రియల్టర్ల నెత్తిన మరో పిడుగు! | Government | Sakshi
Sakshi News home page

రియల్టర్ల నెత్తిన మరో పిడుగు!

Published Fri, Apr 24 2015 1:56 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Government

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని నిర్మాణం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రియల్టర్ల పాలిట శాపంగా మారుతున్నాయి. దండిగా లాభాలు ఆర్జించాలనే ఆత్రుతలో ప్రభుత్వ ప్రకటనలకు స్పందించి భూములు కొనుగోలు చేసినవారు భారీగా నష్టపోతున్నారు. కొత్తగా కృష్ణా జిల్లాలో ఐదు వేల ఎకరాలను సమీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించటం వారినెత్తిన పిడుగుపాటుగా మారింది.
 
 ఇదీ సంగతి..
 ప్రారంభంలో రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యన ఉంటుందని ఒకసారి, కాదు.. కాదు విజయవాడ- నూజివీడు మధ్య ఏర్పడే అవకాశం ఉందని పాలకులు ప్రకటించారు. వీరి మాటలను నమ్మిన రియల్టర్లు, ప్రజలు ఈ రెండు ప్రాంతాల్లో వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. విజయవాడ-నూజివీడు మధ్య భూములు కొనుగోలుచేసిన వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.
 
  తీసుకున్న అప్పులు తీర్చేదారిలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు కూడా. విజయవాడ-గుంటూరు మధ్య భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు అనేక ప్రయాసలతో నష్టాల బారి నుంచి బయటపడ్డారు. చివరకు తుళ్లూరులో రాజధాని ఏర్పాటు కానున్నదనే ప్రకటన రావడంతో రియల్టర్లు, ప్రజలు ఆ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారు. ప్రారంభంలో ఎకరం రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల్లోపు కొనుగోలు చేసిన రియల్టర్లు ఎకరా రూ.1 కోటి నుంచి రూ.1.30 కోట్ల వరకు అమ్ముకుని లాభాలు పొందారు. వీరిని చూసి రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చిన రియల్టర్లు ఎకరా రూ.1.20 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే రాజధానికి సంబంధించిన పనుల్లో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా లేకపోవడంతో భూముల విలువ క్రమంగా పడిపోయింది. రూ.1.20 కోట్ల నుంచి రూ.1.30 కోట్ల వరకు అమ్మకం జరిగిన భూముల ధరలు క్రమంగా రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు పడిపోయాయి. దీంతో ఎక్కువ ధరకు పొలాలను కొనుగోలు చేసిన  రియల్టర్లు తక్కువ ధరకు అమ్మలేక వడ్డీలు చెల్లిస్తూ గగ్గోలు పెడుతున్నారు.
 
 మంత్రి నారాయణ ప్రకటనతో రోడ్డున పడ్డ కుటుంబాలు..  ఇక తాత్కాలిక రాజధాని పేరుతో మంత్రి పి.నారాయణ చేసిన ప్రకటనలు అనేక కుటుంబాలను రోడ్డున పడేశాయి. మంగళగిరికి సమీపంలోని అమరావతి టౌన్‌షిప్‌లో తాత్కాలిక రాజధాని నిర్మాణం జరగనున్నదని రెండు నెలల క్రితం మంత్రి పి.నారాయణ ప్రకటించారు. రాజధాని పనుల్లో ముఖ్యభూమిక వహిస్తున్న నారాయణ నుంచి వచ్చిన ప్రకటనలో వాస్తవం ఉంటుందని భావించి అనేకమంది మంగళగిరి పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. మంత్రి ప్రకటనకు అనుగుణంగానే ఒకటి రెండు రోజులు అమరావతి టౌన్‌షిప్‌లోని చెట్ల తొలగింపు, భూమి చదును చేసే పనులు జరిగాయి.
 
  వీటిని చూసి మరికొంత మంది భూములను కొనుగోలు చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి వెంటనే తరలివచ్చేది లేదని స్పష్టం చేయడంతో తాత్కాలిక రాజధాని ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టింది. అయితే అప్పటికే మంత్రి ప్రకటనను చూసి అమరావతి టౌన్‌షిప్‌కు సమీపంలోని ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన భూములను ప్రజలు ఎగబడి కొనుగోలు చేశారు. అంతకు పూర్వం అక్కడ చదరపు గజం ధర రూ.8 వేలు ఉంటే మంత్రి ప్రకటనతో అది రూ.13 వేలకు పెరిగింది. అనేకమంది ఈ రేటుకు నివేశన స్థలాలను కొనుగోలు చేశారు. అమరావతి టౌన్‌షిప్‌లో తాత్కాలిక రాజధాని ఏర్పాటు లేదని తేలిపోవటంతో ప్రస్తుతం చదరపు గజం ధర రూ.6 వేలకు పడిపోయింది.
 
 తాజా నిర్ణయంతో ఆశలు ఆవిరి..
 రాజధాని నిర్మాణానికి సింగపూర్ సంస్థలతో ఒప్పందాలు కుదురుతున్నాయని సీఎం చంద్రబాబుతో సహా అధికార పార్టీ నేతలంతా ప్రకటనలు చేయడంతో భూముల ధరలు పెరుగుతాయనే ఆశతో రియల్టర్లు ఆశతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ-గుంటూరు, గుంటూరు-అమరావతి ప్రాంతాల మధ్య భూముల ధరలు అనూహ్యంగా పెరుగుతాయన్న ఆశతో నెలవారీ వడ్డీలు కడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి అదనంగా మరో ఐదువేల ఎకరాలను కృష్ణా జిల్లా వైపు సమీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది. దీంతో రియల్టర్ల ఆశలు ఆవిరైపోయాయి. కృష్ణా జిల్లా నందిగామ, కంచికచర్ల ప్రాంతంలో జరగనున్న భూ సమీకరణను దృష్టిలో ఉంచుకుని ఆ జిల్లాకు చెందిన ప్రజలు ఆ పరిసర ప్రాంతాల్లోని స్థలాల కొనుగోలుకే ఆసక్తి చూపే అవకాశం ఉంది.
 
 వారంతా గుంటూరు వైపు భూములు, నివేశన స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు తక్కువగా ఉండటంతో గుంటూరు జిల్లా రియల్టర్లు ఆందోళన చెందుతున్నారు. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగాక భూముల ధరలు పెరుగుతాయనే ఆశతో ఉన్నవారు రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంగా కారణంగా గుంటూరు జిల్లాలోని భూముల ధరలు పెద్దగా పెరిగే అవకాశాలు లేవని కలవరపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement