నిధుల తిరుగు టపా!
వంగర: ఎన్నికల సమయంలో ఎన్నో హామీలతో ఊదరగొట్టిన తెలుగుదేశం, అధికారంలోకి వచ్చాక ఆర్థిక సమస్యల పేరుతో కాలక్షేపం చేస్తోంది. ఇప్పుడు అదే వంకతో ప్రభుత్వ శాఖలు, పథకాలు, ప్రాజెక్టుల్లో ఎక్కడ నిధులున్నా వాటిని తిరిగి ప్రభుత్వానికి జమ చేయాలని తాఖీదులు జారీ చేసినట్లు తెలిసిం ది. ఈ నిర్ణయం మడ్డువలస ప్రాజెక్టు నిర్వాసితులకు షాకిచ్చింది. ఈ ప్రాజెక్టు కింద భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం, నిర్వాసిత కాలనీల నిర్మాణానికి గతంలో మంజూరు చేసిన నిధుల్లో సుమారు రూ. 6 కోట్లు ఇంకా ఖర్చు కాలేదు. సర్కారు నిర్ణయం కారణంగా ఇప్పుడు అవి వెనక్కి వెళ్లిపోయినట్లే. ఫలితంగా నిర్వాసితులకు ఇప్పట్లో పరిహారం, సౌకర్యాలు లభించే అవకాశాలు లేనట్లేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
మడ్డువలస ప్రాజెక్టు పరిధిలోని ఏడు నిర్వాసిత గ్రామాలకు 2010లో ప్రభుత్వం రూ.27.35 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో గీతనాపల్లి, పటవర్థనం, దేవకివాడ, వీపీఆర్‌పేట, కొత్తపేట, నరేంద్రపురం, నూకలివాడ(బలిజిపేట మండలం) గ్రామాల్లో భూములు, ఇళ్లు,ఖాళీ స్థలాలు, పశువుల శాలలకు నష్టపరిహారంతోపాటు, గ్రామాలను విడిచి వెళ్లే కుటుంబాలకు రవాణా చార్జీలు కూడా భూసేకరణ అధికారులు చెల్లించారు. నష్టపరిహారం చెల్లింపులకు ఇప్పటివరకు రూ. 21.35 కోట్లు వెచ్చిం చారు. రవాణా చార్జీలకు సంబంధించి రూ. 24 లక్షల్లో కొంత మొత్తం ఖర్చు కాగా ఇంకా నిధులు ఉన్నప్పటికీ.. ఎంత మేరకు ఉన్నాయన్నది పాలకొండ ఆర్డీవో కార్యాలయ అధికారులకే తెలుసు.
ఇక పునరావాస కాలనీల నిర్మాణంతోపాటు సీసీ రోడ్లు, డ్రైనేజీ లు, తాగునీరు, విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు కేటాయించిన సుమారు 5.70 కోట్లతో ఇంత వరకు ఎటువంటి పనులు చేపట్టలేదు. పటువర్థనం, నూకలి వాడ, గీతనాపల్లి, దేవకివాడ, కొత్తపేట, వీపీఆర్‌పేట గ్రామాల నిర్వాసితుల కు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలు సైతం సేకరించలేదు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల సుమారు రూ.6 కోట్లు ఇంకా ఖర్చు కాలేదు. ఈ తరుణంలో ఖర్చు కాకుండా ఉన్న నిధులను ఆగస్టు 31 నాటికి తమకు జమ చేయాలని భూసేకరణ విభాగం రాష్ట్ర ఫైనాన్స్ విభాగం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది.
తనకు రావలసిన నష్టపరిహారం ఇంకా అందకపోవడంతో పటువర్థనం గ్రామానికి చెందిన నల్ల కాశినాయుడు అనే నిర్వాసితుడు సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులను వివరాలు కోరగా ఈ విష యం బయటపడింది. ఇప్పట్లో నష్టపరిహారం చెల్లించలేమని, మిగులు నిధులు ప్రభుత్వానికి మళ్లిస్తున్నామని జిల్లా అధికారులు ఆయనకు పంపిన సమాధానంలో పేర్కొన్నారు. దీంతో నష్టపరిహారం ఎప్పుడు అందుతుందో, మౌలిక సౌకర్యాలు ఎప్పటికి కల్పిస్తారోనని నిర్వాసితులు దిగాలు చెందుతున్నారు.