కార్మికులను దగా చేసిన టీడీపీ సర్కార్‌ | Goutham Reddy Slams TDP In East Godavari | Sakshi
Sakshi News home page

కార్మికులను దగా చేసిన టీడీపీ సర్కార్‌

Published Fri, Jan 4 2019 7:01 AM | Last Updated on Fri, Jan 4 2019 7:01 AM

Goutham Reddy Slams TDP In East Godavari - Sakshi

తూర్పుగోదావరి, బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను అన్నివిధాలా దగా చేసిందని, కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి విమర్శించారు. కాకినాడ సూర్యకళా మందిరంలో పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికులకు గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపట్టారని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన 42 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖల్లో పనిచేస్తున్న 80 వేల మంది అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు పీకేశారన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా రాష్ట్రంలో కార్మిక కుటుంబాలను రోడ్దున పడేశారని విమర్శించారు. మైనింగ్, ఇసుక, మద్యం స్కామ్‌ల్లో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

వైఎస్సార్‌ సీపీ కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కాకినాడలో  వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వారి సంక్షేమానికి ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వం కృషి చేసిన దాఖలాలు లేవన్నారు. కనీసం వేతనాలు కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులు ఉద్యమం చేస్తే వారిని ఉద్యోగం నుంచి తొలగించారని విమర్శించారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ కో–ఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉండగా ఏనాడు కార్మిక సంఘాల ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదన్నారు. కానీ ఇటీవల జరిగిన హెచ్‌ఎంఎస్‌ ఎన్నికల్లో ఎమ్మెల్యే కొండబాబు జోక్యం చేసుకొని వారి మధ్య అగాదాలు సృష్టించారని విమర్శించారు. ఎమ్మెల్యేకు కార్మికుల సమస్యలు పట్టించుకునే ఖాళీ లేకున్నా ఆయిల్‌ మాఫీతోను, మద్యం, పేకాట మాఫీయాలతో కోట్లు కాజేసేందుకు సమయం ఉందాని ప్రశ్నించారు.

పార్టీ అధికారంలోనికి రాగానే కార్మికుల యూనియన్‌కు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు.  మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం నియోజవకర్గ కో–ఆర్డినేటర్‌ పెండెం దొరబాబు మాట్లాడుతూ కార్మికులు సంక్షేమం కోసం జగన్‌మోహన్‌రెడ్డి అనేక పథకాలు రూపొందించారన్నారు. పెద్దాపురం నియోజకవర్గ కో– ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రావడానికి వందలాది దొంగ హామీలు ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా పలు కార్మికల సంఘాల నాయకులు తమకు ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలని, ఇళ్లు మంజూరు చేయాలని, యూనియన్‌కు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. దీనిపై గౌతంరెడ్డి స్పందిస్తూ కార్మికుల సమస్యలను పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళతామన్నారు. పార్టీ అధికారంలోనికి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్‌ యూనియన్‌ కాకినాడ పార్లమెంట్‌ అధ్యక్షుడు దుగ్గన బాబ్జి, పార్టీ బీసీ సెల్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు అల్లి రాజబాబు, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి పెద్ది రత్నాజీ, రాష్ట్ర ప్రచారం విభాగం కార్యదర్శి రావూరి వేంకటేశ్వరరావు, ట్రేడ్‌ యూనియన్‌ నగర అధ్యక్షుడు గంగాపాత్రుని శ్రీనివాస్, పార్టీ నగర అధ్యక్షుడు ప్రూటీకుమార్, కార్పొరేటర్లు రోకళ్ల సత్యనారాయణ, ఎంజీకే కిశోర్, మీసాల ఉదయకుమార్, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement