ఆదర్శ రైతుల వ్యవస్థకు తెరపడనుందా.. ప్రభుత్వం వారి సేవలకు ఇక మంగళం పాడనుందా..?
చేవెళ్ల: ఆదర్శ రైతుల వ్యవస్థకు తెరపడనుందా.. ప్రభుత్వం వారి సేవలకు ఇక మంగళం పాడనుందా..? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాలే వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో రైతులకు పంటల సాగులో అన్ని విధాలా అండగా ఉండి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఏడేళ్ల క్రితం ఏర్పాటుచేసిన ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.
ఇందుకు సంబంధించిన చర్యలను శరవేగంగా జరుపుతున్న తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజనలో భాగంగా 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు కావడం, కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, పాలనాపరంగా ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఆదర్శ రైతుల వ్యవస్థను కూడా రద్దుచేయాలని నిర్ణయానికి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఓ అధికారిక కార్యక్రమంలో చేసిన విస్పష్ట ప్రకటన ఈ విషయాన్ని మరింత బలపరుస్తోంది.
మరో అడుగు ముందుకేసి క్షేత్రస్థాయిలో ఇన్‌పుట్ సబ్సిడీ, రుణమాఫీకి అర్హులైన లబ్ధిదారుల జాబితాలను సిద్ధంచేయండి, భవిష్యత్‌లో ఆదర్శరైలుండరంటూ ప్రకటించారు. ఈ వ్యవస్థ రద్దుకు ఆ శాఖ మంత్రి ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి రాగానే ఫైలుపై సంతకం చేస్తారని సమాచారం.
రైతులకు చేదోడువాదోడుగా ఉంటారని..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఆదర్శరైతుల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం వీరికి నెలకు వేయి రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించి అమలు చేశారు. జిల్లాలో సుమారు వేయిమందికిపైగా ఆదర్శ రైతులున్నారు. ఈ వ్యవస్థ ప్రదాన ఉద్దేశమేమిటంటే.. రైతులకు పంటసాగులో సూచనలు, సలహాలు ఇవ్వడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అతివృష్టి, అనావృష్టి సమయంలో పంటలకు నష్టం వాటిల్లినట్లైతే పరిహారాన్ని అంచనా వేయడంలో అధికారులకు సహకారం అందించాలి.
పంటల సస్యరక్షణ చర్యల్లో రైతులకు అవగాహన కల్పించడం, ప్రభుత్వం ఇస్తున్న పలు పథకాల సబ్సిడీలను తెలియజేయడం, ఆధునిక యంత్ర పరికరాలను పరిచయం చేసి వాటి ద్వారా సాగులో మార్పులు తీసుకురావడం తదితర కార్యక్రమాలను ఆదర్శ రైతులను చేయాలని నిర్ణయించారు. ఒక మాటలో చెప్పాలంటే వ్యవసాయశాఖకు, రైతులకు మధ్య వారధిగా పనిచేయాలని అప్పట్లో వైఎస్సార్ ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16వేల 820 మంది ఆదర్శ రైతులకు ఉద్వాసన పలికితే ఏటా సుమారు రూ. 20కోట్ల 18 లక్షల ప్రజాధనం ప్రభుత్వానికి ఆదా కానుందని అధికారులు అంచనా.
ఆదిలో బాగానే ఉన్నా..
ఆదర్శరైతుల వ్యవస్థ ఆదిలో బాగానే ఉన్నా వైఎస్సార్ మరణానంతరం పక్కదోవ పట్టింది. ఆదర్శరైతులు క్షేత్రస్థాయిలో జవాబుదారీగా పనిచేయకపోవడం, రాజకీయ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలను, గ్రామాలలో నివాసం ఉండనివారిని నియమించడం, వ్యవసాయంలో అనుభవం లేనివారిని తీసుకోవడం, సస్యరక్షణ చర్యలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన లేనివారిని, ప్రజాప్రతినిధులను తీసుకోవడంతో వ్యవస్థ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. పైగా పంటనష్టం జరిగిన సమయాల్లో తప్పుడు నివేదికలిచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఈ వ్యవస్థ రద్దు చేసేందుకే ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.