- మమ్మల్ని నడిరోడ్డు పాలు చేస్తారా?
- జిల్లా ఆదర్శ రైతుల సంఘం కార్యదర్శి కామేశ్వరరావు
- ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదర్శ రైతుల ర్యాలీ
చింతపల్లి రూరల్ : దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులను ఆదర్శ రైతులుగా నియమించి బతుకు మార్గం చూపిస్తే టీడీపీ ప్రభుత్వం తమ కుటుంబాలను నడి రోడ్డున పడేయాలని చూస్తోందని జిల్లా ఆదర్శ రైతుల సంఘం కార్యదర్శి ఉగ్రంగి వెంకట కామేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలో ఆదర్శ రైతులతో పాతబస్టాండ్ జంక్షన్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2007లో 1269 జీఓ విడుదల చేసి తమను ఆదర్శ రైతులుగా నియమించారన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి రైతులకు మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తూ ప్రతి పంచాయతీలో 300 కుటుంబాలకు వ్యవసాయపరంగా పరిజ్ఞానం అందించే దృక్పథంతో తమకు నెలకు రూ.1000 వేతనం చెల్లిస్తూ సేవలు పొందారన్నారు.
గత ప్రభుత్వంలో 18 శాఖలను అనుసంధానం చేసి నెలకు రూ.3 వేలు వేతనాన్ని కూడా కల్పిస్తామని నిర్ణయం తీసుకున్నామన్నారు. కనీసం ఈ ప్రభుత్వం ద్వారా కూడా ఉన్నటువంటి తమకు ఉద్యోగ భద్రతతోపాటు వేతనాలు పెంచాలని ఎంతో ఆశతో ఉన్నామన్నారు. ఉన్న వేతనాలు పెంచకపోగా పూర్తి గా తమను నడిరోడ్డుపై విసిరేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కేవలం జిల్లాలోని 1500 మంది ఆదర్శరైతు కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయం తో వీధుల్లోకి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన ఈ ప్రభుత్వం కనీస వేతనాలతో విధులు నిర్వహిస్తున్న మాలాంటి ఆదర్శ రైతులను తొలగించాలని నిర్ణ యం తీసుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు.
ఇకనైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అనంతరం స్థానిక తహశీల్దార్ అంబేద్కర్ వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో 17 పం చాయతీలకు చెందిన ఆదర్శ రైతులు పాల్గొన్నారు.