‘చేనేత’కు కత్తెర | government planning to reduce market development assistance for handloom products | Sakshi
Sakshi News home page

‘చేనేత’కు కత్తెర

Published Sat, Aug 31 2013 11:58 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

government planning to reduce market development assistance for handloom products

 సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలో చేనేత రంగం కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. చేనేత ఉత్పత్తులు తగ్గడంతోపాటు చేనేత కార్మికులకు ఉపాధి కరువైంది. కష్టకాలంలో ఈ రంగాన్ని ప్రోత్సహించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి చేయి చూపాయి. అదీగాక చేనేత సహకార సంఘాలకు అందించే మార్కెట్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ స్కీం, చేనేత అమ్మకాలపై అందజేసే పది శాతం రిబేట్ పథకాన్ని ఎత్తివేయాలని నిర్ణయం ఇచ్చినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై చేనేత సహకార సంఘాల కార్మికులు, ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 జిల్లాలో సంఘాల పరిస్థితి ఇది..
 జోగిపేట, నారాయణఖేడ్, దుద్దెడ, దుబ్బాక, సిద్దిపేటలో చేనేత సహకార సంఘాలు కొంత చురుగ్గా పనిచేస్తున్నాయి. ఆయా సంఘాల్లోని కార్మికులు ఉత్పత్తులను తయారు చేయడంతోపాటు బహిరంగ మార్కెట్‌లోనూ విక్రయిస్తున్నారు. ఉత్పత్తుల అమ్మకాలను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మార్కెటింగ్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ పథకాన్ని అమలు చేస్తుంది. ఏడాదిలో తయారు చేసిన ఉత్పత్తులు, అమ్మకాలపై పరిగణలోకి తీసుకుని వాటిలో పది శాతం మొత్తాన్ని ఈ పథకం కింద సహకార సంఘాలకు నేరుగా నిధులు అందేవి. గత ఏడాది జోగిపేట, నారాయణఖేడ్, దుద్దెడ, దుబ్బాక, సిద్దిపేటలోని చేనేత సహకార సం ఘాలు బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ. 1.73 కోట్ల అమ్మకాలు చేశాయి. దీంతో మార్కెటింగ్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ స్కీం కింద రూ.5.86 లక్షల ఇన్‌సెంటివ్(పోత్సాహక నిధు లు) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తాయి. అయితే ప్రస్తుత  ఏడాది నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెటింగ్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ స్కీంను ఎత్తివేసినట్టు సమాచారం. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత సహకార సంఘాల మనుగడపై తీవ్ర ప్రభావం చూపనుందని సహకార సంఘానికి చెందిన అధికారి ఒకరు తెలి పారు. ఇన్‌సెంటివ్ స్కీం కింద నిధులు నిలిపివేయటంతో సహకార సంఘాల మూల నిధి నిల్వలు తగ్గి తద్వారా చేనేత ఉత్పత్తులపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు పని తగ్గి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై సహకార సంఘాల వారు మండిపడుతున్నారు. వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
 
 రిబేటుపైనా..
 చేనేత ఉత్పుత్తులను ఎక్కువ శాతం ఆప్కో కొనుగోలు చేస్తుంది. మిగితా ఉత్పత్తులను సహకార సంఘాల వారు విక్రయ కేంద్రాలు, ఎగ్జిబిషన్‌లలో అమ్ముతుంటారు. అమ్మకాలను పెంచేందుకు ప్రభుత్వం ఎగ్జిబిషన్ అమ్మకాలపై పది శాతం రిబేటు ఇచ్చేందుకు సహకార సం ఘాలకు వీలు కల్పించింది. పది శాతం రిబేటు సొమ్మును సహకార సంఘాల ఖాతాల్లో ప్రభుత్వం తర్వాత జమచేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పది శాతం రిబేటుగా ఇచ్చే నిధులను సైతం నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే మార్కెటింగ్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ స్కీం, పది శాతం రిబేటు ఎత్తివేతకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఉత్తర్వులకు అందాల్సి ఉందని చేనేత, జౌళి శాఖ ఏడీ రమేశ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement