ఒంటిమిట్ట రామునికే ప్రభుత్వ లాంఛనాలు | Government formalities | Sakshi
Sakshi News home page

ఒంటిమిట్ట రామునికే ప్రభుత్వ లాంఛనాలు

Published Thu, Feb 19 2015 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

ఒంటిమిట్ట రామునికే ప్రభుత్వ లాంఛనాలు

ఒంటిమిట్ట రామునికే ప్రభుత్వ లాంఛనాలు

 జిల్లావాసుల కోరిక నెరవేరింది.. పార్టీలకతీతంగా ఉమ్మడిగా కలిసి చేసిన కృషి ఫలించింది.. రాష్ట్రస్థాయిలో ఆధ్యాత్మిక పరంగా జిల్లాకు విశిష్ట గుర్తింపు దక్కింది. ఇకపై ప్రతి నవమినాడు జిల్లా ప్రత్యేక శోభతో విలసిల్లనుంది.. రాష్ట్ర పటంలో జిల్లా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని
 ఆక్రమించుకుంది. ఒంటిమిట్ట కోదండరాముడికే ప్రభుత్వ లాంఛనాలు అందజేసేందుకు  సీఎం అంగీకరించడంతో జిల్లావాసుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి.
 
 కడప కల్చరల్: అయోధ్య ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడు ఇక ప్రతి శ్రీరామ నవమి ఉత్సవాలలోనూ రాజ లాంఛనాలు అందుకోనున్నాడు. ఒంటిమిట్ట కోదండ రామాలయానికే శ్రీరామనవమి నాడు ప్రభుత్వ లాంఛనాలు అందజేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు సమాచారం. దీంతో జిల్లాలో ప్రత్యేకించి రాజంపేట, ఒంటిమిట్టలలో భక్తుల ఆనందోత్సాలు మిన్నంటాయి. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
 భద్రాచలం రాముడికి శ్రీరామ నవమి నాడు అందుతున్న ప్రభుత్వ లాంఛనాలు రాష్ర్టం విడిపోయిన నేపధ్యంలో రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన, గొప్ప ప్రశస్తి గల శ్రీ కోదండ రామయ్యకు అందుతాయని జిల్లా ప్రజలు ఒంటిమిట్టకే రాజలాంఛనాలు దక్కుతాయని ఎంతో ఆశించారు.
 
 దీనికి అడ్డుపడుతూ విజయనగరం జిల్లాలోని రామతీర్థం రామాలయానికి ఆ హోదా దక్కించుకునేందుకు ఆ జిల్లా వాసులు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకమై ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఒంటిమిట్టకే రాజ లాంఛనాలు దక్కడం అన్ని విధాల న్యాయమని స్థానిక రాజకీయ నాయకుల ద్వారా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన భాష, చరిత్ర పరిశోధకులు కట్టా నరసింహులు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ చరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలతో ముందుకు రావడంతో జిల్లా వాసుల డిమాండ్‌కు మరింత బలం చేకూరింది.
 
 ఎత్తులు చిత్తు
 ఒంటిమిట్ట రామాలయానికి ప్రభుత్వ లాంఛనాలు దక్కుతాయోనన్న భయంతో కొందరు విజయనగరం రామతీర్థం ఆలయానికి లేనిపోని ఊహాగానాలతో పురాణగాథలను అప్పటికప్పుడు సృష్టించి దినపత్రికల ద్వారా ప్రచారంచేసే కుట్ర చేశారు. కానీ, అటు పురాణ పరంగా చూసినా, ఇటు చరిత్ర పరంగా చూసినా, జనాంతికంగా గమనించినా ఒంటిమిట్ట రామాలయానికి మాత్రమే రాజలాంఛనాలకు పూర్తి స్థాయి అర్హత ఉందని ‘సాక్షి’ దినపత్రిక శాసనాలు, కైఫీయత్తులు, పేజీ నెంబర్లు సహా ఈ నెల 18న ప్రచురించింది. పౌరాణిక కథనాలతో నిర్ణయం తీసుకోవడం హేతుబద్ధం కాదని, చరిత్ర, పురావస్తుశాఖల నిపుణులతో పరిశీలింపజేసిన అనంతరమే నిర్ణయం తీసుకోవాలన్న ప్రజాభిప్రాయాన్ని ప్రచురించింది.
 
 ప్రజా విజయం
 ఎట్టకేలకు జిల్లావాసులు విజయం సాధించారు. బుధవారం ముఖ్యమంత్రి జిల్లా వాసుల డిమాండుకు అంగీకారం తెలుపుతూ దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేసినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ రాజంపేట ఎమ్మెల్యే, విప్ మేడా మల్లికార్జునరెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
 
 అందరి కృషి
 ఒంటిమిట్ట ఆలయానికి రాజలాంఛనాలు సాధించడంలో దాదాపు అందరి కృషి ఉండడం విశేషం. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులంతా ఒక్కటిగా కలిసి డిమాండ్ చేయడంతో వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి గౌరవించారు. ఇంటాక్ సంస్థ నవంబరు 24న ఒంటిమిట్టలో భారీ ర్యాలీ నిర్వహించింది.
 
 
 సాధన క్రమం ఇలా....
 రాష్ట్రం విడిపోయిన తర్వాత గత నవంబరులో ‘సాక్షి’ దినపత్రిక ‘ఇక ప్రభుత్వ లాంఛనాలు ఒంటిమిట్ట కోదండ రామునికేనా’ అన్న శీర్షికతో జిల్లా టాబ్లాయిడ్‌లో చర్చను లేవనెత్తింది. అనంతరం మొదలైన ప్రజా ఉద్యమానికి ఊతమిస్తూ జనవరి 17, 26 తేదీల్లో కూడా ప్రముఖంగా కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రజలు, భక్తుల డిమాండ్ మేరకు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ప్రభుత్వ విప్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఒంటిమిట్ట రామాలయంలో సమావేశం నిర్వహించి రాజలాంఛనాలు ఈ ఆలయానికే దక్కాలని డిమాండ్ చేశారు. అనంతరం కడప  నగరంలో కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటైంది. పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు పై అంశాన్ని బలపరిచారు.
 
 ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన
 రాష్ర్ట దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గురువారం తిరుమలకు రానున్నారు. శుక్రవారం ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒంటిమిట్ట, తాళ్లపాకలతోపాటు మరికొన్ని ఆలయాలను కూడా సందర్శించనున్నారు. ఒంటిమిట్ట రామునికే రాజ లాంఛనాలు దక్కనున్నాయన్న నేపధ్యంలో ఆయన రాక ప్రత్యేకతను సంతరించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement