Ideal for farmers
-
ఉండేనా.. ఊడేనా?
ఆదర్శ రైతులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆరోగ్యమిత్రలు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు.. వీళ్లంతా గత ఏడాదిన్నర కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు. తాజాగా ఈ జాబితాలోకి మునిసిపాలిటీల్లో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న సిబ్బంది కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో 279 ఈ విషయాన్ని స్పష్టంచేస్తోంది. దీంతో పనులను ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తే తమ ఉద్యోగాలు ఉంటాయో.. పోతాయో అని కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు (అర్బన్): నగరాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యతను పూర్తిగా ప్రైవేటీకరించనున్నారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు రోడ్డునపడతారు. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో 1,200 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా పారిశుధ్య పనుల కాంట్రాక్టును దక్కించుకున్న వ్యక్తి కార్మికులను ఆయా మునిసిపల్ అధికారులకు అప్పగిస్తారు. కార్మికుల చేత పనులు చేయించునే బాధ్యత అధికారులపైనే ఉంటుంది. వీళ్లకు కావాల్సిన పనిముట్లు, బ్లీచింగ్ పౌడర్, సున్నం, ఫినాయిల్, యునిఫామ్, చేతి తొడుగులు, బూట్లు లాంటివి అధికారులే అందచేస్తారు. రోజుకు 8 గంటల పాటు కార్మికులు విధులు నిర్వర్తిస్తారు. ఇటీవల కార్మికులకు నెల వేతనం రూ.8,300 నుంచి రూ.11 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ జిల్లాలో ప్రస్తుతం అమలవుతున్న విధానం. ప్రైవేటీకరణ పద్ధతి ఇలా.. పాత పద్ధతి కాకుండా పారిశుధ్య నిర్వహణ బాధ్యత పూర్తిగా ప్రైవేటీకరిస్తారు. ప్రతి మునిసిపాలిటీ, కార్పొరేషన్లలో 200 నుంచి 300 కుటుంబాలకు ఇద్దరు పారిశుధ్య కార్మికుల్ని నియమిస్తారు. జన సాంద్రత ఎక్కువగా ప్రాంతాల్లో కాలువలను శుభ్రం చేయడానికి అవసరమయితే ముగ్గురు కార్మికుల్ని నియమిస్తారు. కార్మికులు, వాళ్లకు అవసరమైన పనిముట్ల సరఫరా కాంట్రాక్టర్ చూసుకుంటాడు. కార్మికులు పనిచేస్తున్నారా..? లేదా..? అని పరిశీలించడానికి మునిసిపల్ డీఈ, టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్, శానిటరీ సూపర్వైజర్, మేనేజరు సభ్యులుగా ఉన్న బృందం పర్యవేక్షిస్తుంది. ఇలా ప్రతి నెలా ఈ బృందం కార్మికులు పనిచేస్తున్నారని సర్టిఫికెట్ ఇస్తేనే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తారు. కార్మికుల పనులు సంతృప్తికరంగా లేకుంటే వేతనాలు ఇవ్వరు. పైగా వాళ్లను విధుల నుంచి తొలగించి కొత్త వాళ్లను సరఫరా చేసే బాధ్యత కాంట్రాక్టర్‌దే. పేరు మైక్రోప్యాకెట్ ఈ పనులు చేయడానికి ‘మైక్రోప్యాకెట్లు’ అనే పేరు పెట్టారు. ఒక్కో మైక్రో ప్యాకెట్లో పది మంది వరకు కాంట్రాక్టు కార్మికులు ఉంటారు. చెత్తను వీధుల్లోంచి తొలగించి డంపింగ్ యార్డుకు తరలించే వరకు అన్ని వీళ్లే చూసుకోవాలి. శాశ్వత కార్మికులు కేవలం ట్రాక్టర్లలో చెత్తను సేకరిస్తారు. ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంపై జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో సర్వే చేస్తున్నారు. ప్రతి వార్డు, డివిజన్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, అపార్టుమెంట్లు, కుటుంబాలు, పోగయ్యే చెత్త వివరాలను సేకరిస్తున్నారు. మార్చి 7వ తేదీలోపు కార్మికుల ప్రైవేటీకరణ టెండర్లు పూర్తిచేసి ఏప్రిల్ 1 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు. ఇదే జరిగితే ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఉన్న వాళ్లకు పనులు దొరక్కుండా ఇంటికి వెళ్లడం ఖాయం. మేమే దొరికామా? మా లాంటి వాళ్ల కడుపు కొట్టడానికి ఎలా మనసొస్తా ఉంది? ఉన్న ఉద్యోగాలు పర్మినెంట్ చేయమంటే తీసేస్తే ఎట్టా. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తా ఉండాం. సీఎం మా గోడు పట్టించుకుని జీవోను రద్దు సేయాలి. ప్రభుత్వం కన్ను మాపైనే పడిందా? తీసేయడానికి మేమే దొరికామా..! - లోకనాధం, కాంట్రాక్టు కార్మికుడు, చిత్తూరు అన్యాయం ప్రభుత్వం జారీచేసిన జీవో అన్యాయం. ఇలాగయితే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఏ పని దొరక్కుండా ఈ పనికి వస్తే దీన్ని కూడా లాగేసుకుని వెళ్లగొడితే ఎక్కడకు పోవాలి? ఏం పనిచేసి బతకాలి? - సుబ్బు, కాంట్రాక్టు కార్మికుడు, చిత్తూరు -
ఆదర్శ రైతులూ మీ వివరాలివ్వండి
హైదరాబాద్: ఏపీలో పనిచేస్తున్న ఆదర్శ రైతులు తమ వివరాలను ఆయా జిల్లాల నాయకులకు అందించాలని ఏపీ ఆదర్శ రైతుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేఖర్, ఏడుకొండలు కోరారు. సీఎం చంద్రబాబు.. ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేయడాన్ని నిరసిస్తూ హైకోర్టులో పిటిషన్ వేసినట్టు తెలిపారు. దీనిలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ఏపీలో మొత్తం ఎంత మంది ఆదర్శ రైతులున్నారనే విషయాన్ని కోర్టుకు చెప్పడానికి ఆదర్శ రైతులుగా ఉన్న వారంతా ప్రభుత్వం ద్వారా శిక్షణ పొందిన ఆదర్శ రైతు ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులను ఆయా జిల్లాల సంఘం నాయకులకు, లేదా రాష్ట్ర నాయకత్వానికి అందజేయాలన్నారు. వివరాలకు శేఖర్-96527 38915, ఏడుకొండలు- 96032 36302 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
పంటల బీమా అవకతవకలపై ముగిసిన విచారణ
సిద్దిపేట రూరల్ : రైతులు పంటల బీమా కోసం చెల్లించిన డబ్బులో కొంత మొత్తాన్ని ఆదర్శ రైతులు స్వాహా చేసినట్లు తేలింది. దీంతో సిద్దిపేట మండలం తోర్నాల గ్రామంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న పంటలబీమా అవకతవకల విచారణ బుధవారం తెరపడింది. రూరల్ ఎస్ఐ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద రైతుల సమక్షంలో విచారణ జరుపగా, గ్రామంలో 232 మంది రైతులు 43 హెక్టార్లకు చెల్లించిన బీమా డబ్బులో కొంత మొత్తాన్ని ఆదర్శ రైతులు సొంతానికి వాడుకున్నట్లు తేలింది. ఆదర్శ రైతులు పంటల బీమా పేరుతో చిన్న, సన్నకారు రైతుల నుంచి వసూలు చేసిన రూ.22,490, పెద్ద రైతుల నుంచి వసూలు చేసిన రూ. 3,200 వాడుకున్నట్లు విచారణలో తేలింది. ఈ సందర్భంగా ఏఈఓ హన్మంతారెడ్డి మాట్లాడుతూ, పంటల బీమా డబ్బుల అవకతవకలపై నాలుగు రోజులుగా విచారణ చేయగా, ఆదర్శరైతుల బండారం బయట పడిందన్నారు. గ్రామంలో 373 మంది రైతులు మొక్కజొన్న పంటకు బీమా చేయించుకోగా, ఆదర్శ రైతులు చిన్న, సన్నకారు రైతుల నుంచి రూ. 237, పెద్ద రైతుల నుంచి రూ. 263 చొప్పున వసూలు చేశారు. అయితే పంటల బీమా కోసం రైతులు చెల్లించిన డబ్బులను డీడీ తీయాల్సిన ఆదర్శరైతులు అవకతవకలకు పాల్పడ్డారు. రైతుల పొలం విస్తీర్ణాన్ని తక్కువగా చూసి బీమా డబ్బు చెల్లించారని ఏఈఓ తెలిపారు. ఈ అవకతవకలన్నీ బయటపడడంతో ఆదర్శ రైతులు తమ తప్పులు ఒప్పుకుని స్వాహా చేసిన సొమ్ము తిరిగి చెల్లిస్తామని ఒప్పుకున్నట్లు ఏఈఓ పేర్కొన్నారు. అంతకుముందు గ్రామ పంచాయతీ వద్ద జరిగిన విచారణలో సందర్భంగా గ్రామానికి చెందిన శీలం బాబు అనే వ్యక్తి గ్రామ ఎంపీటీసీ యొదుల్ల నర్సింలును బహిరంగంగా దూషించారని, దీంతోఎంపీటీసీ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరమేశ్వర్‌గౌడ్ ఉన్నారు. -
ఆదర్శరైతుల తొలగింపు?
మహబూబ్‌నగర్ వ్యవసాయం: ప్రభుత్వం రాష్ట్రంలోని ఆదర్శరైతులను తొలగించేందుకు పూనుకున్నట్లు ప్రచారం ఊపందుకోవడంతో ఆదర్శరైతుల్లో మళ్లీ కలవరం మొదలైంది. వీరి తొ లగింపునకు సంబంధించిన ఉత్తర్వులు మరో రెండుమూడు రోజుల్లో వెలువడనున్నట్లు తెలియడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలాఉండగా, నెలరోజుల క్రితం తొలగింపు ఊహాగానాలు ఊపందుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదర్శరైతులు మూకుమ్మడిగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని పొంది ఆందోళన విరమించారు. మరోసారి వారు ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ఉన్న ఆదర్శరైతులు నేడు(సోమవారం)ఏడీఏ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టాలని పూనుకున్నారు. ఇలా జిల్లాలో పనిచేస్తున్న 2747 మంది ఆదర్శరైతులు పరిస్థితి సంకటస్థితిలోకి వెళ్లింది. 2007లో నియమితులైన వీరికి ప్రభుత్వం నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవవేతనం ఇస్తోంది. ఇలా నెలకు రూ.27.47లక్షల చొప్పున ఏడాదికి రూ.3.29కోట్లు చెల్లిస్తోంది. ఇదిలాఉండగా, ఏడాది నుంచి తమకు వేతనం ఆదర్శరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆద ర్శ రైతులను కక్షపూరితంగా తొలగింపునకు పూనుకుంటోంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం నుండి ఏడీఏ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టాలని నిర్ణయించాం. అలాగే 25న ‘చలో హైదారాబాద్’కు పిలుపునిచ్చారు.’ అని ఆదర్శరైతు సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం స్పందనను బట్టి ఆందోళనను ఉధృతం చేస్తామని వెల్లడించారు. -
ఆదర్శానికి మంగళం
జిల్లాలో 1,911 మంది ఆదర్శ రైతులు తొలగింపు ఎంపీఈవోల నియూమకానికి నిర్ణయం తొలగించినవారికే ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ పోరుకు సిద్ధమవుతున్న బాధితులు ఆదర్శరైతుల వ్యవస్థ అనవసరమైందని, దాన్ని తొలగిస్తామని తొలి కేబినెట్ భేటీలో ప్రకటించిన చంద్రబాబు... తాను అన్నట్లుగానే ఆదర్శరైతుల వ్యవస్థను తొలగించారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌చంద్ర పునేటా జీవో ఎంఎస్ 43 జారీ చేశారు. ఈ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా 1,911 మంది ఆదర్శ రైతులు గౌరవం కోల్పోనున్నారు. సాక్షి, చిత్తూరు :వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దేందుకు దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి 2007లో ఆదర్శరైతుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. 2007, 2008లో రెండు విడతలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 50వేల మందిని నియమించారు. ఇందులో నవ్యాంధ్రకు సంబంధించి 29,439మంది ఉన్నారు. రాయలసీమలో 7,120 మంది ఆదర్శ రైతులను నియమించారు. ఔట్సోర్సింగ్ ద్వారా నియమితులైన వీరికి ప్రతి నెలా వెయ్యి రూపాయల గౌరవవేతనం ఇచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా గ్రామస్థాయిలో వ్యవసాయం మరింత బలోపేతమయింది. గ్రామాల్లో విత్తనాలు, ఎరువులు ఎప్పుడు పంపిణీ చేస్తారు? ఏ తెగులుకు ఏ మందు వాడితే బాగుం టుంది ? తదితర సూచలను ఆదర్శరైతులు చేసేవారు. అయితే ఆదర్శరైతుల వ్యవస్థ కాలక్రమేణా గాడితప్పింది. కొందరు వ్యవసాయరంగంలో రైతులకు సూచనలు ఇవ్వడం కంటే రాజకీయనేతలుగా చెలామణి అయ్యారు. దీంతో వీరికి చెక్‌పెట్టేందుకు 2012 జూన్‌లో వ్యవసాయశాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను గత ఏడాది ప్రకటిం చారు. పరీక్షల్లో ఫెయిల్ అయినవారిని తొలగించి ఆ స్థానంలో కొత్తవారిని నియమించారు. అప్పటి నుంచి ఆదర్శరైతులు సక్రమంగానే పనిచేస్తున్నారు. రైతులకు ఉపయుక్తంగా ఉంది. అయితే ఆదర్శరైతులంతా కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్తలనే అపోహతో, టీడీపీ ప్రభుత్వం ఆ వ్యవస్థనే రద్దు చేసింది. ఈ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదని, అందుకే తొలగించామని సెలవిచ్చింది. ఎంపీఈవో పేరుతో కొత్త వ్యవస్థ : ఆదర్శరైతుల వ్యవస్థ స్థానంలో ఎంపీఈవో(మల్టీ పర్పస్ ఎగ్జిక్యూటిక్ ఆఫీసర్) పేరుతో మరో వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం తొలగించిన ఆదర్శ రైతులను కాకుండా, కొత్తవారిని ఎంపీఈవోలుగా నియమించనున్నారు. టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారిని ఆ స్థానంలో తీసుకోనున్నారు. దీనిపై ఆదర్శరైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వ్యవస్థలో లోపాలుంటే సరిదిద్దాలని, పూర్తిగా వ్యవస్థనే రద్దు చేయడం సరికాదని చెబుతున్నారు. ఆదర్శరైతుల స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టే ఏ వ్యవస్థ అయినా తొలి ప్రాధాన్యం ఉద్యోగాలు కోల్పోయినవారికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు వెయ్యి రూపాయల జీతానికే ఇన్నేళ్లుగా పనిచేశాం. మమ్మల్ని నియమించింది రాజకీయపార్టీ కాదు...రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం నియమించిన ఉద్యోగులను ఇలా తొలగిస్తూ పోవడం సరైంది కాదు. టీడీపీ కార్యకర్తలను కొత్తగా నియమించుకోవడం కోసమే ఇలా చేశారు. కొత్తగా ప్రవేశపెట్టే ఏ వ్యవస్థలోనైనా మొదటి ప్రాధాన్యం మాకే ఇవ్వాలి. దీనిపై సోమవారం నుంచి కలెక్టరేట్ వద్ద నిరంతర ఆందోళన చేస్తాం. - నలగం శేఖర్, ఆదర్శరైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. -
ఆదర్శ రైతులకు ఉద్వాసన!
చేవెళ్ల: ఆదర్శ రైతుల వ్యవస్థకు తెరపడనుందా.. ప్రభుత్వం వారి సేవలకు ఇక మంగళం పాడనుందా..? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాలే వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో రైతులకు పంటల సాగులో అన్ని విధాలా అండగా ఉండి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఏడేళ్ల క్రితం ఏర్పాటుచేసిన ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన చర్యలను శరవేగంగా జరుపుతున్న తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజనలో భాగంగా 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కావడం, కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, పాలనాపరంగా ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఆదర్శ రైతుల వ్యవస్థను కూడా రద్దుచేయాలని నిర్ణయానికి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఓ అధికారిక కార్యక్రమంలో చేసిన విస్పష్ట ప్రకటన ఈ విషయాన్ని మరింత బలపరుస్తోంది. మరో అడుగు ముందుకేసి క్షేత్రస్థాయిలో ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీకి అర్హులైన లబ్ధిదారుల జాబితాలను సిద్ధంచేయండి, భవిష్యత్‌లో ఆదర్శరైలుండరంటూ ప్రకటించారు. ఈ వ్యవస్థ రద్దుకు ఆ శాఖ మంత్రి ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి రాగానే ఫైలుపై సంతకం చేస్తారని సమాచారం. రైతులకు చేదోడువాదోడుగా ఉంటారని.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఆదర్శరైతుల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం వీరికి నెలకు వేయి రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించి అమలు చేశారు. జిల్లాలో సుమారు వేయిమందికిపైగా ఆదర్శ రైతులున్నారు. ఈ వ్యవస్థ ప్రదాన ఉద్దేశమేమిటంటే.. రైతులకు పంటసాగులో సూచనలు, సలహాలు ఇవ్వడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అతివృష్టి, అనావృష్టి సమయంలో పంటలకు నష్టం వాటిల్లినట్లైతే పరిహారాన్ని అంచనా వేయడంలో అధికారులకు సహకారం అందించాలి. పంటల సస్యరక్షణ చర్యల్లో రైతులకు అవగాహన కల్పించడం, ప్రభుత్వం ఇస్తున్న పలు పథకాల సబ్సిడీలను తెలియజేయడం, ఆధునిక యంత్ర పరికరాలను పరిచయం చేసి వాటి ద్వారా సాగులో మార్పులు తీసుకురావడం తదితర కార్యక్రమాలను ఆదర్శ రైతులను చేయాలని నిర్ణయించారు. ఒక మాటలో చెప్పాలంటే వ్యవసాయశాఖకు, రైతులకు మధ్య వారధిగా పనిచేయాలని అప్పట్లో వైఎస్సార్ ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16వేల 820 మంది ఆదర్శ రైతులకు ఉద్వాసన పలికితే ఏటా సుమారు రూ. 20కోట్ల 18 లక్షల ప్రజాధనం ప్రభుత్వానికి ఆదా కానుందని అధికారులు అంచనా. ఆదిలో బాగానే ఉన్నా.. ఆదర్శరైతుల వ్యవస్థ ఆదిలో బాగానే ఉన్నా వైఎస్సార్ మరణానంతరం పక్కదోవ పట్టింది. ఆదర్శరైతులు క్షేత్రస్థాయిలో జవాబుదారీగా పనిచేయకపోవడం, రాజకీయ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలను, గ్రామాలలో నివాసం ఉండనివారిని నియమించడం, వ్యవసాయంలో అనుభవం లేనివారిని తీసుకోవడం, సస్యరక్షణ చర్యలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన లేనివారిని, ప్రజాప్రతినిధులను తీసుకోవడంతో వ్యవస్థ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. పైగా పంటనష్టం జరిగిన సమయాల్లో తప్పుడు నివేదికలిచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఈ వ్యవస్థ రద్దు చేసేందుకే ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. -
టార్గెట్.. 4040
సాక్షి ప్రతినిధి, కర్నూలు : రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ అక్రమాలకు తెరలేపింది. తమ పనులు చక్కబెట్టుకోవడానికి టీడీపీ నేతలు అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జిల్లాలో ఆదర్శ రైతులుగా, రేషన్ షాపుల డీలర్లుగా, ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా తమ వారిని నియమించుకోవడానికి అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. తమ మాట వినకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని తమ్ముళ్లు బెదిరిస్తున్నారు. జిల్లాలో ప్రజలు అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. జిల్లాలో ఎలాంటి ఆరోపణలు లేకున్నా.. ఆదర్శ రైతులు, రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీదారులను టార్గెట్ చేస్తున్నారు. ఎంతమంది ఆదర్శ రైతులు, రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్నం భోజనం ఏజెన్సీదారులు ఉన్నారోనని వివరాలు సేకరించారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదర్శ రైతుల వ్యవస్థను తీసుకొచ్చారు. వ్యవసాయంపై అనుభవం ఉన్న వారిని ఔట్సోర్సింగ్ ద్వారా ఆదర్శ రైతులుగా నియమించారు. వారి ద్వారా పల్లెల్లో వ్యవసాయ పద్ధతుల గురించి ఎప్పటికప్పుడు వివరించి రైతులకు మేలు జరిగేలా చేశారు. అందుకు వారికి నెలనెలా గౌరవ వేతనం కూడా ఇచ్చారు. అయితే వైఎస్ మరణం తరువాత ఆ వ్యవ స్థను నీరుగార్చారు. ఆ తర్వాతి ముఖ్యమంత్రుల కాలంలో తమకు అనుకూలంగా ఉన్న వారిని, పార్టీ కోసం పనిచేసే వారిని ఆదర్శ రైతులుగా నియమించారు. అదే దారిలో ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా అడుగులేస్తున్నారు. మొదటి నుంచి అక్కసుతో ఉన్న చంద్రబాబు అధికారం చేపట్టగానే ఆదర్శ రైతులను టార్గెట్ చేశారు. ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో ప్రకటించినా.. ఆ డ్రామా అంతా తెలుగు తమ్ముళ్ల కోసమేనని ఆ పార్టీ శ్రేణులే అంగీకరిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1629 మంది ఆదర్శ రైతులు ఉన్నారు. వీరు 2006 నుంచి కొనసాగుతున్నా.. వీరిని తొలగించి వారి స్థానంలో తమ అనుచరులను నియమించేందుకు టీడీపీ నేతలు జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. రేషన్ షాపులపై తమ్ముళ్ల గురి ఇక జిల్లాలోని రేషన్ షాపులపైనా దేశం నేతలు కన్నేశారు. జిల్లాలో 2411 రేషన్ షాపులు ఉన్నాయి. ఇందులో 187 దుకాణాలు ఇన్చార్జ్ డీలర్ల ద్వారా నడుస్తున్నాయి. వీటిని తెలుగు తమ్ముళ్లు దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇన్చార్జ్ డీలర్ల స్థానంలో ఇప్పటికే టీడీపీ కార్యకర్తలను నియమించేందుకు రంగం సిద్ధం చేశారు. మిగిలిన వాటినీ తమ వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రెగ్యులర్ డీలర్ ఉన్న షాపులపై టీడీపీ కార్యకర్తలు లేదా వారి అనుచరుల ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయిస్తున్నారు. తనిఖీ నిర్వహించేలా ఒత్తిడి చేసి ఆ డీలర్‌ను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారు. కోడుమూరు, డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు, బనగానపల్లె ప్రాంతాల పరిధిలో ఇలాంటి అరాచకాలకు తెరతీసినట్లు తెలిసింది. అంతేకాకుండా నెలనెలా తమకు మామూళ్ల రూపంలో బియ్యం, చక్కెర వంటి నిత్యావసర వస్తువులను ఇంటికి పంపాలని డీలర్లపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వినకపోతే ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు డోన్ నియోజకవర్గ పరిధిలోని ఓ డీలర్ ‘సాక్షి’ వద్ద కన్నీరుపెట్టారు. అదే విధంగా గోదాముల నిర్వాహకులను తమ్ముళ్లు వదలడం లేదు. నెలనెలా 200 బియ్యం బస్తాలు ఇంటికి పంపాలని టీడీపీ నాయకుడొకరు గోదాము నిర్వాహకుడిపై దౌర్జన్యం చేసినట్లు తెలిసింది. భయపడిన ఆ నిర్వాహకుడు ఇటీవల జిల్లా ఎస్పీని కలిసి పిర్యాదు చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి టీడీపీ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసి తమలాంటి వారికి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కాగా.. కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకురాలిని తొలగించకున్నా.. టీడీపీకి చెందిన ఓ మహిళ ఏకంగా భోజనాన్ని వండి తెచ్చి, విద్యార్థులకు వడ్డించడానికి యత్నించడం వారి ఆగడాలకు పరాకాష్టగా భావించాల్సి వస్తుంది. -
ఉద్యోగాల కోతే బాబు విజన్
‘ఇంటికో ఉద్యోగం’... ‘నిరుద్యోగులకు నెలకు 2వేల భృతి’... ‘జాబు కావాలంటే బాబు రావాలి’... మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 35 వేల ఉద్యోగాలు పీకేసే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. 20 వేల మంది ఆదర్శరైతులు, 15 వేల మంది ఉపాధి హామీ క్షేత్రస్థాయి సహాయకులను ఇంటికి సాగనంపుతూ జీవో కూడా ఇచ్చేశారు. వెయ్యి రూపాయల గౌరవవేతనంతో పనిచేస్తున్న దిగువసామాజికవర్గాలకు చెందినవారిని ఒక్క కలం పోటుతో అలా తొలగించేయడం బాబుకే చెల్లింది. ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఏటా 1.9 శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచ బ్యాంకుతో గతంలో చంద్రబాబు ఏకంగా ఓ ఒప్పందమే కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం (ఏపీఈఆర్పీ) ప్రారంభించారు. ఉద్యోగుల తొలగింపు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నినాదాలు ఇవి. యువతను ప్రలోభపెట్టడానికి చంద్రబాబు చేయని ప్రచారం లేదు. ఇవ్వని వాగ్దానం లేదు. అయితే ఫలితాలు వచ్చి నెల గడవక ముందే బాబుగారి అసలు స్వరూపం బట్టబయల య్యింది. కొత్తగా ఉద్యోగాలివ్వడం మాట అటుంచి ఉన్న ఉద్యోగాలకే ఆయన ఎసరు పెట్టారు. వివిధ సంస్థలలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తీసే స్తున్నారు. ఉద్యోగాలు తీసేయడం, పనిచేసే సంస్థలను మూసేయడంలో బాబుగారు బహునేర్పరి. ఆయనగారి గత చరిత్రంతా ఈ తీసివేతలు... మూసివేతలే... గతంలో అధికారంలో ఉండగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన చంద్రబాబు వాటిలోని వేలాదిమంది ఉద్యోగుల ఉపాధికి దెబ్బకొట్టారు. అంతేకాదు ప్రపంచ బ్యాంకుతో ఓ ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం ప్రారంభించారు. దశలవారీగా ప్రభుత్వరంగ సంస్థలను మూసేయడం, ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం ఆ పథకం ఉద్దేశం. అందుకోసం జీవో నంబర్ 58ని కూడా ఆయన జారీ చేశారు. ఆయన విజన్ ఉద్యోగుల తొలగింపే. 2020 నాటికి లక్ష మంది ఉద్యోగులను తొలగిస్తానని ప్రపంచబ్యాంకుకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మన బాబుగారు. ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు అనేక వాగ్దానాలు చేశారు. అందులో అత్యంత కీలకమైనది ‘ఇంటికో ఉద్యోగం’. రాష్ట్రంలో 3.5 కోట్ల ఇళ్లున్నాయి. ఇంటికో ఉద్యోగమంటే మాటలా.. అన్ని ఉద్యోగాలు ఇస్తున్నారా...? బాధ్యతగలిగిన నాయకులు ఏదైనా మాట్లాడుతున్నారంటే చిత్తశుద్ధి ఉండనక్కరలేదా? సాధ్యాసాధ్యాలను చూడనక్కరలేదా? బాబుగారు అన్నీ చూసుకునే ప్రజల కోసం ఆ హామీలిచ్చారని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. అయితే మరి ఇప్పుడు నెల గడచిపోయినా బాబుగారు తన హామీలపై నోరు ఎందుకు మెదపడం లేదు? ఏ హామీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఎందుకు చెప్పడం లేదు? వ్యవసాయ రుణాల మాఫీపై ఓ కమిటీ వేసి చేతులు దులుపుకున్న చందానే మిగిలిన హామీలనూ అటకెక్కించేస్తారా? నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న సందేహాలివి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగానూ చంద్రబాబు మాటలు సమస్యను పక్కదోవ పట్టించేలానే ఉన్నాయి. ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలే కానక్కరలేదని, ప్రైవేటు ఉద్యోగాలు కూడానని ఆయన అంటున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ తదితరాలన్నింటినీ కలిపినా కూడా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వోద్యోగాలు 13 లక్షలు. భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు, ఐటీ, సేవారంగం తదితరాల్లోని మొత్తం ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య 35 లక్షలు దాటదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య 50 లక్షల లోపే. అలాంటిది మరో 3 కోట్ల ఉద్యోగాలను ఎలా సృష్టిస్తారు? దానికేమైనా ప్రణాళిక బాబు వద్ద సిద్ధంగా ఉందా? అందుకోసం ఆయన ఏం చేయబోతున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఉద్యోగాలపై స్పష్టత ఏది? గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ‘ఇంటికో ఉద్యోగం’ హామీపై ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. దానిపై స్పష్టత ఏదని ప్రశ్నించారు. జాబు కావాలంటే బాబురావాలంటూ ఎన్నికలకుముందు టీవీల్లో పదేపదే ప్రకటనలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. అసలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారా లేదా.. అందుకోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు... అని ప్రశ్నించారు. వీటికి అధికారపక్షం నుంచి అసలు సమాధానమే లేదు. అత్యంత కీలకమైన ఈ అంశంపై శాసన సభలో జరిగిన చర్చ ఎందుకనో మీడియాలో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు కొత్త ప్రభుత్వం తీరు చూసి నిట్టూరుస్తున్నారు. అసలు ఉద్యోగం వస్తుందా...? వచ్చే వరకూ నిరుద్యోగ భృతి ఇస్తారా..? ఇవి జవాబు దొరకని మిలియన్ డాలర్ల ప్రశ్నలే. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీలను చూసి యువత ఎంతో కొంత ఆశపడబట్టే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు. పదవినధిష్టించిన తర్వాత మరి ఆ యువతకు ఆయనిచ్చే భరోసా ఏమిటి? ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిపై ఇప్పటికీ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? 3.5 కోట్ల మందికి ఉద్యోగాలెప్పుడు ఇస్తారు... ఈ లోగా ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు..? వంటి విషయాలపై చంద్రబాబుకు ఎలాంటి క్లారిటీ లేదు. కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాలను వెల్లడించే గవర్నర్ ప్రసంగంలోనూ నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి ప్రణాళికా లేదు. నిరుద్యోగ సమస్యకు బాబు ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వడం లేదని దీన్ని బట్టి అర్థమౌతుంది. ఇవ్వడం అటుంచి.. ఉన్నవి హుష్‌కాకి.. వర్తమానానికి వస్తే... ఇంటికో ఉద్యోగం మాట దేవుడెరుగు... ఉన్న ఉద్యోగాలు పీకేసే పని బాబుగారు మొదలుపెట్టారు. మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 35 వేల ఉద్యోగాలు పీకేసే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. 20 వేల మంది ఆదర్శరైతులు, 15 వేల మంది ఉపాధి హామీ క్షేత్రస్థాయి సహాయకులను ఇంటికి సాగనంపుతూ జీవో కూడా ఇచ్చేశారు. పదేళ్ల నుంచి వెయ్యి రూపాయల గౌరవవేతనంతో పనిచేస్తున్న దిగువ సామాజికవర్గాలకు చెందినవారిని ఒక్క కలం పోటుతో అలా తొలగించేయడం చంద్రబాబుకే చెల్లింది. వీరే కాదు గృహ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న 3,600 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా బాబు ఉద్వాసన పలికారు. 15 వేల రూపాయలలోపు గౌరవవేతనంతో పనిచేస్తున్న ఈ ఉద్యోగుల కుటుంబాలన్నీ ఇప్పుడు వీధిన పడ్డాయి. ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో 4 వేల మంది, జలయజ్ఞం భూసేకరణలో 7 వేల మంది ఉద్యోగులను త్వరలోనే ఇంటికి పంపించనున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే తమ ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని భావించామని, ఇలా తమ పొట్టకొడతారని ఊహించలేదని ఆ ఉద్యోగులు వాపోతున్నారు. ఒక్క గృహనిర్మాణ సంస్థే కాదు.... అన్ని సంస్థలలోని తాత్కాలిక, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కొత్త ప్రభుత్వం తొలగిస్తోంది. బాబు రాకతో జాబు పోక అన్నట్లయిందని ఉద్యోగులు బాధపడుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ పదవుల్లోని వారు రాజీనామాలు చేయడం మామూలే. కానీ పొట్టచేతబట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటున్న చిరు వేతన జీవులను రాజకీయ కోణంలో చూడడం, వారి ఉపాధిని దెబ్బకొట్టడం సబబేనా? గత ప్రభుత్వంలో ఉద్యోగాలలో చేరిన వారిని ఇపుడు తొలగించేయడం ఏ తరహా రాజకీయం? తొలగింపులు, మూసివేతలే బాబుగారి ట్రాక్ రికార్డు ఉద్యోగులను తొలగించడం, ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడంలో బాబుగారిది అందెవేసిన చేయి. గతంలో ఆయన పాలనలో అమలైన ప్రపంచబ్యాంకు ఆర్థిక సంస్కరణలకు బలైంది ఉద్యోగులే. ఆయన తొమ్మిదేళ్ల పాలనంతా ఉద్యోగుల ఉసురుపోసుకుంటూనే సాగింది. ఉన్న ఉద్యోగాలను తొలగించడమే పనిగా పెట్టుకునే చంద్రబాబు కొత్త ఉద్యోగాలిస్తానంటే నమ్మొ చ్చా...? ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఏటా 1.9శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచబ్యాంకుతో చంద్రబాబు ఏకంగా ఓ ఒప్పందమే కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం (ఏపీఈఆర్పీ) ప్రారంభించారు. ఉద్యోగుల తొలగింపు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఆ తర్వాత ఉద్యోగుల కుదింపునకు సంబంధించి ఉత్తర్వులు (జీవో 58) కూడా చంద్రబాబు జారీ చేశారు. దాని ప్రకారం 1998లో 747, 1999లో 1,683, 2000లో 3,439, 2001లో 1,382 మందిని తొలగించారని గణాంకాలు చెబుతున్నాయి. అలా లక్షమంది ఉద్యోగులను తొలగిస్తానని ప్రపంచబ్యాంకు ముందు చంద్రబాబు తన విజన్ 2020 ని ఆవిష్కరించారు. బాబు అనేక ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను కారుచౌకగా అమ్మేశారు. పలు సంస్థలను మూసేశారు. రాష్ట్రంలో 127 ప్రభుత్వ, సహకార రంగ సంస్థలు ఉన్నాయి. వాటిలో చంద్రబాబు 14 మూసేశారు. 11 సంస్థలను అమ్మేశారు. మరో పదిసంస్థలను అమ్మడానికి రంగం సిద్ధం చేశారు. ఈ సంస్థలలోని 21 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ఏపీఈఆర్పీ కింద తొలిదశలో నంద్యాల, రాజమండ్రి, నెల్లూరు, ఆదిలాబాద్ స్పిన్నింగ్ మిల్లులతో పాటు నిజాం షుగర్స్, ఆల్విన్ వాచ్ కంపెనీలను మూసేశారు. రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ, మధునగర్ షుగర్ మిల్లు, లచ్చయ్యపేట షుగర్ మిల్లు, మెంబోజిపల్లి డిస్టిలరీ, చాగల్లు డిస్టిలరీ ఆస్తులను కారుచౌకగా అమ్మేశారు. రెండో దశలో ఆర్టీసీ, సింగరేణి కాలరీస్‌తో పాటు బెవరేజ్, టెక్స్టైల్స్, కోళ్లు -మాంసం అభివృద్ధి కార్పొరేషన్లు, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, వికలాంగుల సంస్థల్లోని ఉద్యోగులనూ తొలగించాలనుకున్నారు. 2004 ఎన్నికల్లో బాబు ఓటమితో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎకనమిక్ సర్వే చెబుతున్న నిజాలు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషియో ఎకనమిక్స్ సర్వే 2012-2013 ప్రకారం... - 2000 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రెండు రంగాల్లో.. అంటే పబ్లిక్ , ప్రైవేట్ రంగాలు రెండింటిలో కలిపి ఉద్యోగుల సంఖ్య 20,71,642. 2004 మార్చి నాటికి మొత్తంగా ఉద్యోగులు లేదా ఉద్యోగాల సంఖ్య 20,11,645. అంటే కేవలం నాలుగేళ్లలోనే చంద్రబాబు హయాంలో తగ్గిన ఉద్యోగాలు దాదాపు 60,000. - వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన చివరి సంవత్సరం 2009 మార్చి నాటికి ఈ సంఖ్య 20,82,800. అంటే వైఎస్ పాలనలో 71,155 ఉద్యోగాలు పెరిగాయి. - ప్రైవేటు రంగాన్ని తీసుకున్నా 2000 మార్చి నాటికి 5,68,362 ఉద్యోగాలు ఉం టే అది 2004 మార్చి నాటికి 5,67,666. అంటే బాబు పాలన చివరి నాలుగేళ్లు తీసుకున్నా ప్రైవేటు ఉద్యోగాలు పెరగకపోగా 696 తగ్గాయి. 2009 మార్చి నాటికి ప్రైవేటు ఉద్యోగాలు 7,24,916. అంటే 1,59,250 ఉద్యోగాలు పెరిగాయి. బాబు జమానాలో తగ్గిన ఉద్యోగాలు చంద్రబాబు అమ్మేసిన ప్రభుత్వరంగ, సహకార సంస్థలివే.. * ఆల్విన్ సనత్‌నగర్ భూములు * రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ * నిజాం షుగర్స్ (నాలుగు యూనిట్లు) * మధునగర్ షుగర్ మిల్లు * లచ్చయ్యపేట షుగర్ మిల్లు * మొంబోజిపల్లి డిస్టిలరీ * చాగల్లు డిస్టిలరీ * హనుమాన్ జంక్షన్ షుగర్స్ * నంద్యాల షుగర్స్ * పాలకొల్లు షుగర్స్ * గురజాల షుగర్స్ * ఇంకొల్లు నూలు మిల్లు * ఆదిలాబాద్ నూలు మిల్లు * నెల్లూరు నూలు మిల్లు * యడ్లపాడు నూలు మిల్లు మభ్యపెట్టడం వెన్నతోపెట్టిన విద్య ఏరుదాటేందుకు ఎన్నో చెబుతాం అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఎట్టా అని వెనకటికెవడో అన్నాట్ట. బాబుగారిది అచ్చు ఇలాంటి పాలసీనే. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీనీ ఆయన అంతగా గుర్తుపెట్టుకోరు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేయాల్సి వచ్చినా వాటికి ఎలాగోలా తూట్లు పొడిచేస్తారు. అదీ ఆయన ట్రాక్ రికార్డు. మద్యనిషేధం ఎత్తివేత, కిలో 2 రూపాయల బియ్యం ధర రూ.5.25కు పెంపు వంటివి ఇందుకు నిదర్శనం. ఇప్పుడు కూడా రైతు రుణాల మాఫీ గురించి అన్నివైపులా ఒత్తిడి పెరగడంతో ఓ కమిటీ వేసేశారు. నిజానికి రుణమాఫీ ఆచరణ సాధ్యమేనా అని ఎన్నికల సంఘం చంద్రబాబును వివరణ అడిగితేనే నిక్కినీలిగీ చివరికి ఏదో సమాధానమిచ్చారు. అందులో చెప్పిన విధంగానే రుణమాఫీని అమలుచేసేయొచ్చు కదా? మరలా అధ్య యనానికి ఓ కమిటీ ఎందుకు? అంటే అసలు ఏమీ అధ్యయనం చేయకుండానే వెనకా ముందూ చూసుకోకుండానే హామీ ఇచ్చేశారు? మేనిఫెస్టోలో పెడుతున్నామంటే దాని సాధ్యాసాధ్యాలను ముందుగా బేరీజు వేసుకోనక్కరలేదా? ఇప్పుడు కొత్తగా కమిటీ ఏమిటి? ఇది కాలయాపన కోసం కాదా? ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పాత రుణాలు కడితే గానీ కొత్తగా రుణాలిచ్చేది లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. పైగా పాతరుణాలు కట్టాలని నోటీ సులు కూడా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను గందరగోళంలో ముంచి కమిటీలతో కాలయాపన చేయడం సబబేనా? ఇంటికో ఉద్యోగం విషయంలోనూ బాబు ఇలాంటి గందరగోళాన్నే సృష్టించాలని చూస్తున్నారు. ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యో గమే కానక్కరలేదు ప్రైవేటు ఉద్యోగమైనా ఉద్యోగమేనని ఆయన అంటున్నారు. అలాగే ఉద్యోగమంటే ఉద్యోగమే మేమే ఇవ్వనక్కరలేదు.. ఎవరిచ్చినామేమిచ్చినట్టేనంటూ రాష్ట్రంలో ఎక్కడ ఏ కొట్టులో ఎవరికి ఏ గుమస్తా ఉద్యోగమొచ్చినా ఆయన ఖాతాలోనే వేసుకుంటారేమో..! - పోతుకూరు శ్రీనివాసరావు -
ఇదేనా కొత్త ప్రభుత్వం ‘ఆదర్శ’
మమ్మల్ని నడిరోడ్డు పాలు చేస్తారా? జిల్లా ఆదర్శ రైతుల సంఘం కార్యదర్శి కామేశ్వరరావు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదర్శ రైతుల ర్యాలీ చింతపల్లి రూరల్ : దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులను ఆదర్శ రైతులుగా నియమించి బతుకు మార్గం చూపిస్తే టీడీపీ ప్రభుత్వం తమ కుటుంబాలను నడి రోడ్డున పడేయాలని చూస్తోందని జిల్లా ఆదర్శ రైతుల సంఘం కార్యదర్శి ఉగ్రంగి వెంకట కామేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలో ఆదర్శ రైతులతో పాతబస్టాండ్ జంక్షన్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2007లో 1269 జీఓ విడుదల చేసి తమను ఆదర్శ రైతులుగా నియమించారన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి రైతులకు మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తూ ప్రతి పంచాయతీలో 300 కుటుంబాలకు వ్యవసాయపరంగా పరిజ్ఞానం అందించే దృక్పథంతో తమకు నెలకు రూ.1000 వేతనం చెల్లిస్తూ సేవలు పొందారన్నారు. గత ప్రభుత్వంలో 18 శాఖలను అనుసంధానం చేసి నెలకు రూ.3 వేలు వేతనాన్ని కూడా కల్పిస్తామని నిర్ణయం తీసుకున్నామన్నారు. కనీసం ఈ ప్రభుత్వం ద్వారా కూడా ఉన్నటువంటి తమకు ఉద్యోగ భద్రతతోపాటు వేతనాలు పెంచాలని ఎంతో ఆశతో ఉన్నామన్నారు. ఉన్న వేతనాలు పెంచకపోగా పూర్తి గా తమను నడిరోడ్డుపై విసిరేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం జిల్లాలోని 1500 మంది ఆదర్శరైతు కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయం తో వీధుల్లోకి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన ఈ ప్రభుత్వం కనీస వేతనాలతో విధులు నిర్వహిస్తున్న మాలాంటి ఆదర్శ రైతులను తొలగించాలని నిర్ణ యం తీసుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇకనైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అనంతరం స్థానిక తహశీల్దార్ అంబేద్కర్ వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో 17 పం చాయతీలకు చెందిన ఆదర్శ రైతులు పాల్గొన్నారు. -
అధికారుల ‘చైతన్య’లేమి
నిజమే.. ప్రస్తుతం రైతులకు సలహాలు ఇచ్చేవారు కానరాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో వ్యవసాయాధికారుల కోసం పడిగాపులు కాస్తున్నారు. సాధారణంగా ఈ సీజన్లో వ్యవసాయ పరంగా వస్తున్న మార్పులు, పంటలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి అంశాలపై అవగాహన కోసం రైతు చైతన్య యాత్రలు నిర్వహిస్తారు. రాచర్ల మండల పరిధిలోని ఆకవీడు, అనుమలవీడు, రాచర్ల, సోమిదేవిపల్లె, గుడిమెట్ట కొత్తపల్లి, జేపీ చెరువు, చినగానిపల్లె, చోళ్లవీడు, రామాపురం వంటి 14 పంచాయతీల్లో అధిక శాతం సాగు బోర్లపైనే చేస్తుంటారు. ఇక్కడ వ్యవసాయాధికారులతో పాటు, ఉద్యాన, పట్టుపరిశ్రమ, పశు సంవర్థక శాఖలకు చెందిన అధికారులు ఆయా గ్రామాల్లోని రైతులకు పంట ఎంపిక, బలం మందులు, కలుపు తీత, అధిక దిగుబడి, సస్యరక్షణ చర్యలు, పంట తీత వంటి అంశాలపై సవివరంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టింది. వరుస ఎన్నికల ప్రభావం సుప్రీం కోర్టు అక్షింతలతో ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం హడావుడిగా ఎన్నికల నగారా మోగించింది. దీనిలో భాగంగా మొదట పంచాయతీ ఎన్నికల్లో వ్యవ సాయాధికారులు కూడా పాల్గొనాల్సి వచ్చింది. ఆ త ర్వాత ప్రాదేశిక ఎన్నికలు.. బుధవారం సార్వత్రిక ఎన్నికల విధుల్లో కూడా పొల్గొన్నారు. ఇలా వరుసగా అదనపు విధులు నిర్వర్తించాల్సి రావడంతో రైతుల గురించి పట్టించుకొనేవారు కనపడకుండా పోయారు. తత్ఫలితంగా వారికి అమూల్యమైన సలహాలు అందించే అవకాశం లేకుండా పోయింది. అదర్శరైతులెక్కడున్నారో.. ఆదర్శ రైతుల తీరు మరీ శోచనీయంగా మారింది. వ్యవసాయాధికారులు లేకున్నా.. అన్నదాతలకు అందుబాటులో ఉంటూ సలహాలివ్వాల్సిన ఆదర్శ రైతులు కూడా ముఖం చాటేస్తున్నారు. కనీసం వారి సంఖ్య కూడా ఎవరికీ అంతుబట్టడంలేదు. -
విద్యార్హత ఆధారంగా ఏఈఓలుగా నియమించాలి
వరంగల్అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ఆదర్శ రైతులుగా పనిచేస్తున్న వారి విద్యార్హతలను బట్టి వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ) లుగా ప్రభుత్వం నియమించాలని ఆదర్శ రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.ఉమ్లా నాయక్ డిమాండ్ చేశారు. జేడీఏ కార్యాలయంలో సోమవారం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేడీఏ జి.రామారావుకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదర్శ రైతులకు ఉద్యోగభద్రతతోపాటు భీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఆదర్శ రైతు నెల జీతం *1000 నుంచి *6900కు పెంచాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్‌కార్డులు జారీ చేయాలన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే ఎక్స్‌గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఆదర్శరైతుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంచాలన్నారు. ఆదర్శ రైతులను నియమించిన దేవుడు దివంగత వైఎస్ఆర్ అని ఉమ్లా కొనియూడారు. ఆద ర్శరైతు సంఘం స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు న్యాయం సంపత్‌రెడ్డి, జిల్లా నాయకులు కడారి సమ్మయ్య, రాగి ఎల్లారెడ్డి, తిరుపతి, రవి, మాణ్యి, చందర్‌రెడ్డి, సత్యనారాయణ, వీరన్న నాయక్ పాల్గొన్నారు. -
ఆదర్శ రైతులను ఆదుకోవాలి: వైఎస్సార్ సీపీ
ఇందిరా పార్కు వద్ద ధర్నాలో పార్టీల నేతల డిమాండ్ హైదరాబాద్, న్యూస్‌లైన్: వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఎంతో కృషి చేస్తున్న ఆదర్శ రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వివిధ పార్టీలకు చెందిన నేతలు డిమాండ్ చేశారు. తమకు కనీస వేతన చట్టం ప్రకారం రూ. 6,900 జీతం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బీమా తదితర డిమాం డ్లతో ఆదర్శ రైతులు ఇక్కడి ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మంగవాళం ధర్నా చేశారు. దీనికి పలు పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు, ప్రభుత్వ అధికారులకు అనుసంధానం చేయడానికి వైఎస్ ఆదర్శ రైతుల వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు. ఆ తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేత కె. కేశవరావు మాట్లాడుతూ.. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో అనుసరిస్తున్న విధానాలు బాగా ఉన్నాయని, ఆయన్ని రైతులు ఆదర్శంగా తీసుకోవాలని సూచిం చారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఆదర్శ రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరారు. ఈ ధర్నాలో ఎంపీ వివేక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విజయరామారావు, చిరుమర్తి లింగయ్య, సీపీఐ నేత రామకృష్ణ తదితరులు ప్రసంగించగా.. రైతు సంఘాల నేతలు పశ్య పద్మ, యాదవ్, కుమార స్వామి, ఎన్.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.