ప్రాణాలు పోతున్నా.. ఉద్దానంపై మొద్దునిద్ర | Government neglect on uddanam Kidney disease | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పోతున్నా.. ఉద్దానంపై మొద్దునిద్ర

Published Tue, Apr 11 2017 3:58 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

ప్రాణాలు పోతున్నా.. ఉద్దానంపై మొద్దునిద్ర - Sakshi

ప్రాణాలు పోతున్నా.. ఉద్దానంపై మొద్దునిద్ర

కబళిస్తున్న కిడ్నీ వ్యాధులు.. దశాబ్దం వ్యవధిలో 5 వేల మరణాలు
- ఉద్దానం ప్రాంతంలోని జనాభాలో 28 శాతం మూత్రపిండాల వ్యాధిగ్రస్తులే
- ప్రపంచంలో ప్రమాదకరస్థాయిలో కిడ్నీ వ్యాధిగ్రస్థులున్న మూడు ప్రాంతాల్లో ఒకటి
- వ్యాధుల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలన్న ఐసీఎంఆర్‌
- ఇప్పటికి 77 వేల మందికి వైద్య పరీక్షలు.. 20 శాతం మందిలో అధిక తీవ్రత
- అయినా సమస్య పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి
- కిడ్నీ పరిశోధన కేం్రద్రం ఏర్పాటుకు ప్రతిపాదన కూడా పంపని వైనం
- లోక్‌సభలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ప్రశ్నకు రాతపూర్వక సమాధానం


సాక్షి, అమరావతి/ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
కోనసీమను తలపించే అందాల ఉద్దానం మూత్రపిండాల వ్యాధులతో వణికిపోతోంది. ప్రాణాంతకమైన ఈ సమస్య వేలాది ప్రాణాలను నిలువునా కబళిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడటంలేదు. ప్రతిసారీ ప్రకటనలు, హడావుడి చేసి చేతులు దులుపుకోవడమే తప్ప పరిష్కారం చూపించడంలేదు. ప్రపంచంలో ప్రమాదకరస్థాయిలో కిడ్నీ వ్యాధిగ్రస్థులున్న మూడు ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక సైతం వెల్లడించినా ప్రభుత్వ పెద్దల చెవికి చేరడంలేదు. ఇక్కడి జనాభాలో 28 శాతంమంది కిడ్నీ వ్యాధుల బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నా వారి మనసు కరగడంలేదు.

పరిస్థితి తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం స్పందించి కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించినా.. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన కూడా వెళ్లలేదంటే సర్కారు ఎంతటి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుందో స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్దానం ప్రాంత పరిస్థితి రోజురోజుకూ మరింత అధ్వాన్నంగా తయారవుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వ తీరుపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  

15 వేల మందికి వ్యాధి గుర్తింపు...
కిడ్నీ రోగుల జాతీయ సగటు ఏడుశాతం కాగా... ఉద్దానం ప్రాంతంలోని ఇచ్చాపురం, పలాస నియోజక వర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల్లో కిడ్నీ వ్యాధుల బారినపడినవారు 28 శాతం ఉన్నారని అంచనా. గత దశాబ్ద కాలంలో ఈ ప్రాంతంలో ఐదు వేల మంది కిడ్నీ వ్యాధులతో మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో కుటుంబ సభ్యులంతా ఈ వ్యాధిబారిన పడిన కుటుంబాలున్నాయి. ఈ ఏడాది మార్చి 31 వరకూ ఈ ప్రాంతంలోని సుమారు 110 పల్లెల్లో 77 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 20 శాతం వరకూ బాధితులు తీవ్ర మూత్రపిండాల వ్యాధికి గురైనట్టు తేలింది.

మూత్రపిండాల వ్యాధికి కారణమైన సీరం క్రియాటినైన్‌ 1.2 కంటే తక్కువగా ఉంటేనే కిడ్నీలు సురక్షితంగా ఉన్నట్టు. కానీ ఉద్దానం ప్రాంతంలో 15 వేల మంది పైచిలుకు బాధితుల్లో మోతాదుకు మించి సీరం క్రియాటినైన్‌ ఉన్నట్టు తేలింది. బాధితులకు ఇప్పటికే 80 శాతం పైన కిడ్నీలు దెబ్బతిన్నట్టు వెల్లడైంది. ఇలాంటి వారిని తక్షణమే డయాలసిస్‌ కేంద్రాలకు తరలించాల్సి ఉండగా ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడంలేదు. సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో నామమాత్రపు సేవలు మాత్రమే అందుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్‌ 15 నాటికి వైద్య పరీక్షల ప్రక్రియ పూర్తవుతుందని, బాధితుల సంఖ్య ఇంకెంత పెరుగుతుందోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 30 ఏళ్ల వారుండటం మనసును కలిచి వేస్తోందని వారు తెలిపారు.

వైఎస్‌ఆర్‌ నిధులిచ్చినా...
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల తీవ్రతపై స్థానిక ప్రజాప్రతినిధులు చట్టసభల్లో అనేకసార్లు ప్రస్తావించినా ఫలితం లేకపోయింది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్యపై పరిశోధనకు ప్రాధాన్యం ఇచ్చారు. రూ.25 లక్షల నిధులు మంజూరు చేశారు. దీంతో విశాఖలోని కేజీహెచ్, అమెరికాకు చెందిన హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన నిపుణులు సంయుక్తంగా 2009–10 సంవత్సరంలో ఉద్దానంలో పరిశోధన చేశారు. తొలి దశలో కొంత పురోగతి సాధించారు.

కానీ వైఎస్సార్‌ అకాల మరణంతో ఆ పరిశోధనలకు గండిపడింది. ఇటీవల విశాఖకు వచ్చిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నిపుణుల బృందాన్ని ఉద్దానంలో శాస్త్రీయమైన పరిశోధనలకు పంపిస్తామని చెప్పారు. గత జనవరి 19న సోంపేట పట్టణంలో  నిర్వహించిన సమావేశంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఇచ్చాపురం నియోజక వర్గంలో కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయిస్తామని, సోంపేటలో 60 రోజుల్లో డయాలసిస్‌ కేంద్రం నెలకొల్పుతామని హామీ ఇచ్చారు.

కానీ అసలిప్పటివరకూ కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలే పంపకపోవడం రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతవాసులు అభ్యర్థిస్తున్నారు. వైద్య, సామాజిక కారణాలపై శోధించేందుకు నిపుణులందర్నీ ఏకతాటిపైకి తెచ్చి అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ మూల కారణాలు కనుక్కొనేలా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఉన్నతస్థాయి కమిటీలు ఏం చెప్పాయి?
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. అలాగే కేంద్రం ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) బృందాన్ని వేసింది. ఈ రెండు కమిటీలు చెప్పిన సంగతులేమంటే...
–ఈ ప్రాంతంలో పరిస్థితులపై సుదీర్ఘమైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది
–సీకేడీ (క్రానిక్‌ కిడ్నీ డిసీజెస్‌) వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు పకడ్బందీగా నిర్వహించాలి
–ఇక్కడ కిడ్నీ జబ్బులను నియంత్రించేందుకు వైద్యులు, తదితర సిబ్బందిని బాగా పెంచాలి
–కిడ్నీ వ్యాధులకు కారణమైన పర్యావరణ కారకాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి

కిడ్నీ వ్యాధుల పరిశోధనా కేంద్రం ఏర్పాటును ఏపీ కోరలేదు
రాష్ట్రంలో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ జబ్బుల పరిశోధనా కేంద్రం ఏర్పాటును ఏపీ ప్రభుత్వం కోరిందా? కోరి ఉంటే దాని స్థితిగతులు ఏమిటని తాజాగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) లోక్‌సభలో ప్రశ్నించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌)విభాగాల నుంచి నివేదికలు తీసుకున్నామని, ఏపీలో కిడ్నీ జబ్బులకు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకూ కోరలేదని లోకసభలో రాతపూర్వక సమాధానం ఇచ్చింది. దీన్ని బట్టి ఉద్దానం ప్రాంతంలో పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో స్పష్టమవుతోంది.

దారిలోనే ప్రాణం పోయింది...
బలగ బాలరాజు (40) కవిటి మండలంలోని బోరివంక గ్రామస్థుడు. వీఆర్‌ఏగా పనిచేసే ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మూత్రపిండాల వ్యాధి బారినపడినట్లు 2010 సంవత్సరంలో అతనికి తెలిసింది. బరంపురం, విశాఖపట్నం, హైదరాబాద్‌ల్లోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేసినా చివరకు అప్పులే మిగిలాయి. 2013, జనవరి 10న మెరుగైన వైద్యం కోసం అతన్ని కుటుంబసభ్యులు అద్దె వాహనంలో విశాఖపట్నంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తిరిగి వస్తుండగా ఎచ్చెర్ల వద్దకు రాగానే తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు.

నాలుగేళ్లు లక్షల్లో ఖర్చు చేసినా...
మోహనరావు మజ్జి (46)ది ఇచ్చాపురం మండలంలోని తిప్పనపుట్టుగ స్వగ్రామం. మూత్రపిండాల వ్యాధి బారినపడినట్లు 2009లో తెలిసింది. నాలుగేళ్ల పాటు రూ.లక్షల ఖర్చుతో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు శ్రీకాకుళం రిమ్స్‌లో వారానికి రెండుసార్లు డయాలసిస్‌ చేయించుకునేవాడు. దీనికోసమే 2013, అక్టోబరు 9న అతన్ని భార్య భాస్కురీ శ్రీకాకుళం తీసుకెళ్తుండగా బస్సు పలాస వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. టెక్కలి వచ్చేసరికి ప్రాణం పోయింది.

ప్రభుత్వం నుంచి సాయం లేదు
నా భర్త నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. నేను, నా పిల్లలు కూలి చేసి జీవిస్తున్నాం. అప్పుచేసి నా భర్తకు వైద్యం చేయిస్తున్నాను. ప్రతీ నెలా వైజాగ్‌ ఆసుపత్రికి డయాలసిస్‌కు తీసుకెళ్తున్నాను. డయాలసిస్‌ ఉచితంగా చేసినా మందులు, రానుపోను ఖర్చులు మేము భరించాల్సిందే. మాలాంటి పేదలకు ప్రభుత్వం ఉచితంగా మందులు, రవాణా ఖర్చులు ఇవ్వాలి. కానీ అలాంటి సాయమేదీ ప్రభుత్వం నుంచి అందట్లేదు.
– గీత పొడియా, శ్రీహరిపురం, కవిటి మండలం, ఉద్దానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement