‘గోవాడ’ ఎటుపోతోంది!
{పశ్నార్థకంలో సుగర్ ఫ్యాక్టరీ ఆధునికీకరణ
నిధుల వేటలో చైర్మన్,యాజమాన్యం
ఎటూ తేల్చని ప్రభుత్వం
ఇప్పటికే అప్పుల్లో చిక్కుకున్న ఫ్యాక్టరీ
సర్వత్రా ఆందోళనలు
చోడవరం : గోవాడ సుగర్స్ ఆధునికీకరణ ప్రక్రియ అగమ్యగోచరంగా మారింది. లాభాల్లో ఉన్నప్పుడు ఆధునికీకరణను వ్యతిరేకించిన నాయకులు ఇప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు దీనిపై ఆసక్తి చూపిస్తుండడం ఫ్యాక్టరీ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని అంటున్నారు. బాయిలర్ మిల్లు క్రషింగ్ సామర్థ్యం పెంపు, అదనంగా పంచదార నిల్వ గోడౌన్లు, మొలాసిస్ ట్యాంక్‌ల నిర్మాణాలు చేపట్టాలని కొన్నేళ్లుగా ఫ్యాక్టరీ యోచిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం కాలేదు. 2013 క్రషింగ్ సీజన్ వరకు లాభాల్లో ఉండే ఫ్యాక్టరీ క్రమేణా వాతావరణ పరిస్థితులు, కొత్త పాలకవర్గం రాజకీయ లబ్ధికోసం చేపట్టిన కొన్ని పనులు, ఘోరంగా పడిపోయిన పంచదార ధర, హుద్‌హుద్ తుఫాన్ దెబ్బలతో నష్టాల్లోకి జారుకుంటుంది.
పంచదార నిల్వలపై ఇప్పటికే సుమారు రూ.40 కోట్ల మేర అప్పులు తె చ్చారు. ఇప్పుడు బోనస్ పేమెంట్లు, పండగ అడ్వాన్సులు కలిసి మరో రూ.25కోట్లు వరకు అప్పు తేవాల్సి ఉంది. 2013-14 సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపైసా కూడా ఫ్యాక్టరీలకు ఇచ్చి ఆదుకోలేదు. ఫ్యాక్టరీ లాభాల్లో ఉన్నప్పుడు 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.28 కోట్లతో ఆధునికీకరణ పనులకు శంఖుస్థాపన చేయగా, ఆ పనులు ప్రస్తుతం ఫ్యాక్టరీ చైర్మన్‌గా ఉన్న గూనూరు మల్లునాయుడుతో పాటు చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆందోళనలు చేసి అడ్డుకున్నారు.
ఆధునికీకరణ జరిగితే అప్పటి కాంగ్రెస్ నాయకులు దోచుకుతినేస్తారన్నది వీరి వాదన. అప్పుడే ఆధునికీకరణ జరిగి ఉంటే ఫ్యాక్టరీకి ఎంతో మేలు జరగడంతో పాటు ఇప్పుడీ పరిస్థితి ఉండేది కానద్న అభిప్రాయం సర్వత్రా రైతుల్లో వ్యక్తమౌతుంది. వైఎస్ లాంటి రైతు పక్షపాతి ముఖ్యమంత్రులు ఆ తర్వాత రాకపోవడంతో గడిచిన ఆరేళ్లలో ఫ్యాక్టరీ ఒడిదుడుకుల మధ్య అంతంత మాత్రం రికవరీతో, పాత యంత్రాలతో ఆపసోపాలు పడుతోంది. కో-జనరేషన్ ప్లాంట్, అధిక చెరకు విస్తీర్ణం, రైతుల సహకారం ఉండటంతో ఏదో లాభనష్టాలు లేకుండా నడుస్తుంది. అప్పట్లో ఆధునికీకరణను వ్యతిరేకించిన టీడీపీ నాయకులే ఇప్పుడు ఫ్యాక్టరీలో, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ఆధునికీకరణ కోసం కొత్త ప్రతిపాదనలతో సిద్ధమయ్యారు. సుమారు రూ.23 కోట్లతో రెండు ప్రతిపాదనలు తయారు చేశారు. ఇప్పుడున్న బాయిలర్ హౌస్ కెపాసిటీని 5500 టన్నులకు విస్తరించడం ఇందులో ప్రధానమైనది. వీటిలో మొదటి ప్రతిపాదన రూ.13 కోట్లు ఇప్పటికే నేషనల్ సుగర్స్ అభివృద్ధి మండలి ఆమోదం కూడా పొందింది. ఇటీవల చోవరం వచ్చిన సీఎం చంద్రబాబు కూడా గోవాడ ఫ్యాక్టరీని అభివృద్ధి చేస్తానని ప్రతిపాదనలు తయారు చేయాలని హడావుడి చేశారు.
అయితే ఆధునికీకరణకు నిధులు ఎవరిస్తారు అని ప్రశ్నిస్తే ఫ్యాక్టరీయే సమకూర్చుకోవాలన్న సమాధానం ప్రభుత్వం నుంచి రావడం పాలకవర్గాన్ని డైనమాలో పడేసింది. ఇప్పటికే రూ.2 కోట్లు పెట్టి తుఫాన్ వల్ల జరిగిన నష్టానికి మరమ్మతులు చేశారు. పంచదార తయారు చేసేందుకు అదనంగా మరో సెట్రిప్యూగల్ మెషీన్‌ను రూ.73 లక్షల పెట్టి కొనుగోలు చేశారు. ఇలాంటి పరిస్థితిల్లో ఉన్న అప్పులతో పాటు ఆధునికీకరణకు కొత్త అప్పులు చేస్తే ఫ్యాక్టరీ ఏమౌతుందన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది.