
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు పసుపు – కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు ఇస్తామని చెబుతున్న రూ.10 వేలు అప్పుగానేనని మరోసారి తేటతెల్లమైంది. పసుపు – కుంకుమ 2 పథకం కింద డ్వాక్రా సంఘాలకు అందచేయనున్న ఆర్థిక సాయంపై విధివిధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో ఎంఎస్ నెంబరు 17 జారీ చేసింది. డ్వాక్రా మహిళలకు అప్పు వ్యక్తిగతంగా ఇవ్వబోమని, సంఘంలోని సభ్యులను బట్టి మూలధన నిధి రూపంలో మూడు విడతల్లో ఇస్తామని అందులో స్పష్టం చేసింది. పొదుపు సంఘాల మహిళలకు ఇస్తామన్న రూ.పది వేలు అప్పుగానే పరిగణించాలని ఈ జీవో ద్వారా పరోక్షంగా పేర్కొనడం గమనార్హం.
వ్యక్తిగతంగా కాకుండా గ్రూపునకు మూడు విడతల్లో చెక్కులు జారీ చేస్తామని పేర్కొన్న జీవోలో భాగం
అప్పేనని గతంలోనే సర్క్యులర్ జారీ..
పసుపు– కుంకుమ డబ్బులను డ్వాక్రా మహిళలకు వ్యక్తిగతంగా కాకుండా సంఘంలోని సభ్యుల సంఖ్య ఆధారంగా ఒక్కొక్కరికి రూ.పది వేల చొప్పున లెక్కగట్టి ఆ మొత్తాన్ని క్యాపిటల్ గ్రాంట్ (మూలధన నిధి) రూపంలో మూడు విడతల్లో సంబంధిత సంఘం బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు తాజా విధివిధానాల జీవోలో ప్రభుత్వం తెలిపింది. అయితే క్యాపిటల్ గ్రాంట్ రూపంలో పొదుపు సంఘాల ఖాతాలో డబ్బులు జమ చేస్తే వాటిని వినియోగించుకోవాల్సిన తీరుపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్– వెలుగు) కొన్ని విధివిధానాలను నిర్దేశిస్తూ 2015 మే 16వ తేదీన ఓ సర్కులర్‌ను జారీ చేసింది. ఆ సర్కులర్ ప్రకారం క్యాపిటల్ గ్రాంట్ (మూలధన నిధి) రూపంలో సంఘ ఖాతాల్లో జమ అయ్యే నిధులను డ్వాక్రా మహిళలు ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోకూడదు. ఆ డబ్బులను మూలధన నిధిగా భావించి దాని ద్వారా బ్యాంకుల్లో అప్పు తెచ్చుకుని మహిళలు ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకు వినియోగించుకోవాలని సూచించారు. సంఘం ఖాతాలో జమ అయిన ఆ డబ్బులను మహిళలు కావాలనుకుంటే సంఘం నుంచి అప్పుగా తీసుకోవచ్చని ఆ సర్క్యులర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఇచ్చేది అప్పు.. ఎన్నికల కోసం డప్పు
మొత్తంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన పసుపు – కుంకుమ –2 పథకం విధివిధానాల జీవో, అంతకు ముందు 2015లో సెర్ప్ – వెలుగు సంస్థ జారీ సర్కులర్ ద్వారా డ్వాక్రా సంఘాలకు ఇస్తామంటున్న డబ్బులు ప్రభుత్వ రికార్డుల ప్రకారం అప్పేనని స్పష్టమవుతుంది. అయితే ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు తన మోసం బయటపడకుండా డొంక తిరుగుడుగా వ్యవహరిస్తూ ఇచ్చేది క్యాపిటల్ గ్రాంట్ అని ఒక జీవో, ఆ క్యాపిటల్ గ్రాంట్‌ను మహిళలు పంచుకుంటే అది అప్పుగా పరిగణించబడుతుందని మరో సర్కులర్ ద్వారా పేర్కొనడం గమనార్హం.
రూపాయి కూడా మాఫీ చేయలేదని మంత్రే ఒప్పుకున్నారు..
2014 ఎన్నికల ముందు తాను అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చినా ఇప్పటిదాకా ఆయన ఏ ఒక్కరికీ రూపాయి రుణాన్ని కూడా మాఫీ చేయలేదు. సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీత 2018 సెప్టెంబరులో శాసనసభకు ఈమేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం గమనార్హం.
‘ఉచిత’ ప్రచారం ఓట్ల కోసమే..
చంద్రబాబు 2014లో ఆధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల పేరిట రూ.14,204 కోట్ల దాకా రుణాలున్నాయి. రుణమాఫీ ఆశతో మహిళలు ఏళ్ల తరబడి కిస్తీలు కట్టకపోవడంతో మహిళలు తిరిగి చెల్లించలేనంతగా వడ్డీల భారం పెరిగిపోయింది. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోగా దీనికి తోడు గత ప్రభుత్వాలు అమలు చేసిన జీరో వడ్డీ పథకానికి కూడా టీడీపీ సర్కారు ఎగనామం పెట్టడంతో ఆ భారం కూడా మహిళలపైనే పడింది. మొత్తంగా ఈ ఐదేళ్లలో దాదాపు రూ. 30 వేల కోట్ల వరకు చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసగించినట్లు అధికార వర్గాల్లో అంచనాలున్నాయి. మళ్లీ ఎన్నికలు రావడంతో రాష్ట్రంలోని 94 లక్షల మంది డ్వాక్రా మహిళల ఓట్ల కోసం పసుపు–కుంకుమ 2 కింద ఒక్కొక్కరికీ పది వేల చొప్పున ఇస్తామంటూ మరో మోసానికి చంద్రబాబు తెర తీశారు. ఇదంతా ఉచితమనే తరహాలో బహిరంగ వేదికల మీద చెబుతూ అందుకు భిన్నంగా అది అప్పేనని పరోక్షంగా అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
పసుపు– కుంకుమ –2 విధి విధానాలు ఇవీ...
–జనవరి 18వ తేదీ నాటికి సెర్ప్, మెప్మా రికార్డులో నమోదు చేసుకున్న పొదుపు సంఘాలు అదనపు మూలధన నిధి (క్యాపిటల్ గ్రాంట్)
పొందడానికి అర్హులు.
–క్యాపిటల్ గ్రాంట్‌గా ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని మహిళలకు వ్యక్తిగతంగా అందజేయరు. సంఘంలోని సభ్యుల సంఖ్యను బట్టి ఆ మొత్తాన్ని రూ.2500 ఒకసారి, రూ.3500 రెండోసారి, మూడోసారి రూ.4000 చొప్పున ఆయా సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఉదాహరణకు ఒక సంఘంలో పది మంది సభ్యులుంటే మొదటి విడతలో బ్యాంకు ఖాతాల్లో రూ. 25 వేలు జమ చేస్తారు.
– క్యాపిటల్ గ్రాంట్‌ను మూడు పోస్టు డేటెడ్ చెక్కులుగా సంఘం పేరిట అందజేస్తారు. సంఘం సభ్యులందరికీ కలిపి ఒక్కో విడతకు ఒక్కొక్క చెక్కునే అందజేస్తారు.
– మొదటి విడత చెక్కు ఫిబ్రవరి 1వ తేదీన లేదంటే ఆ తర్వాత చెల్లుబాటు అయ్యేలా, రెండో విడత చెక్కు ఈ ఏడాది మార్చి 8వ తేదీతో, మూడో విడత చెక్కు ఏప్రిల్ 5వతేదీతో చెల్లుబాటు అయ్యేలా ముందుగానే మూడు చెక్కులను పంపిణీ చేస్తారు.
– ఫ్రిబవరి మొదటి వారంలో డీఆర్‌డీఏ సిబ్బంది ద్వారా సంఘాల పేరిట మూడు చెక్కులను మహిళలకు అందజేస్తారు.
– ప్రభుత్వం జారీ చేసే చెక్కులకు బ్యాంకుల్లో నేరుగా డబ్బులు చెల్లించకుండా అకౌంట్ పేయీ చెక్కులను జారీ చేస్తారు. మహిళలు ఆ చెక్కులను తమ సంఘం ఖాతాలో తొలుత జమ చేసుకొని ఆ తర్వాత డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.
– గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు చెందిన పీడీ బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులను డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమ చేస్తారు.
– అర్హుల జాబితాను గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ వార్డు కార్యాలయాల్లో అందరికీ తెలిసేలా అందుబాటులో ఉంచుతారు.
– పసుపు–కుంకుమ పథకం గురించి సెర్ప్, మెప్మా విస్తృతంగా ప్రచారం
చేయాలి.
–చెక్కులు అందని పొదుపు సంఘాలు గ్రామ సమాఖ్య, మండల ఏపీఎంలకు వినతిపత్రాలు సమర్పించాలి. సమగ్ర విచారణ అనంతరం ఆయా సంఘాల అర్హతపై నిర్ణయం తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment