
తూచ్ అంతా.. ఆన్ లైన్ లోనే..
⇔ బదిలీ ప్రక్రియపై ఆలస్యంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
⇔ ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు
⇔ కోరుకున్న పోస్టింగ్ కోసం కొనసాగుతున్న పైరవీలు
⇔ అనుకూల పోస్టింగ్‌ల కోసం తప్పని సిఫార్సులు
⇔ వ్యవసాయంతోపాటు హౌసింగ్ శాఖలకు మినహాయింపు
⇔ ఈనెల 20లోపు అన్ని శాఖల్లో బదిలీలు పూర్తయ్యేనా?
సాక్షి, కడప: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అట్టహాసంగా బదిలీలు చేయాలని రెండేళ్లుగా సంకల్పిస్తూ అభాసుపాలవుతోంది. గత ఏడాది కూడా ఏదో చేయాలనుకొని... చివరికి ఏమీచేయలేక బదిలీల పర్వాన్ని అర్ధంతరంగా ముగించింది. అంతేకాకుండా ఇన్‌చార్జి మంత్రి కనుసన్నల్లో జరగాలని ఆదేశించిన నేపథ్యంలో కొంతమంది కోర్టుకు వెళ్లడం, మరికొంతమంది వ్యతిరేకించిన నేపథ్యంలో చాలాచోట్ల బదిలీలు ఆగిపోయాయి. ఈసారి పెద్దఎత్తున బదిలీలు జరుగుతాయని ఉద్యోగులంతా భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలను కూడా ప్రభుత్వం అడియాసలు చేసింది.
కేవలం 20 శాతంలోపే బదిలీలు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఈనెల 20వ తేదీలోపు బదిలీల పక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఎంతమేరకు పూర్తవుతాయన్న దానిపై సందిగ్ధత నెలకొంది. గైడ్‌లైన్స్ ఆలస్యంగా రావడం.. గడువు సమీపిస్తుండటం.. కౌన్సెలింగ్ పక్రియ అంతంతమాత్రంగానే కొన్ని శాఖల్లోనే ప్రారంభమైన నేపథ్యంలో బదిలీలు ఎంతమాత్రం జరుగుతాయన్న దానిపై అనుమానాలు కొనసాగుతున్నాయి.
అంతా.. ఆన్‌లైన్..
జిల్లాలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన పక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరగాలని ప్రభుత్వం ఆలస్యంగా తీసుకున్న నిర్ణయంతో బదిలీ కోరుకునే ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బదిలీ కోరుకుంటున్న ఉద్యోగులు ఆన్‌లైన్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొంతమందికి నిబంధనలు తెలియక తికమకపడుతుండగా.. మరికొంతమంది ఇతరుల సాయంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పూర్తిచేసుకున్నారు. దీనిపై చాలామంది ఉద్యోగులకు అవగాహన లేకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. డీఆర్డీఏతోపాటు మరికొన్ని శాఖలకు సంబంధించి ఆన్‌లైన్‌లో కాకుండా సాధారణ రీతిలోనే బదిలీలు జరుగుతున్నాయి.
సిఫార్సులు.. పైరవీలు వేగవంతం.
బదిలీ పక్రియ ఊపందుకున్న నేపథ్యంలో రాజకీయ నేతల సిఫార్సులు... కోరుకున్న పోస్టింగ్ కోసం పైరవీలు కూడా ఊపందుకున్నాయి. కోరుకున్న చోట పోస్టింగ్ దక్కించుకొనేందుకు నేతల ద్వారా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొంతమంది ఉన్నతాధికారులకు పెద్ద ఎత్తున నేతల సిఫార్సు లెటర్లు రావడంతో ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సీనియార్టీ జాబితాలో ఉన్న సీనియర్లను కాకుండా నేతల సిఫార్సులకు పెద్దపీట వేస్తే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు జంకుతున్నట్లు తెలుస్తోంది. కేవలం 20శాతంలోపే ఉద్యోగులను బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొంతమంది పెవికాల్ వీరులు ఇదే అదునుగా ఉన్నచోట నుంచి కదలకుండా ఉండేం దుకు పెద్దఎత్తున నేతల నుంచి ఒత్తిడి తెచ్చేం దుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
హౌసింగ్ శాఖలో బదిలీల నిలుపుదల
ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ శాఖను బదిలీల నుంచి మినహాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకోగా.. తాజాగా హౌసింగ్ శాఖలో బదిలీలను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు కారణం 9, 10 షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన పక్రియ జరిగిన నేపథ్యంలో బదిలీలను నిలిపివేశారు. దీంతో ఈ ఏడాది హౌసింగ్ శాఖకు సంబంధించి కూడా బదిలీలు జరగడం లేదు. ఈ విషయమై హౌసింగ్ శాఖ పీడీ సాయినాథ్‌ను సాక్షి ప్రతినిధి సంప్రదించగా.. ఈ సారికి విభజన నేపథ్యంలో బదిలీలు ఆగిపోయాయని స్పష్టం చేశారు.
అంతా హడావుడే..
జిల్లాలో బదిలీల పక్రియ ప్రారంభం కావడంతో అన్ని శాఖల్లో హడావుడి కనిపిస్తోంది. ఎక్కడచూసినా కౌన్సెలింగ్‌కు హాజరయ్యే వారితోపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటున్న వారితో జిల్లాలోని ఆయా శాఖల ప్రధాన కార్యాలయాల్లో కోలాహలం కనిపిస్తోంది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ కె.వి.సత్యనారాయణ, జేసీ శ్వేత తేవతీయ, జేసీ-2 శేషయ్యల ఆధ్వర్యంలో శాఖల వారీగా కమిటీలు వేసి నిర్వహిస్తున్నారు. ఏదీ ఏమైనా ఉద్యోగుల బదిలీ పక్రియ నేపథ్యంలో కడపలో ఉద్యోగులలో సందడి వాతావరణం కనిపిస్తోంది.