Govada sugars
-
గోవాడపై మరో మరక!
చక్కెర అమ్మకాల్లో గతంలో వెల్లువెత్తిన ఆరోపణలు వెంటాడుతున్న కోర్టు నోటీసులు తాజాగా పాలకవర్గంపై పోలీసు కేసులు చోడవరం: రాష్ట్ర సహకార రంగంలో అతిపెద్ద ఫ్యాక్టరీగా ఉన్న గోవాడ సుగర్స్ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఎన్నో ఉత్తమ అవార్డులు అందుకున్న ఈ ఫ్యాక్టరీని అవకతవకలు, అవినీతి మరకలు కుదిపేస్తున్నాయి. తాజాగా ఫ్యాక్టరీ చైర్మన్, ఎండీలతోపాటు పాలకవర్గంపై గ్రీన్‌మింట్ కంపెనీ కోర్టు కెక్కి కేసులు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏటా సుమారు 5 లక్షల టన్నులకు పైబడి క్రషింగ్ చేస్తూ 24 వేల మంది రైతులకు ఆసరాగా ఉన్న ఈ ఫ్యాక్టరీలో టీడీపీ పాలకవర్గం వచ్చాక తరుచూ ఏదో అవినీతి ఆరోపణలు చోటుచేసుకుంటున్నాయి. 2014 అక్టోబర్‌లో వచ్చిన హుద్‌హుద్ తుఫాన్ ఈ ఫ్యాక్టరీకి అన్ని రకాలుగా నష్టాలు కలిగించింది. గొడౌన్ల పైకప్పుల ఎగిరిపోయి, పంచదార నిల్వలు తడిసిపోయి నష్టం కలగగా, మరో పక్క ఆ తడిసిన పంచదార అమ్మకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు, పోలీసు కేసులతో ప్రతిష్ట దిగజారిన పరిస్థితి నెలకొంది. వెల్లువెత్తిన ఆరోపణలు తడిసిన పంచదార అమ్మకాలు, ఇన్సూరెన్సు పరిహారం మంజూరులో కొంత హైడ్రామా నడిచినట్టు అప్పట్లో ఆరోపణలు వెళ్లువెత్తాయి. నష్టాలను బూచిగా చూపిస్తూనే మరో పక్క పాలకవర్గం, యాజమాన్యం కుమ్మక్కై రూ.కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పుమన్నాయి. వైఎస్సార్సీపీ, ఇతర రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు ఆందోళనలు చేశాయి. ఈ విషయమై అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే సైతం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. కశింకోట సీడబ్ల్యుసీ గొడౌన్లలో నిల్వ చేసిన లక్షా 19 వేల క్వింటాళ్ల తడిసిన పంచదార అమ్మకాల్లో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలే ఇప్పుడు ఫ్యాక్టరీని కుదిపేస్తున్నాయి. తడిసిన పంచదారను టెండర్ల ద్వారా అమ్మే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌మింట్ ఇండియా అగ్రిటెక్ ప్రైవేటు కంపెనీ టెండర్లు దగ్గించుకుంది. తర్వాత ఫ్యాక్టరీ యాజమాన్యం మరో ట్రేడర్‌తో ఒప్పందం కుదుర్చుకొని సరకును అమ్మేయడం విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో సుమారు రూ.8 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు వెళ్లువెత్తాయి. నేరుగా రంగంలోకి గ్రీన్‌మింట్ ఫ్యాక్టరీలో ఇంత భాగోతం జరుగుతోందని తెలుసుకున్న గ్రీన్‌మింట్ కంపెనీ నేరుగా రంగంలోకి దిగింది. తన కంపెనీ పేరున వేసిన టెండరు మేరకు సరకు అప్పగించాలని సంబంధిత కంపెనీ యజమాని, ఇన్సూరెన్సు సంస్థకు కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. మరోపక్క అవినీతి ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడం, మహాజన సభలో సైతం నిరసన తెలియజేయడంతో ప్రభుత్వం అదనపు జాయింట్ కలెక్టర్‌తో చేయిస్తున్న విచారణ కూడా కొనసాగుతోంది. ఇంతలో గ్రీన్‌మింట్ కంపెనీ వేసిన కేసు కారణంగా కోర్టు ఉత్తర్వులు మేరకు చైర్మన్, ఎండీ, ఇన్సూరెన్సు కంపెనీతోపాటు పాలకర్గంలో కొందరు డైరక్టర్లపై చోడవరం పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహరం మరో మారు గుప్పుమంది. పాలకవర్గంపై కేసులు నమోదు కావడం ఫ్యాక్టరీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడంతో సర్వత్రా రైతుల్లో, ఫ్యాక్టరీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సుగర్స్ పాలకవర్గాన్ని బర్తరఫ్ చేయాలి చోడవరం: గోవాడ సుగర్ ప్యాక్టరీ పాలకవర్గాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతు సంఘం డిమాండ్ చేసింది. ఏపీ చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్రి అప్పారావు, జిల్లా అధ్యక్షుడు యన్నంశెట్టి సీతారాం, జిల్లా కార్యదర్శి నాగిరెడ్డి సత్యనారాయణ బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పారదర్శకతలేని పాలకవర్గం రైతులకు ఎటువంటి మేలు చేయదని, వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పంచదార అమ్మకాల్లో అవినీతికి పాల్పడటమే కాకుండా పోలీసు కేసుల్లో ఇరుక్కున్న పాలకవర్గం ఫ్యాక్టరీని మరింత నాశనం చేసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తంచేశారు. అవినీతి ఆరోపణలు నిగ్గుతేలే వరకు పాలవర్గం ఫ్యాక్టరీ పాలనలో దూరంగా ఉండాలన్నారు. తడిసిన పంచదార అమ్మకాల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై వేసిన విచారణ కమిటీ నివేదిక వెంటనే బయటపెట్టాలని కోరారు. -
‘గోవాడ’ అవినీతిపరులను శిక్షించాలి
చోడవరం : గోవాడ సుగర్స్‌లో అవినీతికి పాల్పడినవారిని వెంటనే శిక్షించాలని రైతుకూలీ సంఘం, ఏఐఎఫ్టీయూ, నవయువ సమాఖ్య యువజన సంఘాలు సంయుక్తంగా డిమాండ్ చేశాయి. ఈ సంఘాలన్నీ కలిసి బుధవారం ఫ్యాక్టరీ గేటు ఎదుట ఆందోళనకు దిగాయి. బిఎన్‌రోడ్డుపై మానవహరం చేశాయి. చైర్మన్ మల్లునాయుడు, ఫ్యాక్టరీ పరిపాలన విభాగం మేనేజర్ వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ అవినీతిలో కీలకపాత్ర పోషించిన వీరిద్దరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, విచారణ కమిటీ వేయాలని ఆయా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని, రైతులను పరిరక్షించాలని కోరారు. మానవహారం జరుగుతున్న సమయంలో రోడ్డుకు ఇరుపక్కలా ట్రాఫిక్ స్తంభించింది. ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ యువరాజ్ అటుగా వెళుతూ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో చోడవరం సీఐ కిరణ్‌కుమార్ సిబ్బందితో వచ్చి ఆందోళచేస్తున్న నాయకులు ఐతిరెడ్డి అప్పలనాయుడు, తాటికొండ సూరిబాబు, అట్టా సురేష్, సాగరపు రమేష్, గొర్లె సతీష్‌లను అరెస్టు చేశారు. దీనితో మిగతా వారంతా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ప్రైవేట్‌పరం చేస్తే ప్రతిఘటిస్తాం
గోవాడ సుగర్స్ చైర్మన్ మల్లునాయుడు సీఎంను సైతం ధిక్కరిస్తాం అధ్యయన కమిటీకి స్పష్టీకరణ చోడవరం: అధ్యయన కమిటీ పేరుతో గోవాడ సుగర్స్‌ను ప్రై వేట్‌పరం చేయాలని ఆలోచన చేస్తే పార్టీలకతీతంగా ప్రతిఘటిస్తామని గోవాడ సుగర్స్ చైర్మన్ గూనూరు మల్లునాయుడు హె చ్చరించారు. రాష్ట్రంలో చక్కెర ఫ్యాక్టరీల పనితీరుపై నియమిం చిన అధ్యయన కమిటీ శుక్రవా రం గోవాడ సుగర్స్‌లో రైతుల తో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటువంటి నిర్ణయమే తీసుకుంటే సీఎం చంద్రబాబును సైతం ధిక్కరిస్తామని ఉద్వేగంతో మాట్లాడారు. టీడీపీ అనుకూల పాలక వర్గం అయినా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీకి ఎటువంటి సహకారం అందించడం లేదని ఆయన ఆవేశంగా అన్నారు. హుద్‌హుద్ తుపాను నష్టాన్ని పరిశీలించి వెళ్లిన మంత్రులు ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఫ్యాక్టరీల పనితీరు విషయంలో మాత్రమే అధ్యయనం చేసేందుకు బృందం వస్తుందని తమకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు. నష్టలలో ఉన్న వాటిని పెద్ద ఎత్తున సహాయం చేస్తున్న ప్రభుత్వం తమను మాత్రం ఆదుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు రైతుల మద్దతు లభించింది. వ్యాట్ రద్దు, కోజనరేషన్ పవర్ ధర పెంపు వంటి విషయాలలో ప్రభుత్వం నుంచి అనుకూల నిర్ణయం కోసం చూడాలని ఆయన అధ్యయన బృందాన్ని కోరారు. అధ్యయన బృందానికి కార్మికుల వినతి అధ్యయన బృందానికి సుగర్ ఫ్యాక్టరీ కార్మికుల తరపున వర్క్ మెన్ డెరైక్టర్ శ్రీనివాసరాజు. గుర్తింపు యూనియన్ నాయకుడు కె. భాస్కరరావు వినతిపత్రం సమర్పించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్, డైలీవేజ్ కార్మికులు, సీజనల్కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వివరించారు. ఫ్యాక్టరీపై ప్రభుత్వం విధించిన వ్యాట్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని, కోజనరేషన్ ధరలను పెంచాలని, దీనివల్ల ఫ్యాక్టరీపై ఆర్థికభారం తగ్గుతుందని ఫలితంగా లాభాలు పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వం స్పందించాలి సుగర్ ఫ్యాక్టరీలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చ ర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అ ధ్యయన బృందం ముందు రైతులు ముక్త కంఠంతో నినదించారు.మాజీ ఎమ్మెల్యే, ైవె ఎస్సార్సీపీ నాయకుడు గూనూరు ఎ ర్రునాయుడు(మిలట్రీ నాయుడు) మా ట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం సుగర్ ఫ్యాక్టరీపై విధించిన వ్యాట్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీపై వ్యాట్ ట్యాక్స్ వి ధించడం వల్ల ఫ్యాక్టరీపై సుమారు రూ.8 కోట్లు భారం పడుతోందని ఆవేదన వ్య క్తం చేశారు. మొలాసిస్, విద్యుత్ తక్కువ టారిఫ్ వల్ల ఫ్యాక్టరీ నష్టపోతోందన్నారు. ఫ్యాక్టరీ కో జనరేషన్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌కు ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.2.83ను పెంచాలని వారు డిమాండ్ చేశారు. చీపురుపల్లి సూర్యనారాయణ, గూనూరు సూర్యనారాయణ, భీశెట్టి సిం హాచలం, ఏడువాక సత్యారావు తదితర రైతులు పాల్గొన్నారు. రైతులు అభిప్రాయాలు బృందం సభ్యులు భరద్వాజ్, గురువారెడ్డి నమోదు చేసుకున్నారు. -
‘గోవాడ’ ఎటుపోతోంది!
{పశ్నార్థకంలో సుగర్ ఫ్యాక్టరీ ఆధునికీకరణ నిధుల వేటలో చైర్మన్,యాజమాన్యం ఎటూ తేల్చని ప్రభుత్వం ఇప్పటికే అప్పుల్లో చిక్కుకున్న ఫ్యాక్టరీ సర్వత్రా ఆందోళనలు చోడవరం : గోవాడ సుగర్స్ ఆధునికీకరణ ప్రక్రియ అగమ్యగోచరంగా మారింది. లాభాల్లో ఉన్నప్పుడు ఆధునికీకరణను వ్యతిరేకించిన నాయకులు ఇప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు దీనిపై ఆసక్తి చూపిస్తుండడం ఫ్యాక్టరీ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని అంటున్నారు. బాయిలర్ మిల్లు క్రషింగ్ సామర్థ్యం పెంపు, అదనంగా పంచదార నిల్వ గోడౌన్లు, మొలాసిస్ ట్యాంక్‌ల నిర్మాణాలు చేపట్టాలని కొన్నేళ్లుగా ఫ్యాక్టరీ యోచిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం కాలేదు. 2013 క్రషింగ్ సీజన్ వరకు లాభాల్లో ఉండే ఫ్యాక్టరీ క్రమేణా వాతావరణ పరిస్థితులు, కొత్త పాలకవర్గం రాజకీయ లబ్ధికోసం చేపట్టిన కొన్ని పనులు, ఘోరంగా పడిపోయిన పంచదార ధర, హుద్‌హుద్ తుఫాన్ దెబ్బలతో నష్టాల్లోకి జారుకుంటుంది. పంచదార నిల్వలపై ఇప్పటికే సుమారు రూ.40 కోట్ల మేర అప్పులు తె చ్చారు. ఇప్పుడు బోనస్ పేమెంట్లు, పండగ అడ్వాన్సులు కలిసి మరో రూ.25కోట్లు వరకు అప్పు తేవాల్సి ఉంది. 2013-14 సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపైసా కూడా ఫ్యాక్టరీలకు ఇచ్చి ఆదుకోలేదు. ఫ్యాక్టరీ లాభాల్లో ఉన్నప్పుడు 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.28 కోట్లతో ఆధునికీకరణ పనులకు శంఖుస్థాపన చేయగా, ఆ పనులు ప్రస్తుతం ఫ్యాక్టరీ చైర్మన్‌గా ఉన్న గూనూరు మల్లునాయుడుతో పాటు చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆందోళనలు చేసి అడ్డుకున్నారు. ఆధునికీకరణ జరిగితే అప్పటి కాంగ్రెస్ నాయకులు దోచుకుతినేస్తారన్నది వీరి వాదన. అప్పుడే ఆధునికీకరణ జరిగి ఉంటే ఫ్యాక్టరీకి ఎంతో మేలు జరగడంతో పాటు ఇప్పుడీ పరిస్థితి ఉండేది కానద్న అభిప్రాయం సర్వత్రా రైతుల్లో వ్యక్తమౌతుంది. వైఎస్ లాంటి రైతు పక్షపాతి ముఖ్యమంత్రులు ఆ తర్వాత రాకపోవడంతో గడిచిన ఆరేళ్లలో ఫ్యాక్టరీ ఒడిదుడుకుల మధ్య అంతంత మాత్రం రికవరీతో, పాత యంత్రాలతో ఆపసోపాలు పడుతోంది. కో-జనరేషన్ ప్లాంట్, అధిక చెరకు విస్తీర్ణం, రైతుల సహకారం ఉండటంతో ఏదో లాభనష్టాలు లేకుండా నడుస్తుంది. అప్పట్లో ఆధునికీకరణను వ్యతిరేకించిన టీడీపీ నాయకులే ఇప్పుడు ఫ్యాక్టరీలో, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ఆధునికీకరణ కోసం కొత్త ప్రతిపాదనలతో సిద్ధమయ్యారు. సుమారు రూ.23 కోట్లతో రెండు ప్రతిపాదనలు తయారు చేశారు. ఇప్పుడున్న బాయిలర్ హౌస్ కెపాసిటీని 5500 టన్నులకు విస్తరించడం ఇందులో ప్రధానమైనది. వీటిలో మొదటి ప్రతిపాదన రూ.13 కోట్లు ఇప్పటికే నేషనల్ సుగర్స్ అభివృద్ధి మండలి ఆమోదం కూడా పొందింది. ఇటీవల చోవరం వచ్చిన సీఎం చంద్రబాబు కూడా గోవాడ ఫ్యాక్టరీని అభివృద్ధి చేస్తానని ప్రతిపాదనలు తయారు చేయాలని హడావుడి చేశారు. అయితే ఆధునికీకరణకు నిధులు ఎవరిస్తారు అని ప్రశ్నిస్తే ఫ్యాక్టరీయే సమకూర్చుకోవాలన్న సమాధానం ప్రభుత్వం నుంచి రావడం పాలకవర్గాన్ని డైనమాలో పడేసింది. ఇప్పటికే రూ.2 కోట్లు పెట్టి తుఫాన్ వల్ల జరిగిన నష్టానికి మరమ్మతులు చేశారు. పంచదార తయారు చేసేందుకు అదనంగా మరో సెట్రిప్యూగల్ మెషీన్‌ను రూ.73 లక్షల పెట్టి కొనుగోలు చేశారు. ఇలాంటి పరిస్థితిల్లో ఉన్న అప్పులతో పాటు ఆధునికీకరణకు కొత్త అప్పులు చేస్తే ఫ్యాక్టరీ ఏమౌతుందన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. -
ఎరువుకునోవాడ సుగర్స్
