సేవలకు సెలవు !
Published Wed, Sep 18 2013 12:58 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
సాక్షి, తిరుపతి: ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలోకి దిగడంతో సేవలన్నీ బంద్ అయ్యాయి. విభజన ప్రకటనను నిరసిస్తూ జిల్లా ఆం దోళనలతో అట్టుడుకుతోంది. మంగళవారం జిల్లాలో మెడికల్ జాక్ ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్యశాలలన్నీ మూతబడడంతో ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు క్యూకట్టారు. తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద వెద్యం కోసం రోగులు పడికాపులు కాశారు. సమై క్యాంధ్రకు మద్దతుగా చిన్నాపెద్దా, ఊరూవాడా తే డా లేకుండా రైతులు, కార్మికులు, వ్యాపారులు, న్యాయవాదులు, టీచర్లు, వైద్యులు, వివిధ కుల సంఘాలు,
స్వచ్ఛంద సంస్థల వారు, మహిళా సం ఘాలు, కళాకారులు, హిజ్రాలు, వికలాంగులు రో డ్డెక్కారు. ఉద్యోగులు జీతాలు వదులుకుంటే.. కార్మికులు రోజు కూలీని, కోట్ల రూపాయల వ్యాపారాలను త్యజించి వ్యాపారులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినదిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజాసేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అభివృద్ధి, పాలనాపరమైన కార్యక్రమాలకు సంబంధించి ఫైళ్లన్నీ పేరుకుపోతున్నాయి. మంగళవారం మెడికల్ జాక్ ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్యశాలలు మూతబడడంతో ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు క్యూకట్టారు. అక్కడా వైద్యులు అంతంత మాత్రంగా ఉండడంతో రోగులు ఇబ్బందిపడ్డారు.
రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు
ఏపీ ఎన్జీవోల పిలుపు మేరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, కార్మికులు విధులను బహిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 1,350 ఆర్టీసీ బస్సు సర్వీసులు బస్టాండ్‌కే పరిమితమయ్యాయి. తిరుమలకు వెళ్లే బస్సులను కూడా రెండు రోజుల పాటు బంద్ చేశారు. ఫలితంగా ఆర్టీసీ బస్ డిపోలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. 37 రోజులుగా ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ఇప్పటికి రూ.40 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. బస్సులు తిరక్కపోవడంతో శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనం కరువవుతోంది. ఫలితంగా శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పడిపోతోంది. శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు కూడా భక్తులు లేక బోసిపోతున్నాయి.
కలెక్టరేట్ ఖాళీ..
ఏపీ ఎన్జీవోల పిలుపు మేరకు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొంటున్నారు. ఫలితంగా కలెక్టరేట్, జేసీ, ఏజేసీ, పౌరసరఫరాల శాఖ కార్యాలయాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. అధికారులెవరూ కార్యాలయాలకు రాకపోవడంతో గ్రీవెన్స్ సెల్ వెలవెలబోతోంది. ప్రజాప్రతినిధులు సహా ఎవరూ కలెక్టర్ కార్యాలయం ముఖం చూడడం లేదు. ట్రెజరీ, సంక్షేమ శాఖ కార్యాలయాలు, డీఆర్‌డీఏ, డ్వామా, సమాచార శాఖ కార్యాలయాల్లో సేవలన్నీ స్తంభించాయి. జ జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. జిల్లా పరిషత్ ప్రాంగణానికి తాళాలు వేయడంతో పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, పీఐయూ, సబ్ డివిజన్ కార్యాలయాలు, జెడ్పీ కార్యాలయాలు ఖాళీగా దర్శనమిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం బోసిపోయి కనిపిస్తోంది.
పాలన పడకేసింది
పల్లె పాలనా వ్యవహారాలను చూసే మండల పరిషత్ కార్యాలయాలన్నీ బోసిపోవడంతో పల్లెల్లో సమస్యలు పేరుకుపోయాయి. అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేసేందుకు కూడా ఎవరూ రావడం లేదు. పంచాయతీ కార్యాలయాలు, పశు వైద్యశాలలకు తాళాలు వేశారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి మున్సిపల్ సిబ్బంది కూడా నిరవధిక సమ్మెలో ఉన్నారు. 29 సేవలకు సంబంధించిన 3,500 మంది ఉద్యోగులు ఆయా కార్యాలయాల ముందు బైఠాయించి సమైక్య గళం వినిపిస్తున్నారు. పారిశుధ్యం, తాగునీరు, వీధిలైట్ల నిర్వహణ కార్మికులు విధుల్లో ఉన్నప్పటికీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ‘మీ-సేవ’ ద్వారా అందించే సేవలకూ ఆటంకం ఏర్పడింది. ఇబ్బందులు తప్పకున్నా, ప్రజలంతా సమైక్యాంధ్రే తమ ధ్యేయమని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement