‘గోవాడ’ అవినీతిపరులను శిక్షించాలి
చోడవరం : గోవాడ సుగర్స్‌లో అవినీతికి పాల్పడినవారిని వెంటనే శిక్షించాలని రైతుకూలీ సంఘం, ఏఐఎఫ్‌టీయూ, నవయువ సమాఖ్య యువజన సంఘాలు సంయుక్తంగా డిమాండ్ చేశాయి. ఈ సంఘాలన్నీ కలిసి బుధవారం ఫ్యాక్టరీ గేటు ఎదుట ఆందోళనకు దిగాయి. బిఎన్‌రోడ్డుపై మానవహరం చేశాయి. చైర్మన్ మల్లునాయుడు, ఫ్యాక్టరీ పరిపాలన విభాగం మేనేజర్ వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ అవినీతిలో కీలకపాత్ర పోషించిన వీరిద్దరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, విచారణ కమిటీ వేయాలని ఆయా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని, రైతులను పరిరక్షించాలని కోరారు.
మానవహారం జరుగుతున్న సమయంలో రోడ్డుకు ఇరుపక్కలా ట్రాఫిక్ స్తంభించింది. ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ యువరాజ్ అటుగా వెళుతూ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో చోడవరం సీఐ కిరణ్‌కుమార్ సిబ్బందితో వచ్చి ఆందోళచేస్తున్న నాయకులు ఐతిరెడ్డి అప్పలనాయుడు, తాటికొండ సూరిబాబు, అట్టా సురేష్, సాగరపు రమేష్, గొర్లె సతీష్‌లను అరెస్టు చేశారు. దీనితో మిగతా వారంతా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.