Payment of salaries
-
కూలి చెల్లింపులో జాప్యం వద్దు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని, వీటి చెల్లింపునకే బ్యాంకులు, పోస్టాఫీసులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యంపై బ్యాంకర్లు, తపాలా, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో జూపల్లి గురువారం సమీక్ష నిర్వహించారు. నిరుపేద కూలీలకోసం ఉపాధి హామీ పథకం చేపడుతున్నామని, కూలి చెల్లింపులో జాప్యం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల ద్వారా చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు లేవని, నగదు కొరత కారణంగా పోస్టల్ చెల్లింపుల్లో తీవ్రజాప్యం జరుగుతోందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మంత్రికి తెలిపారు. బ్యాంకుల్లో ఖాతా తీసుకునేందుకు ఆధార్ కార్డుతోపాటు పాన్ కార్డు అడగడం వల్ల ఉపాధి కూలీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అలాగే మూడు నెలలపాటు ఆపరేట్ చేయకుండా ఉన్న కూలీల అకౌంట్లను తొలగించడం, జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ప్రారంభించేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరించడం లాంటి కారణాలతో దాదాపు 60 శాతం చెల్లింపులను పోస్టల్ ద్వారా చేయాల్సి వస్తుందని వివరించారు. ఉపాధి కూలీలకు చెల్లింపులకోసం ఏప్రిల్, మే నెలల్లో బ్యాంకులకు రూ.360 కోట్లను, పోస్టాఫీసులకు రూ.412 కోట్లను విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు బ్యాంకులు రూ.350 కోట్ల వరకు చెల్లింపులు జరిపాయని, తపాలా శాఖ కేవలం రూ.79 కోట్లు మాత్రమే చెల్లించిందని అధికారులు వివరించారు. తపాలా శాఖ తీరుపై జూపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటినుంచి ఎలాంటి జాప్యం లేకుండా చెల్లింపులు జరపాలని పోస్ట్ మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డిని ఆదేశించారు. ఆర్బీఐ నుంచి నగదు విడుదల చేయకపోవడం, వారం రోజులుగా పోస్టల్ సిబ్బంది సమ్మెలో ఉండటం వల్ల చెల్లింపుల్లో జాప్యం జరిగిందని పీవీఎస్ రెడ్డి వివరించారు. నగదు కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఉపాధి నిధుల చెల్లింపు కోసమే ప్రత్యేకంగా రూ.150 కోట్లను బుధవారం విడుదల చేశామని ఆర్బీఐ డిప్యూటీ జనరల్ నాగేశ్వర్రావు తెలిపారు. -
నో వర్క్.. ఫుల్ పే!
1,252 మంది ఉద్యోగులు : 300 కోట్ల జీతాలు ► రెండేళ్లుగా ఏ పనీ చేయకుండానే జీతాల చెల్లింపు ► 1,252 మంది ఏపీ విద్యుత్ ఉద్యోగులు రిలీవై రెండేళ్లు ► ఏపీ అక్కున చేర్చుకోదు.. తెలంగాణ తిరిగి చేర్చుకోదు ► సుప్రీం ఆదేశాలతో పూర్తి జీతాలు చెల్లిస్తున్న తెలంగాణ ► ఖాళీగా కూర్చోబెట్టి ఇప్పటికే రూ.300 కోట్లు చెల్లింపు సాక్షి, హైదరాబాద్ : పని చేయకుండా ఎవరికైనా జీతం ఇస్తారా.. అది కూడా రెండేళ్లుగా.. చాన్సే లేదు.. పని చేయకుండా జీతం ఎందుకు ఇస్తారు అంటారా.. కానీ ఏ పనీ చేయకుండానే జీతం ఇస్తున్నారు.. అది కూడా ఒకరిద్దరికి కాదు ఏకంగా 1,252 మందికి.. తెలంగాణ ప్రభుత్వం ఇలా రెండేళ్లుగా జీతభత్యాలు చెల్లిస్తోంది. 1,252 మంది ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు 2015 జూన్ 11న రిలీవ్ చేశాయి. రిలీవై రెండేళ్లు అవుతున్నా అక్కున చేర్చుకునేందుకు ఏపీ ముందుకు రాకపోవడం.. తిరిగి విధుల్లో చేర్చుకునేందుకు తెలంగాణ ససేమిరా అనడంతో వీరు ఏ రాష్ట్రానికీ చెందని వారిగా గాల్లో వేలాడుతున్నారు. అన్నీ చిక్కుముడులే.. రిలీవైన ఉద్యోగులు తెలంగాణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వివాదం పరిష్కారమయ్యే వరకు ఏపీ, తెలంగాణ 52:48 నిష్పత్తిలో వీరికి జీతభత్యాలను చెల్లించాలని 2015 సెప్టెంబర్ 22న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఏపీ విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. హైకోర్టులో కేసు పరిష్కారమయ్యే వరకు వీరికి తెలంగాణ యాజమాన్యాలే పూర్తి జీతాలు చెల్లించాలని 2016 ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసుపై రోజువారీగా విచారణ జరిపి 8 వారాల్లో తీర్పు జారీ చేయాలని హైకోర్టును ఆదేశించింది. ఈ గడువు గతేడాది జూన్‌లోనే పూర్తయినా హైకోర్టులో కేసు విచారణ ప్రారంభం కాలేదు. మరోవైపు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీలు పలు దఫాలుగా చర్చలు జరిపినా ఇప్పటికీ వివాదం ఓ కొలిక్కి రాలేదు. ఖాళీగా కూర్చోబెట్టి.. వివాదం పరిష్కారమయ్యే వరకు రిలీవైన ఉద్యోగులను తాత్కాలికంగా తెలంగాణలోనే కొనసాగించాలని, వారి జీతభత్యాలను తెలంగాణ విద్యుత్ సంస్థలే చెల్లించాలని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిలీవైన ఏపీ ఉద్యోగులకు ఏ పనీ అప్పగించకుండానే ప్రతి నెలా పూర్తి జీతభత్యాలు చెల్లిస్తున్నాయి. తిరిగి విధుల్లో చేర్చుకుంటే సమస్యలు వస్తాయని భావించి వీరికి రీపోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఇలా వీరిని ఖాళీగా కూర్చోబెట్టి ప్రతి నెలా రూ.12 కోట్ల చొప్పున రెండేళ్లుగా సుమారు రూ.300 కోట్ల జీతభత్యాలను తెలంగాణ విద్యుత్ సంస్థలు చెల్లించాయి. రిలీవైన ఉద్యోగుల్లో ఇప్పటికే పలువురు ఏ పోస్టులో లేకుండా గాల్లోనే రిటైర్ కాగా, కొంత మంది మరణించారు కూడా. -
ఎయిడెడ్ మాయ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నెలంతా కష్టపడితేనే జీతం సక్రమంగా రాని నేటి పరిస్థితుల్లో ముగ్గురు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పనిచేయకుండానే వేతనాలు చెల్లించిన విద్యాశాఖ తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది మార్చి 23న ఎయిడెడ్ మాయ ప్రభుత్వం సీజ్ చేసిన పాఠశాల ఉపాధ్యాయులకు ఈ ఏడాది ఏప్రిల్ వరకూ వేతనాలు రూ.11 లక్షలు చెల్లించారు. మళ్లీ మే నుంచి ఇప్పటి వరకూ వేతనాలు చెల్లించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. కందుకూరులోని అబ్రహ్మం మెమోరియల్ ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ పాఠశాలకు సంబంధించి స్థల వివాదం ఉంది. అసలు ఈ స్థలం సంస్థది కాదని హైకోర్టు చెప్పడంతో పాటు గుర్తింపును రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో కలెక్టర్, డీఈవో ఆదేశాల మేరకు ఆ స్కూల్‌ను మూసివేయడమే కాకుండా ఆ ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేరోజున అందులో ఉన్న ముగ్గురు ఎయిడెడ్ ఉపాధ్యాయులను వేరే ప్రాంతాల్లోని ఎయిడెడ్ స్కూళ్లకు డిప్యుటేషన్‌పై నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో కె నాగబ్రహ్మేంద్రస్వామిని మద్దిరాలపాడులోని హైస్కూల్‌కు, ఎన్ రాధాకృష్ణమూర్తి, ఇస్సాక్ డేవిడ్‌లను పేర్నమిట్టలోని ఆది ఆంధ్రా ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్‌కు డిప్యుటేషన్‌పై పంపుతూ ఆదేశాలిచ్చారు. అయితే ఈ ముగ్గురు తమను తమ స్కూల్ కరస్పాండెంట్ రిలీవ్ చేయలేదంటూ వారు ఎక్కడా చేరకుండా ఖాళీగా ఉండిపోయారు. వీరు గత ఏడాది డిసెంబర్‌లోనూ, ఈ ఏడాది మార్చిలో తమను కరస్పాండెంట్ రిలీవ్ చేయకపోవడం వల్ల ఎక్కడా చేరలేని పరిస్థితి ఉందని, అందువల్ల తమకు వేతనాలు చెల్లించాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై విద్యాశాఖ ఈ ముగ్గురు ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వడానికి వీలుగా ఆఫీస్ నోట్‌ను కలెక్టర్‌కు ఇచ్చింది. ఉపాధ్యాయుల వినతిపత్రంలో తమను కరస్పాండెంట్ రిలీవ్ చేయలేదని పేర్కొనగా, విద్యాశాఖ అధికారులు దీనికి భిన్నంగా ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై వేరే స్కూల్స్‌కు వేయగా అక్కడి కర స్పాండెంట్లు చేర్చుకోనందున వీరిని వేరే స్కూల్స్‌కు డిప్యుటేషన్ వేయడానికి అనుమతి ఇస్తూ అప్పటి వరకూ వేతనాలు చెల్లించాలంటూ నోట్‌పెట్టారు. దీనికి కలెక్టర్ కూడా ఆమోద ముద్ర వేశారు. వీరికి అబ్రహం మెమోరియల్ ఎయిడెడ్ స్కూల్ పేరుతోనే ఏడాదిపాటు సుమారు 11 లక్షల రూపాయల వేతనాలు చెల్లించారు. ఒక మూతపడిన స్కూల్ పేరుతో వేతనాలు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. వారు ఇప్పటికీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేరే స్కూళ్లలో పనిచేయకుండా, మళ్లీ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ వేతనాల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్‌ను వివరణ కోరగా గతంలో ఉన్న విద్యాశాఖ అధికారి వీరికి వేతనాలు చెల్లించినట్లు తన దృష్టికి వచ్చిందని, పని చేయకుండా వేతనాలు ఇవ్వడం తప్పేనని ఆయన అంగీకరించారు. -
బడ్జెట్ లేదు.. జీతాలూ లేవు!
నక్కపల్లి : పనిభారం ఎక్కువగా ఉన్నా జీతాలు చెల్లింపులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని తలయారీలు ఆవేదన చెందుతున్నారు. జీతాలు పెంచినా రెండు నెలలకోసారి ఇవ్వడం వల్ల ఇబ్బం దులు పడుతున్నామని వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏ (తలయారీలకు) జూన్ నెల జీ తాలు చెల్లించలేదు. ఫిబ్రవరి వరకు వీరికి రూ.3200 లు జీతం చెల్లించేవారు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వీరి జీతాలు రూ.ఆరు వేలకు పెంచారు. జిల్లాలో సుమారు 500 మందికి పైగా తలయారీలు పని చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి వరకు వీరికి సబ్ ట్రజరీ ద్వారా 010 పద్దు(హెడ్)కింద జీతాలు ఐదో తేదీలోగా చెల్లించేవారు. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 280, 286 పద్దు(హెడ్)ల ద్వారా చెల్లించాలని ఆదేశాలివ్వడంతో ఫిబ్రవరి నుంచి పెంచిన జీతాలను ఈ పద్దు కింద చెల్లిస్తున్నారు. ఈ విధానంలో రెండు నెలలకొకసారి జీతాలు ఇస్తున్నారు. ఈ పద్దులో మతలబు ఉంది. ఈ హెడ్‌కు ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తేనే డ్రా చేసి జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వోద్యోగులందరికి 010 హెడ్ ద్వారా జీతాలిస్తారు. వీరికి బడ్జెట్ కొరత ఉండదు. 280, 286 పద్దులకైతే రెండు మూడు నెలలకోసారి బడ్డెట్ కేటాయిస్తారు. ప్రస్తుతం అంగన్వాడీ సిబ్బందికి ఈ పద్దుల ద్వారానే జీతాలిస్తున్నారు. తలయారీలదీ అదే పరిస్దితి. దీంతో గతంలో మాదిరిగా తమకు 010 పద్దు కింద జీతాలివ్వాలని తలయారీలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తలయారీలు నక్కపల్లి తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. జూన్ నెల జీతాలు చెల్లించకపోవడంతో పిల్లల ఫీజులు, పుస్తకాల కొనుగోళ్లకు చేతిలో డబ్బులేని పరిస్దితి నెలకొందని వాపోతున్నారు. 010 కింద జీతాలివ్వాలి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మాకు జీతాలు పెంచి ప్రతినెలా అందకుండా చేసింది. గతంలో మాదిరిగా 010 పద్దు కింద మాకు జీతాలు చె ల్లించాలి. వచ్చే నెల కూడా జీతాలు అందుతాయో లేదోనన్న ఆందోళన నెలకొంది. - అబ్బులు, తలయారీ సంఘ అధ్యక్షుడు ఆలస్యం తగదు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే మాకు కూడా నెల నెలా జీతాలివ్వాలి. ఏ ఇతర రాబడి లేక ఇదే వృత్తిపై నిరంతరం గ్రామా న్ని అంటిపెట్టుకుని పనిచేసే మాకు ప్రభుత్వం జీతాలు ఆలస్యం చేయడం తగదు. - బాలు, తలయారీ, నెల్లిపూడి