అరకొరగా ఎరువుల సరఫరా చేతులెత్తేసిన నాగార్జున సంస్థ చెరకు రైతుల ఆందోళన కాటాల వద్ద ముష్టియుద్ధాలు ఇన్నాళ్లు వర్షాలు కురవనందుకు కలవరపడ్డారు. ఇప్పుడు ఎరువులు దొరకనందుకు ఆందోళన చెందుతున్నారు. బోర్ల సాయంతో నాట్లు వేసినా ఎరువేస్తేనే చెరకు ఎదుగుతుంది. ఎరువుల పంపిణీలో గోవాడ చక్కెర కర్మాగారం విఫలమైంది. కాటాల వద్ద రైతుల మధ్య ముష్టియుద్ధాలకు దారితీస్తోంది. పది రోజులుగా వర్షం కురుస్తోంది. మొక్కదశ, జడ దశలో చెరకు పంటకు వేయాల్సిన యూరియా, డీఏపీ ఎరువుకు విపరీతమైన కొరత ఏర్పడింది. చోడవరం: గోవాడ చక్కెర కర్మాగారం వడ్డీలేని రుణంపై ఏటా రైతులకు ఎరువులు అందిస్తుంది. కర్మాగారం పరిధిలో 21 చెరకు కాటాలున్నాయి. సుమారు 35 వేల ఎకరాల్లో చెరకు సాగవుతోంది. ఏటా 5 లక్షల టన్నులకు పైగా కర్మాగారం చెరకు గానుగాడుతుంది. ఈ క్రమంలో పంటకు కావలసిన ఎరువులు రైతులకు కర్మాగారమే సరఫరా చేస్తుంది. ఈ ఏడాది కూడా ఎరువు సరఫరా ప్రారంభించినప్పటికీ రైతులకు అవసరమైనంత ఎరువు సరఫరా కాలేదు. ఈ సీజన్‌కు 7,500 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవరసమని అంచనా వేశారు. యూరియా-5500, డీఏపీ-500, ఎస్ఎస్పీ-1000, పొటాష్-500 మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేయాలి. నాగార్జున ఎరువుల సంస్థ నుంచి యూరియా, గోదావరి నుంచి డీఏపీ తెచ్చేందుకు ఆయా సంస్థలతో కర్మాగారం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఎరువులు పూర్తిగా సకాలంలో సరఫరా కాలేదు. నాగార్జున ఎరువుల సంస్థ కేవలం 1170 టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేసింది. ఎస్ఎస్పీ, డీఏపీ ఎరువులు కూడా ఇంకా రావలసి ఉంది. ఇరవై టన్నులు చెరకు సరఫరా చేసే ఒక్కొక్క రైతుకు సుమారు 3 యూరియా బస్తాలు విధిగా ఇవ్వాల్సి ఉంది. కానీ యూరియా సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులకు అందలేదు. దశల వారీగా ఎరువులు సరఫరా అవుతుండటంతో అన్ని కాటాలకు అరకొరగా పంపుతున్నారు. యూరియా సరఫరా ఇక చేయలేమంటూ నాగార్జున సంస్థ చేతులెత్తేయడంతో గోవాడ కర్మాగారం మార్క్‌ఫెడ్‌ను ఆశ్రయించింది. దీంతో వారు 2300 టన్నుల యూరియాను ఇప్పటి వరకు సరఫరా చేశారు. ఇంకా మరో 1500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. దీనిపై కర్మాగారం అధికారులు యమయాతన పడుతున్నారు. వర్షాలు పడుతున్నప్పుడే యూరియా ఇవ్వాల్సి ఉండటంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చింది. అరకొరగా ఎరువులు కాటాలకు రావడంతో కాటాల వద్ద రైతులు తోపులాడుకుంటున్నారు. వాస్తవానికి జులై 15 నాటికే పూర్తిగా ఎరువులు రైతులకు అందాల్సి ఉన్నప్పటికీ యా జమాన్యం నిర్లక్ష్యం వల్ల సరఫరాలో జాప్యం ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎరువులు అందజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వారం రోజుల్లో పూర్తిగా ఎరువుల పంపిణీ ఎరువుల సంస్థల నుంచి సరఫరాలో జాప్యం ఏర్పడటం కొంత ఇబ్బంది వచ్చింది. ప్రస్తుతం యూరియా తప్పా అన్నీ ఎరువులున్నాయి. ఇటీవల బ్లోఔట్ వల్ల నాగార్జున ఎరువుల సంస్థ సరఫరా నిలిపివేయడంతో కలెక్టర్, మంత్రుల సహకారంతో మార్క్‌ఫెడ్ ద్వారా యూరియా తెస్తున్నాం. ఇప్పటి వరకు 3450 టన్నుల యూరియా వచ్చింది. రైతులకు సరఫరా చేశాం. ఇంకా 1500 టన్నుల యూరియా మాత్రమే రావలసి ఉంది. అది కూడా త్వరలోనే వస్తుంది. వారం రోజుల్లో రైతులకు పూర్తిగా ఎరువులు పంపిణీ చేస్తాం. రైతులు అందోళన చెందనవసరం లేదు. -వి.వి.రమణారావు, ఎమ్డీ, గోవాడ చక్కెర కర్మాగారం -
గురువుల్లో ‘610’ గుబులు
=జిల్లాలో 131 మంది బదిలీకి రంగం సిద్ధం =ఆన్లైన్లో తాత్కాలిక జాబితా =డిసెంబర్ 2 వరకు అభ్యంతరాల స్వీకరణ =కలెక్టర్ అనుమతితో త్వరలో తుది జాబితా కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జిల్లా విద్యాశాఖలో బదిలీల కసరత్తు సాగుతోంది. గురువుల్లో 610 జీవో గుబులు మొదలైంది. రాష్ట్ర విభజన డిమాండ్ ఊపిరిపోసుకున్న తరుణంలో 610 జీవో అమలు ప్రాధాన్యత సంతరించుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హయాం నుంచి ఉన్న ఈ జీవోను అమలు చేయాలని కేసీఆర్ కోర్టుకు వెళ్లడంతో అమలు తప్పనిసరి అయ్యింది. తెలంగాణ ప్రాంతంలోని ఆంధ్ర ఉద్యోగులను వారివారి జిల్లాలకు పంపేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో ప్రభుత్వ శాఖల్లో జిల్లాలు, జోన్లవారీగా ఉద్యోగుల బదిలీకి కసరత్తు సాగుతోంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జాయింట్ డెరైక్టర్ (సర్వీసెస్) శ్రీహరి ఈ నెల 23న నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో 610 జీవో అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో పనిచేసే ఇతర జిల్లాల ఉపాధ్యాయులు 610 జీవో ప్రకారం వారివారి సొంత ప్రాంతాలకు వెళ్లాల్సి ఉందని, ఆ దిశగా పూర్తి వివరాలతో కూడిన నివేదికలు సిద్ధం చేయాలని ఆయన తెలిపారు. వాటిపై కలెక్టర్ అధ్యక్షతన ఉన్న జిల్లా స్థాయి కమిటీలో అనుమతి తీసుకుని 610 జీవో ప్రకారం ఈ జిల్లాల్లో ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని ఆయన సూచించారు. దీంతో జిల్లాలోని విద్యాశాఖలో పలువురు ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. వెబ్సైట్లో జాబితా... 610 జీవో ప్రకారం 391 మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు చెందినవారిగా 2007లో గుర్తించారు. వారిలో 45 మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉన్నచోటనే విధుల్లో కొనసాగుతున్నారు. మరో 215 మందిని అప్పట్లోనే బదిలీ చేశారు. మిగిలిన 131 మందిని ఇప్పుడు బదిలీ చేసేలా విద్యాశాఖ అధికారులు తాజాగా రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు తాత్కాలిక జాబితాను సిద్ధం చేసి శనివారం డీఈవో వెబ్సైట్ www.deokrishna.yolasite.comలో ఉంచారు. దీనిపై డిసెంబర్ రెండో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. స్పౌజ్ కేసులు, ఇక్కడే పదోన్నతులు పొందినవారు వెళ్లేందుకు ఇష్టపడరు. ఇతర జిల్లాలకు చెందినవారు ఉద్యోగ నిమిత్తం ఇక్కడే స్థిరపడటంతో పాటు ఈ జిల్లాకు చెందినవారినే పెళ్లి చేసుకుని సెటిలైతే అటువంటి వారంతా ఏదో ఒక కారణం చూపి బదిలీ నిలుపుదల చేసుకునే ప్రయత్నాలు చేసే అవకాశముంది. 610 జీవో ప్రకారం బదిలీ చేయనున్న ఉపాధ్యాయుల జాబితాపై ఆన్లైన్లో వచ్చిన అభ్యంతరాలను విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు దృష్టికి తీసుకెళతారు. అనంతరం తుది జాబితా తయారుచేసి జిల్లా స్థాయి కమిటీలో ఆమోదం పొంది ఆయా ఉపాధ్యాయులను ఈ జిల్లాల్లో రిలీవ్ చేసేందుకు కసరత్తు చేయనున్నారు.