- ప్రభుత్వ ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ తీర్మానం
- నాలుగు వేల మంది కార్మికుల జీతాల్లో కోత
- నేడు ఆందోళన
విజయవాడ సెంట్రల్ : కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా తయారైంది నగరపాకల సంస్థలో ఔట్‌సోర్సింగ్ కార్మికుల పరిస్థితి. ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి టెండర్ పిలవాలని ఈనెల ఏడో తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెట్టారు. దీనిపై కార్మికులు కదం తొక్కారు. కౌన్సిల్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ ఆ ప్రతిపాదనను కమిషనర్ పెట్టారని, పాత పద్ధతిలోనే ఔట్‌సోర్సింగ్ కార్మికుల్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ మేరకు కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. యాదృచ్ఛికంగా జరిగిందో, ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందో తెలియదు కానీ కార్మికుల్ని ఆర్థికంగా నష్టపరిచేలా తీర్మానం జరిగింది. ఎలా అంటే 2975 మెమో ప్రకారం ఔట్‌సోర్సింగ్ కార్మికుల జీతాన్ని రూ.6,700 నుంచి రూ.8,300కు పెంపుదల చేస్తూ 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారమే కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నారు. 2975 మెమోను రద్దు చేస్తూ పాత విధానాన్నే (నెలకు రూ.6,700) కొనసాగిస్తూ ఏడాది పాటు కార్మికుల్ని కొనసాగించాలని కౌన్సిల్ తాజా తీర్మానంలో పేర్కొన్నారు.
నేడు ధర్నా
ప్రజారోగ్య, ఇంజినీరింగ్, పార్కులు తదితర విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న సుమారు నాలుగు వేల మంది కార్మికులు దీనివల్ల నష్టపోయే ప్రమాదం ఉందని మునిసిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు చెప్పారు. పాలకుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తీర్మానంలో తిరకాసు
Published Mon, May 18 2015 4:38 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement