
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నామంటూ ఉన్నతాధికారుల వద్ద గొప్పలు.. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే దానిని కార్యదర్శులపైకి నెట్టి వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు.. వాస్తవాలు రాసే సాక్షి విలేకరికి బెదిరింపులు.. నేను ఏదైనా చేస్తానంటూ హూంకరింపులు.. ఇవీ పంచాయతీల్లో ప్రజల సొమ్మును అప్పనంగా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్న ‘చిన్న’ అధికారి లీలలు.
అప్పనంగా ప్రైవేటు సంస్థలకు..
జిల్లా పంచాయతీ కార్యాలయంలో షాడో కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న డివిజనల్ స్థాయిచిన్న అధికారి లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ అధికారి పంచాయతీలను సుందరంగా తీర్చిదిద్దుతున్నామంటూ ఉన్నతాధికారుల వద్ద గొప్పలు పోతున్నారు. పారిశుధ్యం నిమిత్తం ప్రవేశపెట్టిన ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లను ఎక్కువ ధరకు కొని నిధులు గోల్‌మాల్ చేసిందే కాక.. వాటిని స్కానింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థకు అప్పనంగా నిధులు దోచిపెడుతున్నారు. పంచాయతీల్లో పారిశుధ్య పనులు చేయకున్నా.. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించకున్నా.. ఆర్‌ఎఫ్‌ఐడి ట్యాగ్‌లను మాత్రం తప్పనిసరిగా స్కానింగ్ చేయాలంటూ కార్యదర్శులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఒక్కో స్కానింగ్‌కు రూ.3.50 చొప్పున అప్పనంగా కట్టబెడుతున్నారు.
కార్యదర్శులంటే ‘చిన్న’చూపు
ఈ అధికారి కార్యదర్శులంటే చిన్నచూపు చూస్తున్నారు. ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు స్కానింగ్ చేయని కార్యదర్శులపై విరుచుకుపడుతున్నారు. పంచాయతీల్లో చెత్త సేకరించే సిబ్బంది లేకపోవడం, గ్రీన్‌వెహికల్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం వల్ల పారిశుధ్య పనులు సాగడం లేదు. అయినా ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు స్కాన్ చేయాలని కార్యదర్శులను ఆదేశిస్తున్నారు. మాట వినని కార్యర్శులను దుర్భాషలాడుతున్నారు.
పంచాయతీలపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం
జిల్లాలో ప్రతి మండలంలోనూ ఈ అధికారి ప్రైవేటుగా శానిటరీ ఇన్స్‌పెక్టర్ అంటూ కొంతమందిని నియమించి వారి ద్వారా కార్యదర్శులపై పెత్తనం చెలాయిస్తున్నారు. అంతే కాకుండా డివిజనల్ పంచాయతీ అధికారులనూ అజమాయిషీ చేస్తున్నారు. దీంతో ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నామో అర్థంకాని పరిస్థితి పంచాయతీ క్షేత్రస్థాయి అధికారుల్లో నెలకొంది.
‘ప్రత్యేక’ పోస్టుతో మెమోలు
ఈ అధికారి ఏ జిల్లాలోనూ లేని విధంగా పరిశుభ్రతపై ప్రత్యేక పోస్టును సృష్టించుకుని కార్యదర్శులకు మెమోలు జారీ చేయడమూ అధికారయంత్రాంగంలో చర్చనీయాంశమవుతోంది. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పంచాయతీ ఉద్యోగులకు ఎన్జీఓల అండ
ఈ అధికారి వల్ల జిల్లాలో ఎక్కడైనా పంచాయతీ ఉద్యోగులు ఇబ్బందులు పడితే తమ దృష్టికి తీసుకురావాలని, ఏ ఉన్నతాధికారి వల్ల ఇబ్బందులకు గురికావద్దని జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్ చెప్పారు. ఉద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
‘సాక్షి’కి బెదిరింపులు
తన లీలలపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో చిన్న అధికారికి కోపమొచ్చింది. ఆదివారం ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ‘మీరు రాసుకుంటే.. నాలాంటి మెంటలోడు ఉంటాడు ఏదైనా చేయొచ్చుగా.. నేను ఏదైనా చేస్తా’ అంటూ హెచ్చరించారు. దూషణలకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment