విభజన రాజకీయాల్లో సర్కారు.. బలిపీఠంపై రైతులు | government ignore rain-hit farmers in andhra pradesh | Sakshi
Sakshi News home page

విభజన రాజకీయాల్లో సర్కారు.. బలిపీఠంపై రైతులు

Published Mon, Dec 2 2013 1:01 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

విభజన రాజకీయాల్లో సర్కారు.. బలిపీఠంపై రైతులు - Sakshi

విభజన రాజకీయాల్లో సర్కారు.. బలిపీఠంపై రైతులు

* కరువు తీవ్రతతో తెలంగాణలో 6 నెలల్లో 187 మంది ఆత్మహత్య
* వరద నష్టాలతో రాష్ట్రవ్యాప్తంగా 60 వుంది బలవన్మరణం
* బ్యాంకు రుణాలపై సమీక్షకు సీఎంకు ఏడాదిగా తీరికే లేదు
* ఖరీఫ్‌లో 291 మండలాల్లో కరువున్నట్లు గుర్తించినా నోటిఫై చేయనేలేదు
* పాత రుణాల రీషెడ్యూల్ లేదు.. కొత్త రుణాలకు దిక్కులేదు
* కరువు, తుపాన్ల పరిహారాలు, ఇన్‌పుట్ సబ్సిడీలు మూడేళ్లుగా ఇవ్వనేలేదు
 
సాక్షి, హైదరాబాద్:ఖరీఫ్‌లో కరవు కాటేసింది... రబీలో వరుస వరదలు ముంచేశాయి... రైతన్న సర్వం కోల్పోయాడు... పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు... బతుకు దుర్భరమైపోయింది... సర్కారు నుంచి ఏ కాస్తయినా ఆసరా లభిస్త్తుందేమోనన్న ఆశతో అన్నదాత కన్నీటితో నిరీక్షిస్తున్నాడు! కానీ.. ఆపదలో ఉన్న రైతన్నను కన్నెత్తి చూసే తీరికా.. ఓపికా.. ఇప్పుడు మన సర్కారు నేతలకు ఉంటే కదా!! ‘రాయల తెలంగాణనా? పాత తెలంగాణనా?.. కొత్త పార్టీ పెడదామా..? వద్దా? ప్యాకేజీలు సరిపోతాయా..? లేదా..? యుూటీ అడిగితే చాలా?’- ఈ రాజకీయాల్లో ప్రభుత్వ పెద్దలు, ముఖ్య నేతలు మునిగిపోయారు.

ఏడాది కాలంగా విభజన రాజకీయాలు మినహా మరే అంశమూ వారికి పట్టటం లేదు. అన్నదాతను నట్టేట వదిలేసిన మన నాయకులు.. తాము రాజకీయంగా గట్టెక్కడమెలా అనే అంశంపైనే దృష్టి కేంద్రీకరించారు! ఆ పని మీదే గల్లీ, ఢిల్లీ ప్రదక్షిణలు సాగిస్తున్నారు. తొలుత కరవు, తర్వాత వరదలతో చిన్నాభిన్నమైన రైతాంగం సవుస్యలపై సమీక్షకు కానీ, పరిష్కారాలు చూపే ప్రయుత్నాలకు కానీ, ఏ కొంచెమయినా ఆదుకోవాలన్న ఆలోచనకు కానీ.. సర్కారు నేతలకు సమయమే చిక్కటం లేదు! దీంతో రైతన్నకు బతుకు మీద ఆశ కొడిగడుతోంది. ఆత్మహత్యలే శరణ్యమంటూ ప్రాణత్యాగాలకు సిద్ధపడుతున్నారు. అయినా సర్కారుకు చీమకుట్టినట్లయినా లేదు!

ఖరీఫ్‌లో కరువు నష్టాల్ని తట్టుకోలేక ఆరు నెలల్లోనే తెలంగాణలో 187 వుంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తరువాత కురిసిన భారీ వర్షాలు, తుపాన్లతో నష్టపోయి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 వుంది దాకా తనువులు చాలించారు. లక్షల ఎకరాల్లో ధ్వంసమైన పొలాలు.. కుప్పకూలిన కొబ్బరిచెట్లు, ఇతర తోటలు.. సగం జిల్లాల్లో ఇదే దుస్థితి. ఐనాసరే ప్రభుత్వపరంగా రైతుకు ఊరట కల్పించే ప్రయుత్నాలు కరువయ్యాయి. ‘రుణాల్ని రీషెడ్యూల్ చేస్తాం.. కొంచెం సమయం వెచ్చించి సమీక్షించండి’ అని సాక్షాత్తూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ రెండుసార్లు కోరినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తీరిక దొరకలేదు.

కనీసం.. వర్షాభావాన్ని గుర్తించిన 291 మండలాల్లో కరువును అధికారికంగా నోటిఫై చేయలేదు. ఈ లోపు రబీ వచ్చేసింది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయ, అనుబంధ  రంగాలకు బ్యాంకులు మంజురు చేసిన రుణాలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని జూలైలో గానీ ఆగస్టులో గానీ నిర్వహించి ముఖ్యమంత్రి సమీక్షించాల్సి ఉంది. సమీక్షకు తేదీలను కేటాయించాలని బ్యాంకర్ల కమిటీ ఆగస్టు నెల వరకు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కోరింది. అధికారులు ఈ విషయం సీఎం దృష్టికి తెచ్చినా సమయం లేదు తరువాత చూద్దామంటూ ఆయన దాటవేశారు. ఈలోగా రెండో త్రైమాసిక సమీక్షకు కూడా గడువు సమీపించటంతో బ్యాంకర్ల కమిటీ మరోసారి కాస్త సమయం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రిని కోరింది. సెప్టెంబర్ చివరి వారం లేదా నవంబర్‌లో సమీక్షకు తేదీలను ఖరారు చేయాలని బ్యాంకర్ల కమిటీ కోరింది. అందుకు కూడా ముఖ్యమంత్రి సమయం కేటాయించలేదు.

నోటిఫై చేయుకుండా రీషెడ్యూల్ కుదరదు...
రబీ సీజన్ డిసెంబర్‌తో పూర్తి కావస్తున్న తరుణంలో కూడా వ్యవసాయ రంగానికి రుణాల మంజూరుపై సమీక్షకు సీఎం సమయం ఇవ్వకపోవటంపై అధికారులే పెదవి విరుస్తున్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన ఖరీఫ్ సీజన్‌లో 291 మండలాల్లో కరువు నెలకొన్నట్లు గుర్తించారు. కరువు మండలాలను ప్రభుత్వం గుర్తించి నోటిఫై చేస్తేనే బ్యాంకులు ఆ మండలాల్లోని రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలను మంజూరు చేస్తాయి.

ఇప్పుడు ఖరీఫ్ ముగిసిపోయి రబీ సీజన్ కూడా ఈ నెలతో ముగుస్తున్నప్పటికీ కరువు మండలాలను ప్రభుత్వం నోటిఫై చేయలేదు. దీంతో ఆ మండలాల్లోని రైతులు రుణాలు రీషెడ్యూల్‌కు, కొత్త రుణాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల సంభవించిన తుపాను వల్ల ఖరీఫ్‌లో చేతిదాకా వచ్చిన 30 లక్షల ఎకరాల్లో పంటలను రైతులు నష్టపోయారు. ఆ రైతుల రుణాల రీ షెడ్యూల్ చేసి, కొత్త రుణాల మంజూరుకు కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. పంటలు నష్టపోయిన మండలాలను నోటిఫై చేస్తేనే బ్యాంకులు రుణాలు రీషెడ్యూల్ చేసి, కొత్త రుణాలు మంజూరు చేస్తాయని బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. అలా నోటిఫై చేయకుంటే రుణాల రీషెడ్యూల్, కొత్త రుణాల మంజూరు సాధ్యంకాదని స్పష్టంచేశారు.

రుణాల వుంజూరు అంతంతే...
ఖరీఫ్, రబీలో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలుగా రూ. 49,900 కోట్ల మేర బ్యాంకులు రైతులకు మంజూరు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ. 31,900  కోట్లు (64%) మంజూరు చేశాయి. వ్యవసాయ-అనుబంధ రంగాలకు రూ. 17,200 కోట్ల రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం రూ. 5,000 కోట్లు మాత్రమే మంజూరు చేశాయి. మొత్తం వ్యవసాయ రంగానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 67,200 కోట్ల రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా రూ. 37,000 కోట్లు (55 %) మంజూరు చేశారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రాష్ట్రంలోని పాతిక లక్షల మంది కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించటానికంటూ ప్రత్యేకంగా చట్టం తెచ్చిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం చతికిలపడింది. బ్యాంకులు ఇప్పటివరకు కేవలం 1.43 లక్షల మంది కౌలు రైతులకు మాత్రమే రూ. 200 కోట్ల మేర పంట రుణాలు మంజూరు చేశాయి.

పరిహారాలకూ దిక్కులేదు...
నిన్నమొన్నటి కష్టాలకే కాదు.. ఎప్పుడో వుూడేళ్ల కిందటి పంట నష్టాలకూ ప్రభుత్వం ఇప్పటికీ ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదంటే రైతులపై నిర్లక్ష్యం ఏ స్థారుులో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2010 సంవత్సరానికి గాను ఇన్‌పుట్ సబ్సిడీలు రూ. 5.55 కోట్లు, 2011 భారీ వర్షాల తాలూకు సబ్సిడీ రూ. 37.24 కోట్లు, 2012-13లో కురిసిన భారీవర్షాల నష్టాలకు రూ. 87.26 కోట్లు ఈ రోజుకూ చెల్లించలేదు.

అంతేకాదు.. 2009, 11 సంవత్సరాల్లో కరువు కారణంగా నష్టపోరుున వారికీ ఒక్క పైసా ఇవ్వలేదు. 2012 లోని నీలం తుపాను, 2012-13 తాలూకు కరవుకు సంబంధించిన సబ్సిడీ బకారుులూ రైతులకు చేరలేదు. ఆ తరువాత కురిసిన భారీ వర్షాలకు సంబంధించి తక్షణం తవుకు రూ. 6,510 కోట్ల సాయం ఇవ్వాలని వుుఖ్యవుంత్రి కేంద్రాన్ని కోరితే రూ. 1,000 కోట్లు అడ్వాన్సుగా ఇస్తున్నట్లు గత నెలలో ప్రధాని ప్రకటించినా.. ఇప్పటికీ పైసా రాలేదు. వుళ్లీ వాటి గురించి అడిగిన నాథుడే లేకుండాపోయూడు.
 
 పంటనష్టం వివరాలివీ...
 పై-లీన్, భారీవర్షాలు: పంటనష్టం 28.43 లక్షల ఎకరాలు, 80 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు
 హెలెన్ తుపాను: పంటనష్టం 11.65 లక్షల ఎకరాలు, 30 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement