=జిల్లాలో 131 మంది బదిలీకి రంగం సిద్ధం
=ఆన్‌లైన్‌లో తాత్కాలిక జాబితా
=డిసెంబర్ 2 వరకు అభ్యంతరాల స్వీకరణ
=కలెక్టర్ అనుమతితో త్వరలో తుది జాబితా
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జిల్లా విద్యాశాఖలో బదిలీల కసరత్తు సాగుతోంది. గురువుల్లో 610 జీవో గుబులు మొదలైంది. రాష్ట్ర విభజన డిమాండ్ ఊపిరిపోసుకున్న తరుణంలో 610 జీవో అమలు ప్రాధాన్యత సంతరించుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హయాం నుంచి ఉన్న ఈ జీవోను అమలు చేయాలని కేసీఆర్ కోర్టుకు వెళ్లడంతో అమలు తప్పనిసరి అయ్యింది. తెలంగాణ ప్రాంతంలోని ఆంధ్ర ఉద్యోగులను వారివారి జిల్లాలకు పంపేందుకు టీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో ప్రభుత్వ శాఖల్లో జిల్లాలు, జోన్‌లవారీగా ఉద్యోగుల బదిలీకి కసరత్తు సాగుతోంది.
ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జాయింట్ డెరైక్టర్ (సర్వీసెస్) శ్రీహరి ఈ నెల 23న నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో 610 జీవో అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో పనిచేసే ఇతర జిల్లాల ఉపాధ్యాయులు 610 జీవో ప్రకారం వారివారి సొంత ప్రాంతాలకు వెళ్లాల్సి ఉందని, ఆ దిశగా పూర్తి వివరాలతో కూడిన నివేదికలు సిద్ధం చేయాలని ఆయన తెలిపారు. వాటిపై కలెక్టర్ అధ్యక్షతన ఉన్న జిల్లా స్థాయి కమిటీలో అనుమతి తీసుకుని 610 జీవో ప్రకారం ఈ జిల్లాల్లో ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని ఆయన సూచించారు. దీంతో జిల్లాలోని విద్యాశాఖలో పలువురు ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది.
వెబ్‌సైట్‌లో జాబితా...
610 జీవో ప్రకారం 391 మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు చెందినవారిగా 2007లో గుర్తించారు. వారిలో 45 మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉన్నచోటనే విధుల్లో కొనసాగుతున్నారు. మరో 215 మందిని అప్పట్లోనే బదిలీ చేశారు. మిగిలిన 131 మందిని ఇప్పుడు బదిలీ చేసేలా విద్యాశాఖ అధికారులు తాజాగా రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు తాత్కాలిక జాబితాను సిద్ధం చేసి శనివారం డీఈవో వెబ్‌సైట్ www.deokrishna.yolasite.comలో ఉంచారు. దీనిపై డిసెంబర్ రెండో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. స్పౌజ్ కేసులు, ఇక్కడే పదోన్నతులు పొందినవారు వెళ్లేందుకు ఇష్టపడరు.
ఇతర జిల్లాలకు చెందినవారు ఉద్యోగ నిమిత్తం ఇక్కడే స్థిరపడటంతో పాటు ఈ జిల్లాకు చెందినవారినే పెళ్లి చేసుకుని సెటిలైతే అటువంటి వారంతా ఏదో ఒక కారణం చూపి బదిలీ నిలుపుదల చేసుకునే ప్రయత్నాలు చేసే అవకాశముంది. 610 జీవో ప్రకారం బదిలీ చేయనున్న ఉపాధ్యాయుల జాబితాపై ఆన్‌లైన్‌లో వచ్చిన అభ్యంతరాలను విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు దృష్టికి తీసుకెళతారు. అనంతరం తుది జాబితా తయారుచేసి జిల్లా స్థాయి కమిటీలో ఆమోదం పొంది ఆయా ఉపాధ్యాయులను ఈ జిల్లాల్లో రిలీవ్ చేసేందుకు కసరత్తు చేయనున్నారు.
గురువుల్లో ‘610’ గుబులు
Published Sun, Dec 1 2013 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement
Advertisement