తెలంగాణ, సీమాంధ్ర అంటూ రాష్ట్రంలో ఒకవైపు ఉద్యమాలు నడుస్తుండగా, సందట్లో సడేమియాలా ప్రభుత్వం వివిధ రకాల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచింది. కొన్ని రకాల రిజిస్ట్రేషన్ ఫీజులను తగ్గించింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర అంటూ రాష్ట్రంలో ఒకవైపు ఉద్యమాలు నడుస్తుండగా, సందట్లో సడేమియాలా ప్రభుత్వం వివిధ రకాల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచింది. కొన్ని రకాల రిజిస్ట్రేషన్ ఫీజులను తగ్గించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందించే వివిధ రకాల సేవలకు సంబంధించి సవరించిన రిజిస్ట్రేషన్ ఫీజులను ప్రభుత్వం ఈనెల 26న గెజిట్‌లో ప్రచురించనుంది. ఇవి వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. సవరించిన రిజిస్ట్రేషన్ ఫీజులపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి వినోద్ కుమార్ అగర్వాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రక్త సంబంధీకులకు దానంగా రాసిచ్చే స్థిరాస్తి సెటిల్‌మెంట్ సహా వివిధ రకాల ఫీజులు పెరిగాయి.
ప్రతి ఒక్కరికీ అవసరమైన ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు (ఈసీ), దస్తావేజు నకళ్ల (సర్టిఫైడ్ కాపీ) ఫీజులు కూడా పెరిగాయి. ప్రస్తుతం రూ.50 ఉన్న సర్టిఫైడ్ కాపీ (సీసీ) ఫీజును ప్రభుత్వం (నాలుగు రెట్లు) రూ. 200కు పెంచింది. ఈసీ (ఆస్తికి సంబంధించి గతంలో జరిగిన లావాదేవీల వివరాల కాపీ) ఫీజు ప్రస్తుతం రూ. వంద ఉంది. ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చేసింది. కాలాన్ని బట్టి ఈసీల కోసం రెండు రకాల ఫీజులు నిర్ణయించింది. 30 ఏళ్లలోపు లావాదేవీల వివరాలతో ఈసీ కావాలంటే రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. 30 ఏళ్లకు మించిన లావాదేవీల వివరాలు కావాలంటే ఈసీ కోసం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. భూమి, ఇళ్లు, ఇంటి స్థలం కొనదలచినవారు తప్పకుండా వాటికి సంబంధించిన ఈసీ, నకళ్లు(సీసీ) తీసుకోవాల్సిందే.
సవరణ మరీ భారం: రిజిస్ట్రేషన్ సమయంలో దిక్కులు, ఇంటిపేర్లు, ఉప నంబర్లు లాంటి అంశాల్లో ఎక్కడైనా తప్పుగా నమోదైతే తర్వాత సవరించుకునే(రెక్టిఫికేషన్) అవకాశం ఉంది. ఆస్తి వాటాదారుల్లో ఎవరైనా ఒకరు విధిలేని పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ సమయానికి రాలేకపోతే, ఫలానా తేదీన వచ్చి సంతకాలు చేస్తామంటూ ఒప్పుదల(రాటిఫికేషన్) ఒప్పందం చేసుకునే వెసులుబాటు ప్రస్తుతం ఉంది. ఆస్తికి సంబంధించి వివాదం ఉన్నా, సర్టిఫికెట్లలో లోపాలున్నా రిజిస్ట్రేషన్ తర్వాత దానిని రద్దు (క్యాన్సిలేషన్) చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఈ మూడు రకాల ఫీజులను ప్రభుత్వం అమాంతం పది రెట్లు పెంచేసింది. వీటికి ప్రస్తుతం రూ. 100 రుసుం ఉండగా వెయ్యికి పెంచింది. దీంతో ఇకపై రిజిస్ట్రేషన్‌కు సంబంధించి సవరణ, ఒప్పుదల, రద్దు తలకు మించిన భారమే. అటెస్టేషన్ ఆఫ్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, విక్రయ హక్కులు లేని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, విల్ ఎంక్వయిరీ, సీల్డ్ కవర్ డిపాజిట్ ఫీజులను రూ.100 నుంచి రూ. వెయ్యికి పెంచింది. సెలవు దినాల్లో రిజిస్ట్రేషన్, భాగస్వామ్య ఒప్పందాలకు సంబంధించిన ఫీజును రూ. వెయ్యి నుంచి రూ. 5 వేలకు పెంచింది.
హక్కుదారు కదలలేని పరిస్థితుల్లో ఉంటే రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకం పెట్టించుకునేందుకు సబ్‌రిజిస్ట్రారు కార్యాలయ సిబ్బంది ఇంటికి వచ్చే వెసులుబాటు ఉంది. దీనినే ప్రైవేట్ అటెండెన్స్ అంటారు. దీనికి ప్రస్తుత రుసుం రూ. 500 కాగా, దీనిని రెట్టింపు చేసింది. సర్టిఫైడ్ కాపీలు (నకళ్ల) కోసం ప్రస్తుతం రూ. 50 చెల్లిస్తుంటే, ఇకపై రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి మరీ భారం: రక్త సంబంధీకులకు స్థిరాస్తి దానంగా కట్టబెడుతూ, సెటిల్‌మెంటు రాయించేందుకు ప్రస్తుతం రూ. వెయ్యి చెల్లిస్తే సరిపోతుంది. ఇకపై దీనికోసం స్థిరాస్తి విలువలో 0.5 శాతం (కనిష్టంగా రూ. వెయ్యి గరిష్టంగా రూ. పది వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎక్కడా కనిష్ట విలువ ఉండదు. అందువల్ల ఈ ఫీజు రూ. వెయ్యి నుంచి రూ. పది వేలకు పెరిగినట్లేనని సబ్ రిజిస్ట్రార్లే చెబుతున్నారు. స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు కుదుర్చుకునే ఒప్పందాల రుసుము భారీగా పెరిగింది. ప్రస్తుతం ఈ ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు రూ. 2 వేలు ఫీజు ఉండగా, ప్రభుత్వం రూ.20 వేలకు పెంచింది. అభివృద్ధి ఒప్పంద ఆస్తి విలువలో ఫీజు 0.5 శాతం గరిష్టంగా రూ.20 వేలు అని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ ఒప్పందాలు చేసుకునే స్థిరాస్తి విలువ ఎక్కడైనా కోట్లలోనే ఉంటుంది.
అందువల్ల ఈ ఫీజు రెండు వేల నుంచి రూ. 20వేలకు పెరిగినట్లేనని, ఇది బిల్డర్లకు, స్థల యజమానులకు భారమేనని, ఈ ప్రభావం ఇళ్ల కొనుగోలుదారులపైనే పడుతుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. టైటిల్ డీడ్‌ల డిపాజిట్ (రుణాలు కావాల్సిన వారు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు) ఫీజు ప్రస్తుతం ఆస్తి విలువలో 0.1 శాతం గరిష్టంగా రూ వెయ్యి ఉండగా, ప్రభుత్వం దీనిని గరిష్టంగా రూ.10 వేలకు పెంచింది. టైటిల్‌డీడ్‌ల విడుదల ఫీజును మాత్రం రూ. వెయ్యికి తగ్గించింది. హక్కు విడుదల దస్తావేజు ఫీజు రూ. వెయ్యి నుంచి రూ. 10వేలకు పెరిగినట్లే. అమ్మకం, డిక్రీ రుసుముల విలువలో 0.5 శాతం యథాతథంగా ఉంటుంది. తనఖా దస్తావేజు రుసుం ఆస్తి విలువలో 0.5 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గింది.
దొంగదెబ్బ
రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచడం దొంగదెబ్బ తీయడమేనని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బందే అంటున్నారు. గత ఏడాది జూలై 25న ప్రభుత్వం వివిధ రకాల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి పెంపు చాలా ఎక్కువగా ఉందని, ఇది అన్యాయమంటూ మంత్రి తోట నరసింహం వ్యతిరేకించడంతో ప్రభుత్వం పెంపుదలను నిలిపివేసింది. ఇప్పుడు మంత్రి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమం సాగుతోంది.
తెలంగాణలో దీనికి వ్యతిరేకంగా కొంత ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచడం అన్యాయమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ‘కర్ణాటకలో స్టాంపు డ్యూటీనే ఒక శాతం ఉంది. ఇక్కడ భారీగా రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడం అన్యాయం. రిజిస్ట్రేషన్ ఫీజు అంటే సర్వీసు చార్జీనే. ఏ శాఖలోనైనా సర్వీస్ చార్జీ మొత్తం ఆ శాఖ సిబ్బంది జీత భత్యాలకు మించి ఉండరాదని సుప్రీంకోర్టు గతంలో రూలింగ్ ఇచ్చింది. మా శాఖలో సర్వీస్ చార్జి రూపేణా రూ.40 కోట్లుపైగా రాబడి వస్తోంది. జీత భత్యాల కింద ఇచ్చేది రూ. 15 కోట్లు కూడా లేదు’ అని ఒక అధికారి ‘సాక్షి’తో అన్నారు.