రైతులు పంటల బీమా కోసం చెల్లించిన డబ్బులో కొంత మొత్తాన్ని ఆదర్శ రైతులు స్వాహా చేసినట్లు తేలింది.
సిద్దిపేట రూరల్ : రైతులు పంటల బీమా కోసం చెల్లించిన డబ్బులో కొంత మొత్తాన్ని ఆదర్శ రైతులు స్వాహా చేసినట్లు తేలింది. దీంతో సిద్దిపేట మండలం తోర్నాల గ్రామంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న పంటలబీమా అవకతవకల విచారణ బుధవారం తెరపడింది. రూరల్ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద రైతుల సమక్షంలో విచారణ జరుపగా, గ్రామంలో 232 మంది రైతులు 43 హెక్టార్లకు చెల్లించిన బీమా డబ్బులో కొంత మొత్తాన్ని ఆదర్శ రైతులు సొంతానికి వాడుకున్నట్లు తేలింది.
ఆదర్శ రైతులు పంటల బీమా పేరుతో చిన్న, సన్నకారు రైతుల నుంచి వసూలు చేసిన రూ.22,490, పెద్ద రైతుల నుంచి వసూలు చేసిన రూ. 3,200 వాడుకున్నట్లు విచారణలో తేలింది. ఈ సందర్భంగా ఏఈఓ హన్మంతారెడ్డి మాట్లాడుతూ, పంటల బీమా డబ్బుల అవకతవకలపై నాలుగు రోజులుగా విచారణ చేయగా, ఆదర్శరైతుల బండారం బయట పడిందన్నారు. గ్రామంలో 373 మంది రైతులు మొక్కజొన్న పంటకు బీమా చేయించుకోగా, ఆదర్శ రైతులు చిన్న, సన్నకారు రైతుల నుంచి రూ. 237, పెద్ద రైతుల నుంచి రూ. 263 చొప్పున వసూలు చేశారు.
అయితే పంటల బీమా కోసం రైతులు చెల్లించిన డబ్బులను డీడీ తీయాల్సిన ఆదర్శరైతులు అవకతవకలకు పాల్పడ్డారు. రైతుల పొలం విస్తీర్ణాన్ని తక్కువగా చూసి బీమా డబ్బు చెల్లించారని ఏఈఓ తెలిపారు. ఈ అవకతవకలన్నీ బయటపడడంతో ఆదర్శ రైతులు తమ తప్పులు ఒప్పుకుని స్వాహా చేసిన సొమ్ము తిరిగి చెల్లిస్తామని ఒప్పుకున్నట్లు ఏఈఓ పేర్కొన్నారు. అంతకుముందు గ్రామ పంచాయతీ వద్ద జరిగిన విచారణలో సందర్భంగా గ్రామానికి చెందిన శీలం బాబు అనే వ్యక్తి గ్రామ ఎంపీటీసీ యొదుల్ల నర్సింలును బహిరంగంగా దూషించారని, దీంతోఎంపీటీసీ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరమేశ్వర్‌గౌడ్ ఉన్నారు.