నోడల్ అధికారులతో సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది
సాక్షి, అమరావతి: ‘‘గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో మద్యం సరఫరా, నగదు పంపిణీ, బహుమతుల రూపంలో వివిధ వస్తువులను ఇవ్వడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశమున్నట్టు గుర్తించాం. వీటిని నియంత్రించే విధంగా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయండి’’ అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి నోడల్ అధికారులతో ఎన్నికల నిఘాపై ద్వివేది సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు లేకుండా సజావుగా ఎన్నికలు నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. మద్యం, నగదుకు సంబంధించి అత్యంత ప్రభావితం చేసే రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసే ప్రతీ విషయాన్నీ తీవ్రంగా పరిగణించాలన్నారు.
వివిధ శాఖలు దాడులు చేపట్టే సమయంలో పోలీసుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. మద్యం కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు భారీస్థాయిలో లావాదేవీలు నిర్వహిస్తున్నవారిపై నిఘా పెట్టాలన్నారు. వీటికి అడ్డుకట్ట వేయడానికి ఈ సీజన్‌లో గడిచిన ఐదేళ్లలో సాధారణంగా జరిగే కొనుగోళ్లు, అమ్మకాలపై నివేదికలను రూపొందించుకుని వీటి ఆధారంగా నిఘా పెంచాలని సూచించారు. అనుమానాస్పద కదలికలుంటే డేగ కన్ను వేయాలని కోరారు. సమావేశంలో అదనపు సీఈవో వివేక్ యాదవ్, జాయింట్ సీఈవో డి.మార్కండేయులు, అదనపు డీజీ ఐ.రవిశంకర్, రాష్ట్ర పోలీసు అధికారులు కె.వి.వి.గోపాలరావు, సీహెచ్ శ్రీకాంత్, ఎన్.ఎస్.జె.లక్ష్మీ, రాష్ట్ర ఎక్సైజ్ అధికారి కె.ఎల్.భాస్కర్, కమర్షియల్ ట్యాక్స్ అధికారి మధుబాబు, రవాణా శాఖ అధికారి ఎమ్.పురేంద్ర, ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారి ఎమ్.లక్ష్మీకాంతరెడ్డి, ఐటీ శాఖ అధికారి కృష్ణంనాయుడు తదితరులు పాల్గొన్నారు.
నలుగురితో మీడియా కమిటీ
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ వివిధ పత్రికలు, మాధ్యమాలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తల పరిశీలనకోసం నలుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్, పర్యవేక్షణ కమిటీని రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. కమిటీకి చైర్మన్¬గా అదనపు సీఈవో వివేక్‌యాదవ్, సభ్యులుగా జాయింట్ సీఈవో డి. మార్కండేయులు, దూరదర్శన్ డైరెక్టర్ డి.సురేష్‌కుమార్, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ పి.కిరణ్‌కుమార్¬లను నియమించారు. సహాయకులుగా కందుల రమేష్, విజయకుమార్‌లు వ్యవహరిస్తారు. వీరిద్దరూ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించి కమిటీకి నివేదిస్తారు. రాష్ట్ర స్థాయిలో చేపట్టే కార్యక్రమాల అనుమతులకోసం రాష్ట్ర స్థాయి ఎంసీఎంసీ కమిటీకి రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ద్వివేది ఈ సందర్భంగా తెలిపారు. సాధారణంగా జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో అనుమతులను జారీచేస్తుందని, జిల్లాస్థాయి పరిధిలోకి రానివి రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ప్రచార అనుమతులకోసం న్యూ సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment