రూ.1,000 కోట్ల నిర్మాణం.. అంతా డొల్ల!
కప్పిపుచ్చుకునేందుకు తంటాలు.. బుధవారం మధ్యాహ్నం వరకూ మౌన ముద్ర
- ఆ తర్వాత ఇదంతా ప్రతిపక్షం కుట్రేనని కొత్త వాదన
- కేవలం అసెంబ్లీ లీకులపైనే సీఐడీ విచారణ
- సచివాలయం లీకేజీపై నోరు మెదపని ప్రభుత్వ పెద్దలు
- 24 గంటల్లో నాలుగు రకాలుగా బుకాయింపు
సాక్షి, అమరావతి: వెయ్యి కోట్ల రూపాయలతో వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలు డొల్లేనని తేలిపోవడంతో దాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసింది. ప్రపంచ స్థాయి నిర్మాణమంటూ ఊదరగొట్టినా అందులో నాణ్యత నేతి బీర చందమేనని చిన్నపాటి వర్షం రుజువు చేయడంతో ప్రతిపక్షంపై ఎదురు దాడికి దిగింది. అసలు నిజాలు, వైఫల్యాలు బయటకు రాకుండా మభ్య పెట్టేందుకు మంత్రులు, టీడీపీ నేతలను రంగంలోకి దించి ఇదంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రేనని ఆరోపణలు గుప్పిస్తోంది. వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి కట్టిన భవనాల్లో తప్పెక్కడ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకునేందుకు సిద్ధమైంది.
సోషల్ మీడియాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వ్యతిరేక ప్రచారాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షంపై నింద వేసినట్లే సచివాలయం, అసెంబ్లీ నాణ్యత లోపాలు బయటపడకుండా మళ్లీ అదే పంథాను అనుసరించింది. ప్రపంచ స్థాయి రాజధానిని చిన్నపాటి వర్షం కకావికలం చేయడంతో ఏం చేయాలో పాలుపోక 24 గంటలపాటు మౌనముద్ర దాల్చిన ప్రభుత్వ పెద్దలు బుధవారం మధ్యాహ్నానికి ఎదురుదాడికి వ్యూహం సిద్ధం చేసుకుని బయటకు వచ్చారు. అప్పటికే సోషల్ మీడియా ద్వారా తాత్కాలిక సచివాలయం అసలు రంగు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిపోవడంతో ఎదోలా దృష్టి మరల్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే ఏసీ పైపు లైనును కట్ చేసి జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లోకి నీరు వెళ్లేలా కుట్ర పన్నిందని ఎదురుదాడిని మొదలు పెట్టింది.
మీడియాను ఎందుకు అనుమతించలేదు?
అంతా పారదర్శకంగా ఉందని చెబుతున్న ప్రభుత్వం.. బుధవారం మధ్యాహ్నం వరకు మీడియాను ఎందుకు అసెంబ్లీలోకి అనుమతించలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లో సీలింగ్ విరిగి పడిన, ధారలా వర్షం నీరు పడుతున్న, బకెట్లతో సిబ్బంది బయటకు తోడిపోస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా ఎవరినీ లోనికి పంపలేదు. బుధవారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి మీడియాను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా అడ్డుకున్నారు. అయితే స్పీకర్ వచ్చిన తర్వాత లోనికి తీసుకెళ్లి కేవలం జగన్ చాంబర్ పైభాగాన ఉన్న ప్రాంతాన్నే చూపడంలోని ఆంతర్యం ఏమిటో అర్థం అవుతూనే ఉంది. ఉదయం నుంచి మీడియాను లోనికి పంపకుండా ఇంటిలిజెన్స్ చీఫ్, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు మంత్రాంగం నడిపారు. బయటకు ఏం చెప్పాలనే దానిపై ఒక కథ సిద్ధం చేసుకుని స్పీకర్ వచ్చిన తర్వాత ఆయన నోటితో ఏసీ పైపు లైను లీకైందన్న విషయాన్ని బయట పెట్టించారు.
ఎలక్ట్రికల్ కాండ్యూట్ ద్వారా నీరు వచ్చింది
అసెంబ్లీ భవనంలోని ప్రతిపక్ష నేత గదికి ఎలక్ట్రికల్ కాండ్యూట్ పైపు ద్వారా నీరు వచ్చింది. జగన్ చాంబర్‌లో విద్యుత్ పనుల కోసం ఒక పైపును దించడం వల్ల పైకప్పులో నుంచి ఆ పైపు ద్వారా కూడా నీరు వచ్చింది. దాన్ని ఇంజినీరింగ్ అధికారులు వెంటనే సరి చేశారు. 4వ బ్లాక్ ఒక సెక్షన్‌లో కిటికీ తెరిచి ఉండడం వల్ల ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం వల్ల జల్లుతో నీరు వచ్చింది.
– చెరుకూరి శ్రీధర్, సీఆర్‌డీఏ కమిషనర్ (మంగళవారం రాత్రి)
కిటికీల్లోంచి జల్లు వల్లే నీరొచ్చింది
ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి గదిలో కిటికీల్లోంచి వర్షపు జల్లు లోపలకు వచ్చింది. అసెంబ్లీ భవనంలో ఎలాంటి లీకేజీలు జరగలేదు.
– విజయరాజు, అసెంబ్లీ కార్యదర్శి (బుధవారం ఉదయం)
ఏసీ పైపును ఎవరో కట్ చేశారు
అసెంబ్లీ భవనంపైన ఏసీ పైపు కట్ అవడం వల్లే ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లోకి నీరు వెళ్లింది. ఎవరో కావాలని ఈ పైపును కట్ చేశారు. అన్ని పైపులు బాగానే ఉండగా ఒక్క ఈ పైపునే ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది?
– స్పీకర్ కోడెల శివప్రసాదరావు, (బుధవారం మధ్యాహ్నం)
ఇదంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర
కావాలని అసెంబ్లీలో జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లే ఏసీ పైపును కట్ చేయించి రాద్ధాంతం చేస్తున్నారు. రాజధానిలో ఏదో జరిగి పోయిందంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలా చేస్తున్నారు. నవ నిర్మాణ దీక్ష విజయవంతమవడంతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
– మంత్రులు నారాయణ, నక్కా ఆనంద్‌బాబు (బుధవారం సాయంత్రం)
ఆ లీకేజీపై మాట్లాడరా?
జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లోకి నీరు వచ్చిన విషయంపై ఎదురుదాడి మొదలు పెట్టిన మంత్రులు సచివాలయంలో రెండు, నాలుగు బ్లాకుల్లోకి నీరు ఎలా వచ్చిందనే విషయంపై మాత్రం నోరు మెదపడం లేదు. అసెంబ్లీ లీకేజీపై స్పీకర్ ద్వారా సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేయించి సచివాలయంలో నెలకొన్న అదే పరిస్థితిపై కావాలని మాట దాట వేస్తోంది. దీన్నిబట్టే ప్రభుత్వ వాదన తప్పని స్పష్టమవుతోంది. వాస్తవానికి సచివాలయం నిర్మాణం మొదలైనప్పటి నుంచి నాణ్యతపై అనుమానాలు
ఉన్నా యి.