కొత్త నిబంధనలకు ప్రభుత్వం ఆమోదం
సాక్షి, అమరావతి: తుది విడత కౌన్సెలింగ్‌లో పీజీ మెడికల్ సీటును ఎంపిక చేసుకున్న విద్యార్థి అందులో చేరాల్సిందే! లేకపోతే మూడేళ్లపాటు కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి వీల్లేకుండా డీబార్ కావాల్సి ఉంటుంది. చిట్టచివరి కంటే ముందు కౌన్సెలింగ్‌లో విద్యార్థి ఎంపిక చేసుకుని పొందిన సీటులో చేరకపోతే తుది విడత (తదుపరి) కౌన్సెలింగ్‌కు అర్హత కోల్పోయినట్లే. పీజీ మెడికల్ సీట్ల ‘బ్లాక్’కు చెక్ పెట్టడంలో భాగంగా ప్రభుత్వంఈమేరకు చర్యలు చేపట్టింది. ఐచ్చికాలు బ్లాక్ చేసుకోవడం వల్ల పీజీ సీట్లు భర్తీ కాకుండా వృథా అవుతున్న నేపథ్యంలో నిపుణులు, న్యాయస్థానాల సూచన మేరకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రూపొందించిన కొత్త ప్రవేశ నిబంధనలను ప్రభుత్వం అనుమతించింది.
ఈమేరకు మెడికల్ పీజీ సీట్ల భర్తీకి నిబంధనలు, రిజర్వేషన్ విధానాలను సవరిస్తూ వైద్య విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం కట్‌ఆఫ్ తేదీలోగా పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేయడంతోపాటు సీట్లన్నీ భర్తీ చేయడానికి ఈ నిబంధనలు ఉపకరిస్తాయని అందులో వివరించింది. విలువైన సీట్లు మిగిలిపోకుండా సద్వినియోగం చేయడం, సకాలంలో భర్తీ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కళాశాలల ప్రవేశ నిబంధనలు – 1997ను సవరించినట్లు పేర్కొంది. సవరించిన నిబంధనలను ఈనెల 26న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రకటిస్తుంది. అప్పటి నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.
మెడికల్ పీజీ సీట్ల ‘బ్లాక్’కు చెక్!
Published Sat, Apr 22 2017 12:58 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM
Advertisement
Advertisement