
ప్రభుత్వానిది కక్ష సాధింపు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష శాసనసభ్యులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అసెంబ్లీ కమిటీ హాల్లో బుధవారం జరిగిన సభాహక్కుల కమిటీ ముందు విచారణకు హాజరైన సందర్భంగా ఎమ్మెల్యేలు బి.ముత్యాలనాయుడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, డాక్టర్ సునీల్ కుమార్, కె.సంజీవయ్య, కంబాల జోగులు విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో హోదాపై ఏకగ్రీవ తీర్మానం చేసిన చంద్రబాబు నిస్సిగ్గుగా దాన్ని పక్కన పడేసి.. ఇచ్చింది తీసుకోండి అన్న చందాన కేంద్ర ప్రకటనను స్వాగతిస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు. ప్రాణాలు పోయినాసరే పోరాటం చేసి ప్రత్యేకహోదాను సాధించి తీరుతామని చెప్పారు. ప్రజల పక్షాన ఉద్యమించేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు.
శీతాకాల సమావేశాల్లోగా స్పీకర్‌కు నివేదిక: గొల్లపల్లి
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోగా సభాపతికి నివేదిక సమర్పిస్తామని సభాహక్కుల కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. మంగళవారం జరిగిన విచారణ ప్రక్రియ ముగిసిన అనంతరం కమిటీ సభ్యులు బీసీ జనార్ధన్‌రెడ్డి, శ్రావణ్ కుమార్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ రెండు రోజుల్లో విచారణకు హాజరు కాని ఎమ్మెల్యేలను కూడా డిసెంబర్2వ తేదీన విచారిస్తామని చెప్పారు.