శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: చిత్రంలో కనిపిస్తున్న దారి కోసం అధికారులు రూ. 40 లక్షలతో పనులు చేపట్టారు.. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా..? కేవలం నాలుగు ఇళ్లు ఉండి స్థానికంగా ఒక్కరు కూడా నివాసంలేని గ్రామం కోసం రోడ్డు వేస్తున్నారు.. పోనీ ఎవరైనా రోడ్డు కోసం అడిగారా అంటే అదీ లేదు.. పనులు చేపట్టిన శాఖ నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు.. మరి నిధులు ఎలా మంజూరయ్యాయంటే ప్రభుత్వం నుంచి వచ్చాయి అంటూ అధికారుల నుంచి సమాధానం.. అసలు సంగతి ఏమిటంటే.. రోడ్డుకు ఇరువైపులా బడానాయకుల భూములున్నాయి..
ఇంకేముంది వారు తమ పరపతిని ఉపయోగించి నిధులు మంజూరు చేయించుకున్నారు.. చిన్న, సన్నకారు రైతుల పొలాల్లోంచి రోడ్డు ఏర్పాటు చేస్తుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మండలంలోని కవ్వగూడ రోడ్డు నుంచి కొత్వాల్‌గూడ వరకు రోడ్డు ఫార్మేషన్ కోసం పంచాయతీ రాజ్ శాఖ నుంచి జిల్లా పరిషత్ అధికారులు రూ.40 లక్షలు మంజూరు చేశారు. ఈ రోడ్డును మర్లగూడ నుంచి ఏర్పాటు చేస్తున్నారు. కవ్వగూడ అనుబంధంగా ఉన్న మర్లగూడలో కేవలం నాలుగు ఇళ్లు ఉన్నాయి. ఇందులో రెండు ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడ కొన్నేళ్లుగా ఒక్కరు కూడా నివసించడంలేదు. ఈ గ్రామం మీదుగా కొత్వాల్‌గూడ వరకు 4.5 కి.మీ. దూరం మేరకు ఫార్మేషన్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు మధ్యలో ఓ చోట కల్వర్టు కూడా నిర్మించనున్నారు. ఆగస్ట్‌లో నిధులు మంజూరు కాగా వారం రోజులుగా పనులు కొనసాగుతున్నాయి.
రైతుల ఆందోళన..
రోడ్డుకిరువైపలా సన్న, చిన్నకారు రైతులు పంటల సాగుతో ఉపాధి పొందుతున్నారు. అధికారులు రోడ్డును 22 అడుగుల వెడల్పుతో ఇరుపక్కలా ఉన్న పొలాల్లోంచి రోడ్లు వేస్తున్నారు. రైతులకు ముందస్తు సమాచారం గానీ, వారి నుంచి అనుమతి గానీ లేకుండానే పనులు మొదలుపెట్టారు. అడ్డు చెబితే మధ్యవర్తుల ద్వారా రైతులను బెదిరించి దారికి తెచ్చుకుంటున్నారు. ఉన్న కొద్ది పాటి పొలం రోడ్డులో పోతే తమకు జరిగే నష్టాన్ని ఎవరు భరిస్తారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ దారి వెంట కొంతమంది బడా నేతల భూములు ఉండడంతో వారి కోసమే రోడ్డు వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ దారి పనులను అధికారులు సైతం ఆగమేఘాల మీద కొనసాగిస్తున్నారు. కవ్వగూడ దారి నుంచి మర్లగూడ వరకు ఫార్మేషన్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి కొత్వాల్‌గూడ వరకు రోడ్డు వేయడానికి రైతులు అభ్యంతరాలు తెలుపుతుండడంతో మధ్యవర్తులు చర్చలు జరుపుతున్నారు.
గతంలో వేసిన రోడ్డు ఏమైంది..
సుమారు పదేళ్ల కిందట కవ్వగూడ రోడ్డు నుంచి మర్లగూడ వరకు ఫార్మేషన్ పనులు చేశారు. సుమారు రెండు కిలో మీటర్ల దూర వరకు కంకర కూడా వేశారు. ఈ పనులు ఏ నిధులతో చేపట్టారో అధికారుల వద్ద సమాధానం లేదు. ఒకసారి ఫార్మేషన్ చేసిన రోడ్డుకు మరోసారి ఫార్మేషన్ పేరుతో నిధులు మంజూరు చేయడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యాలు లేక అవస్థలు పడుతుంటే ఇక్కడ బడా బాబుల భూములకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా కవ్వగూడ దారి నుంచి కొద్ది దూరం వరకు పట్టా భూమిలో గతంలో వేసిన కంకర రోడ్డును కాదని మరో పక్క నుంచి కొత్తగా ఫార్మేషన్ పనులు చేపట్టంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
రైతులు వద్దంటే పనులు ఆపేస్తాం:
శ్రీనివాస్‌రెడ్డి, డీఈ, పంచాయతీరాజ్ శాఖ
రోడ్డు ఏర్పాటుకు కావాల్సిన స్థలం కోసం పంచాయతీ రాజ్ శాఖ నుంచి రైతులకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వడం కుదరదని డీఈ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతులు అభ్యంతరం చెబితే పనులు ఆపేస్తామన్నారు. గతంలో జరిగిన పనుల వివరాలు తమ వద్ద లేవన్నారు. గతంలో ఉన్న రోడ్డు తక్కువ ఎత్తులో ఉండడంతో ఫార్మేషన్ పనులు మళ్లీ చేపట్టినట్లు ఆయన తెలిపారు.
బడా నేతల భూములకు సర్కారు నిధులతో రోడ్డు
Published Sat, Nov 30 2013 4:45 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement