ఇందిరా పార్కు వద్ద ధర్నాలో పార్టీల నేతల డిమాండ్
హైదరాబాద్, న్యూస్‌లైన్: వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఎంతో కృషి చేస్తున్న ఆదర్శ రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వివిధ పార్టీలకు చెందిన నేతలు డిమాండ్ చేశారు. తమకు కనీస వేతన చట్టం ప్రకారం రూ. 6,900 జీతం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బీమా తదితర డిమాం డ్లతో ఆదర్శ రైతులు ఇక్కడి ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మంగవాళం ధర్నా చేశారు. దీనికి పలు పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు, ప్రభుత్వ అధికారులకు అనుసంధానం చేయడానికి వైఎస్ ఆదర్శ రైతుల వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు. ఆ తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు.
వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ నేత కె. కేశవరావు మాట్లాడుతూ.. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో అనుసరిస్తున్న విధానాలు బాగా ఉన్నాయని, ఆయన్ని రైతులు ఆదర్శంగా తీసుకోవాలని సూచిం చారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఆదర్శ రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరారు. ఈ ధర్నాలో ఎంపీ వివేక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విజయరామారావు, చిరుమర్తి లింగయ్య, సీపీఐ నేత రామకృష్ణ తదితరులు ప్రసంగించగా.. రైతు సంఘాల నేతలు పశ్య పద్మ, యాదవ్, కుమార స్వామి, ఎన్.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ రైతులను ఆదుకోవాలి: వైఎస్సార్ సీపీ
Published Wed, Jan 22 2014 3:13 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement