
సాక్షి, అమరావతి బ్యూరో : సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు తూట్లు పొడుస్తోంది. ఏదేని విషయమై సామాన్యులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు.. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే చాలు ఆగమేఘాల మీద కేసులు నమోదు చేసేస్తున్నారు. అలాగే, సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నవారినే కట్టడి చేసేందుకు ప్రభుత్వం పథక రచన చేస్తోంది. ఉదాహరణకు.. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన జి. శ్రీనివాస్‌రెడ్డి వైఎస్సార్ సానుభూతిపరుడిగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఈయనకు ఫేస్‌బుక్‌లో వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు.
టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా ఎండగడుతూ ఉంటారు. దీంతో ఆయన్ను టార్గెట్ చేసిన టీడీపీ నేతలు తమ కార్యకర్త ద్వారా కృష్ణాజిల్లా గుడివాడలో ఫిర్యాదు చేయించారు. శ్రీనివాసరెడ్డి ఓ జాతిని కించపరిచేలా పోస్ట్ చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గుడివాడ పోలీసులు శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేశారు. అలాగే, నెల్లూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మల్లూ నవీన్‌కుమార్‌ను మే 19న గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నవీన్ ఫేస్‌బుక్‌లో వైఎస్సార్ కుటుంబం పేరుతో పేజీ నిర్వహిస్తున్నాడు. దీనికీ వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో టీడీపీ నేతలు కక్ష పెంచుకుని గుంటూరులో ఫిర్యాదు చేశారు. పోలీసులు నెల్లూరుకు వెళ్లి వేకువజామునే నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, గతేడాది ఏప్రిల్‌లో ఇంటూరు రవికిరణ్ అనే వ్యక్తిని గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఉన్నపళంగా హైదరాబాద్ వెళ్లి ఇంట్లో నిద్రిస్తున్న రవిని అరెస్ట్‌చేసి తుళ్లూరుకు తరలించారు. దీంతో ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో 24 గంటల తర్వాత వదిలేసింది. తాజాగా మళ్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటున్న వారిపై అక్రమంగా కేసులు నమోదు చేసి వారిని భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలకు ఉపక్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment