నో వర్క్.. ఫుల్ పే!
1,252 మంది ఉద్యోగులు : 300 కోట్ల జీతాలు
► రెండేళ్లుగా ఏ పనీ చేయకుండానే జీతాల చెల్లింపు
► 1,252 మంది ఏపీ విద్యుత్ ఉద్యోగులు రిలీవై రెండేళ్లు
► ఏపీ అక్కున చేర్చుకోదు.. తెలంగాణ తిరిగి చేర్చుకోదు
► సుప్రీం ఆదేశాలతో పూర్తి జీతాలు చెల్లిస్తున్న తెలంగాణ
► ఖాళీగా కూర్చోబెట్టి ఇప్పటికే రూ.300 కోట్లు చెల్లింపు
సాక్షి, హైదరాబాద్ : పని చేయకుండా ఎవరికైనా జీతం ఇస్తారా.. అది కూడా రెండేళ్లుగా.. చాన్సే లేదు.. పని చేయకుండా జీతం ఎందుకు ఇస్తారు అంటారా.. కానీ ఏ పనీ చేయకుండానే జీతం ఇస్తున్నారు.. అది కూడా ఒకరిద్దరికి కాదు ఏకంగా 1,252 మందికి.. తెలంగాణ ప్రభుత్వం ఇలా రెండేళ్లుగా జీతభత్యాలు చెల్లిస్తోంది. 1,252 మంది ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు 2015 జూన్ 11న రిలీవ్ చేశాయి. రిలీవై రెండేళ్లు అవుతున్నా అక్కున చేర్చుకునేందుకు ఏపీ ముందుకు రాకపోవడం.. తిరిగి విధుల్లో చేర్చుకునేందుకు తెలంగాణ ససేమిరా అనడంతో వీరు ఏ రాష్ట్రానికీ చెందని వారిగా గాల్లో వేలాడుతున్నారు.
అన్నీ చిక్కుముడులే..
రిలీవైన ఉద్యోగులు తెలంగాణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వివాదం పరిష్కారమయ్యే వరకు ఏపీ, తెలంగాణ 52:48 నిష్పత్తిలో వీరికి జీతభత్యాలను చెల్లించాలని 2015 సెప్టెంబర్ 22న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఏపీ విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి.
హైకోర్టులో కేసు పరిష్కారమయ్యే వరకు వీరికి తెలంగాణ యాజమాన్యాలే పూర్తి జీతాలు చెల్లించాలని 2016 ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసుపై రోజువారీగా విచారణ జరిపి 8 వారాల్లో తీర్పు జారీ చేయాలని హైకోర్టును ఆదేశించింది. ఈ గడువు గతేడాది జూన్‌లోనే పూర్తయినా హైకోర్టులో కేసు విచారణ ప్రారంభం కాలేదు. మరోవైపు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సమక్షంలో ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీలు పలు దఫాలుగా చర్చలు జరిపినా ఇప్పటికీ వివాదం ఓ కొలిక్కి రాలేదు.
ఖాళీగా కూర్చోబెట్టి..
వివాదం పరిష్కారమయ్యే వరకు రిలీవైన ఉద్యోగులను తాత్కాలికంగా తెలంగాణలోనే కొనసాగించాలని, వారి జీతభత్యాలను తెలంగాణ విద్యుత్ సంస్థలే చెల్లించాలని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిలీవైన ఏపీ ఉద్యోగులకు ఏ పనీ అప్పగించకుండానే ప్రతి నెలా పూర్తి జీతభత్యాలు చెల్లిస్తున్నాయి.
తిరిగి విధుల్లో చేర్చుకుంటే సమస్యలు వస్తాయని భావించి వీరికి రీపోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఇలా వీరిని ఖాళీగా కూర్చోబెట్టి ప్రతి నెలా రూ.12 కోట్ల చొప్పున రెండేళ్లుగా సుమారు రూ.300 కోట్ల జీతభత్యాలను తెలంగాణ విద్యుత్ సంస్థలు చెల్లించాయి. రిలీవైన ఉద్యోగుల్లో ఇప్పటికే పలువురు ఏ పోస్టులో లేకుండా గాల్లోనే రిటైర్ కాగా, కొంత మంది మరణించారు కూడా.