సంగారెడ్డి డివిజన్/కలెక్టరేట్, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. జిల్లాలో మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. పార్లమెంట్, శాసనసభా ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొనే రెవెన్యూ, మండల పరిషత్, పోలీసు అధికారుల బదిలీకి సంబంధించి జిల్లా అధికారులు కసరత్తు చేపట్టారు. జిల్లాలో ఒకే స్థలంలో మూడేళ్లుగా పనిచేస్తున్న తహశీల్దార్లు, ఎంపీడీఓ, సీఐల వివరాలను జిల్లా యంత్రాంగం సేకరించింది. అలాగే జిల్లాకు చెందిన స్థానిక అధికారుల జాబితాను సైతం అధికారులు సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ అధికారులు తమ పరిధిలో మూడేళ్లుగా ఒకే స్థలంలో కొనసాగుతున్న తహశీల్దార్ల జాబితాను కలెక్టరేట్‌కు పంపినట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు 33 మంది తహశీల్దార్లు బదిలీ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మండల పరిషత్ అధికారులు(ఎంపీడీఓ)లను సైతం మొదటిసారిగా ఎన్నికల నేపథ్యంలో బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఎంపీడీఓల జాబితాను జిల్లా పరిషత్ అధికారులు సిద్ధం చేసి కలెక్టరేట్ అధికారులకు సమర్పించినట్లు సమాచారం. జిల్లాలో మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఎంపీడీఓలు సుమారు 20 మందికిపైగా ఉన్నట్లు అంచనా. దీంతో తహశీల్దార్లు, ఎంపీడీఓల బదిలీలకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే పోలీసుశాఖలో సైతం ఒకేచోట మూడేళ్లుగా పనిచేస్తున్న సీఐల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.
ఎన్నికల వేళ.. బదిలీల జాతర!
Published Fri, Jan 24 2014 12:07 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement