే సరికి క్రీడల్లో మరింత ప్రావీణ్యం సంపాదించాడు. పాల్గొన్న ప్రతీ పోటీలోనూ పతకాలు సాధిస్తూ జిల్లా నుంచి జాతీయస్థాయికి ఎదిగి అటు పుట్టిపెరిగిన గ్రామానికి ఇటు చదువుకుంటున్న యూనివర్సిటీకి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నాడు.
ప్రతిభకు పతకాలు
గుంటూరు జిల్లా బాపట్లలో 2011 డిసెంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి 100, 200 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానం కైవసం చేసుకున్నాడు. లాంగ్‌జంప్, త్రిబుల్‌జంప్‌లోనూ ప్రథమస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాక ఎక్కువ ప్రథమస్థానాలు సాధించిన ందుకు చాంపియన్‌షిప్ దక్కించుకున్నాడు. 2012 ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని అఖోలాలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయాల స్థాయి పోటీల్లో 100, 200 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానం సాధించి రెండు బంగారు పతకాలు అందుకున్నాడు. అదే ఏడాది అక్టోబర్‌లో చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లోనూ ప్రతిభ చూపి 100, 200 మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్, త్రిబుల్‌జంప్, డిస్కస్‌త్రోలో ప్రథమస్థానాలు సొంతం చేసుకుని ఓవరాల్ చాంపియన్‌గా నిలిచాడు. ఈ ఏడాది మార్చిలో కర్ణాటకలోని బీదర్‌లో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో 49 యూనివర్సిటీలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో వంద మీటర్ల పరుగులో బంగారు పతకం, 200మీటర్ల పరుగు, త్రిబుల్‌జంప్‌లో ద్వితీయస్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. పోటీ ఏదైనా పతకాల వేటలో ముందుంటున్న జగదీష్‌ను పలువురు అభినందిస్తున్నారు. అంతర్జాతీయస్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని ఆకాంక్షిస్తున్నారు.
అథ్లెటిక్స్ ఆణిముత్యం
Published Fri, Nov 1 2013 5:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
Advertisement
Advertisement