కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : ఆత్మీయులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో మృతుల కుటుంబసభ్యులు, బంధువులు.. తమవారు తిరిగిరాని లోకాలకు వెళ్లారనే ఆవేదన.. ఇలాంటి సమయంలో ఎవరైనా ‘అయ్యో పాపం..’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ గోదావరిఖని ప్రభుత్వాసుత్రి మార్చురీ సిబ్బంది మాత్రం శవాలపై కాసులు ఏరుకునేందుకు సిద్ధపడుతారు. ఇప్పుడైతేనే అడిగినంత ఇస్తారని తమ కక్కుర్తిని బయటపెడతారు. లేదంటే పోస్టుమార్టం చేయం అని బెదిరిస్తారు.
ఇది ఆసుపత్రిలో నిత్యం జరుగుతున్న తంతు. శవాలకు పోస్టుమార్టం చేసేందుకు సిబ్బంది డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటీవల కాలంలో మరింత పీక్కుతింటున్నారు.
రూ.4వేలు డిమాండ్..
ఈ నెల 26వ తేదీన గోదావరినదిలో మునిగి పట్టణానికి చెందిన జక్కుల సతీష్(19), జక్కుల రాజశేఖర్(20) అనే ఇద్దరు యువకులు చనిపోయారు. వీరి మృతదేహాలను గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం కోసం తీసుకొచ్చారు. పోస్టుమార్టం పూర్తిచేసిన సిబ్బంది మృతుల కుటుంబసభ్యులను రూ.4వేలు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా ఓ వైద్యురాలు, ఆమె భర్తపై మృతుల బంధువుల దాడి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
గతంలో పోస్టుమార్టం వసూళ్ల డబ్బు పంపిణీలో, పోస్టుమార్టం విధుల నిర్వహణలో సిబ్బంది మధ్య పొంతన కుదరక తన్నుకున్న సంఘటనలున్నాయి. వైద్య సిబ్బందికి కొందరు పోలీసులు అండదండలు ఉండడంతో మృతుల బంధువులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఊరుకుంటున్నారు. పోస్టుమార్టం కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యశ్రీరావు విచారణ చేపట్టారు. డీసీహెచ్‌ఎస్‌కు నివేదిక పంపించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తనకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
‘ఖని’ ధర్మాసుపత్రిలో.. రాబందులు!
Published Sat, Mar 1 2014 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
Advertisement
Advertisement