సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నెలంతా కష్టపడితేనే జీతం సక్రమంగా రాని నేటి పరిస్థితుల్లో ముగ్గురు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పనిచేయకుండానే వేతనాలు చెల్లించిన విద్యాశాఖ తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది మార్చి 23న ఎయిడెడ్ మాయ ప్రభుత్వం సీజ్ చేసిన పాఠశాల ఉపాధ్యాయులకు ఈ ఏడాది ఏప్రిల్ వరకూ వేతనాలు రూ.11 లక్షలు చెల్లించారు. మళ్లీ మే నుంచి ఇప్పటి వరకూ వేతనాలు చెల్లించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
కందుకూరులోని అబ్రహ్మం మెమోరియల్ ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ పాఠశాలకు సంబంధించి స్థల వివాదం ఉంది. అసలు ఈ స్థలం సంస్థది కాదని హైకోర్టు చెప్పడంతో పాటు గుర్తింపును రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో కలెక్టర్, డీఈవో ఆదేశాల మేరకు ఆ స్కూల్‌ను మూసివేయడమే కాకుండా ఆ ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేరోజున అందులో ఉన్న ముగ్గురు ఎయిడెడ్ ఉపాధ్యాయులను వేరే ప్రాంతాల్లోని ఎయిడెడ్ స్కూళ్లకు డిప్యుటేషన్‌పై నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో కె నాగబ్రహ్మేంద్రస్వామిని మద్దిరాలపాడులోని హైస్కూల్‌కు, ఎన్ రాధాకృష్ణమూర్తి, ఇస్సాక్ డేవిడ్‌లను పేర్నమిట్టలోని ఆది ఆంధ్రా ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్‌కు డిప్యుటేషన్‌పై పంపుతూ ఆదేశాలిచ్చారు.
అయితే ఈ ముగ్గురు తమను తమ స్కూల్ కరస్పాండెంట్ రిలీవ్ చేయలేదంటూ వారు ఎక్కడా చేరకుండా ఖాళీగా ఉండిపోయారు. వీరు గత ఏడాది డిసెంబర్‌లోనూ, ఈ ఏడాది మార్చిలో తమను కరస్పాండెంట్ రిలీవ్ చేయకపోవడం వల్ల ఎక్కడా చేరలేని పరిస్థితి ఉందని, అందువల్ల తమకు వేతనాలు చెల్లించాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై విద్యాశాఖ ఈ ముగ్గురు ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వడానికి వీలుగా ఆఫీస్ నోట్‌ను కలెక్టర్‌కు ఇచ్చింది.
ఉపాధ్యాయుల వినతిపత్రంలో తమను కరస్పాండెంట్ రిలీవ్ చేయలేదని పేర్కొనగా, విద్యాశాఖ అధికారులు దీనికి భిన్నంగా ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై వేరే స్కూల్స్‌కు వేయగా అక్కడి కర స్పాండెంట్లు చేర్చుకోనందున వీరిని వేరే స్కూల్స్‌కు డిప్యుటేషన్ వేయడానికి అనుమతి ఇస్తూ అప్పటి వరకూ వేతనాలు చెల్లించాలంటూ నోట్‌పెట్టారు. దీనికి కలెక్టర్ కూడా ఆమోద ముద్ర వేశారు. వీరికి అబ్రహం మెమోరియల్ ఎయిడెడ్ స్కూల్ పేరుతోనే ఏడాదిపాటు సుమారు 11 లక్షల రూపాయల వేతనాలు చెల్లించారు.
ఒక మూతపడిన స్కూల్ పేరుతో వేతనాలు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. వారు ఇప్పటికీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేరే స్కూళ్లలో పనిచేయకుండా, మళ్లీ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ వేతనాల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్‌ను వివరణ కోరగా గతంలో ఉన్న విద్యాశాఖ అధికారి వీరికి వేతనాలు చెల్లించినట్లు తన దృష్టికి వచ్చిందని, పని చేయకుండా వేతనాలు ఇవ్వడం తప్పేనని ఆయన అంగీకరించారు.
ఎయిడెడ్ మాయ
Published Sat, Nov 22 2014 2:24 AM | Last Updated on Fri, Aug 17 2018 6:08 PM
Advertisement
Advertisement