ఆత్మరక్షణలో బాబు సర్కారు | Government launches on the defensive | Sakshi
Sakshi News home page

ఆత్మరక్షణలో బాబు సర్కారు

Published Fri, Apr 10 2015 1:20 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

ఆత్మరక్షణలో బాబు సర్కారు - Sakshi

ఆత్మరక్షణలో బాబు సర్కారు

  • శేషాచలం ‘ఎన్‌కౌంటర్’పై అధికారుల మల్లగుల్లాలు
  •  మృతుల గత చరిత్ర తెలుసుకోవడానికి ప్రాధాన్యం
  •  నేడు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్న డీజీపీ
  •  ఎన్‌కౌంటర్‌పై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
  •  పరిహారం అవసరం లేదన్న హోంమంత్రి చినరాజప్ప
  • సాక్షి, హైదరాబాద్: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది!. ఒకపక్క తమిళనాడు ప్రభుత్వం, మరోపక్క మానవ హక్కుల సంఘాల నుంచి ఎదురవుతున్న నిరసనల నేపథ్యంలో వీటిని ఎదుర్కోవడంపై చంద్రబాబు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. తమిళనాడులో నిరసనలు ముదురుతుండడంతో నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. ఎన్‌కౌంటర్ అంశానికి సంబంధించి శుక్రవారం హైకోర్టులో డీజీపీ కౌంటర్ దాఖలు చేయాలి. దీంతో పోలీసు ఉన్నతాధికారులతో పాటు న్యాయనిపుణులు, సలహాదారులతో గురువారం ఇక్కడ సమావేశం నిర్వహించారు.

    ఎన్‌కౌంటర్‌పై తమిళనాడులో వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం 8 మంది ఉన్నతాధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ అంశంపై పోలీసులు, విచారణ అధికారులు రూపొందించే రికార్డులన్నీ పక్కాగా ఉండాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. మరోపక్క ఎన్‌కౌంటర్ మృతుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావడంతో వారిలో ఎవరైనా గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో నిందితులుగా ఉండటం, అరెస్టు కావడం జరిగిందా? అనే విషయాలను కూడా ఆరా తీస్తున్నారు.  

    హైకోర్టులో కౌంటర్ దాఖలు సమయంలోనే ఎర్రచందనానికి విదేశాల్లో ఉన్న డిమాండ్, శేషాచలం కేంద్రంగా జరుగుతున్న అక్రమ రవాణా, దీని కట్టడికి పోలీసు, అటవీశాఖ అధికారులు తీసుకున్న చర్యలు, స్మగ్లర్లు, కూలీల దాడులు, మరణించిన, క్షతగాత్రులైన అటవీ శాఖ సిబ్బంది తదితర వివరాలనూ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

    శేషాచలం ఎన్‌కౌంటర్ తదనంతర పరిణామాలు, హైకోర్టులో దాఖలు చేయాల్సిన కౌంటర్ అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని సీఎం ఆదేశించారు.
     
    తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం రాసిన లేఖకు శుక్రవారం సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదంతంపై నిష్పాక్షికంగా మెజిస్టీరియల్ విచారణ జరుపుతున్నామని ఈ లేఖలో పేర్కొనే అవకాశం ఉంది.
     
    సమీక్ష సమావేశంలో పాల్గొన్న అటవీ శాఖ అధికారులు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉన్న అటవీ చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, దీనిపై కేంద్రానికి లేఖ రాశామని సీఎంకి వివరించినట్టు తెలిసింది. డీజీపీ రాముడు గురువారం  సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ విడివిడిగా భేటీ అయ్యారు.
     
    తమిళనాడుకు ప్రత్యేక బృందాలు

     
    ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 20 మంది నేర చరిత్రపై దర్యాప్తు చేస్తున్నట్టు డీజీపీ రాముడు పేర్కొన్నారు. దీనికోసం తమిళనాడులోని ధర్మపురి, సేలం, తిరువణ్నామలై జిల్లాలకు పోలీ సు బృందాలను పంపినట్టు తెలిపారు. మృతు ల్లో ఒకడైన తిరువణ్నామలై జిల్లా మేళకుప్సనూరుకు చెందిన జి.రాజేంద్రన్‌పై 2013లో ఎర్రచందనం అక్రమ రవాణా కేసు నమోదైనట్టు వెలుగులోకి వచ్చిం దన్నారు.
     
    పరిహారం అవసరం లేదు: చినరాజప్ప

    సీఎం సమీక్ష అనంతరం హోం శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందింది తమిళనాడు వారు కాబట్టి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం రాసిన లేఖకు త్వరలోనే సమాధానం ఇస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement